Wednesday, April 12, 2023

- 19🌹 👌మనోదేహాలు దైవాధీనాలే 👌

 [4/12, 08:07] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 19🌹
👌మనోదేహాలు దైవాధీనాలే 👌
 ✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, 
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

🌈 *19. మనోదేహాలు దైవాధీనాలే* 🌹

✳️ ఎంతటి మహా వృక్షానికైనా బీజం ఎలా అయితే ఆధారంగా వుందో ప్రతి ప్రాణికీ ఆత్మగా ఆ దైవమే ఆధారంగా వుంది. మనం వివిధ రూపాలతో కొలిచే దైవాన్ని శక్తిరూపంగా తెలుసుకున్న రోజు ఆ దైవం ఆ విశ్వానికి ఎలా ఆధారమయ్యాడో తేటతెల్లమవుతుంది. ఆ శక్తే మన మనోదేహాలను నడుపుతుంది.

✳️ మన మనసు చేసే ఆలోచనలు, శరీర కదలికలు దేనిలోనూ మనం పూర్తి స్వతంత్రులం కాదు. కొద్దిగా సూక్ష్మదృష్టితో ఆలోచిస్తే ఈ విషయం అవగాహన అవుతుంది. మనసు, శరీరం పూర్తిగా దైవాధీనమని గుర్తించడమే భక్తి. దీనిని సదా మననం చేయటమే శరణాగతి. మనం ఏ పని చేయాలన్నా ముందు ఆలోచన కావాలి. వచ్చిన ఆలోచనను మనదిగా భావిస్తున్నాం, కానీ ఆ ఆలోచన రావడంలో మన ప్రమేయం ఎంత అని ప్రశ్నించుకోవాలి. ఏదో ఒక ప్రేరణతో మన ఆలోచనలు సాగుతున్నాయి కాబట్టే మనకిష్టమైన ఆలోచనలు మాత్రమే చేయడం సాధ్యం కావడంలేదు. అందుకే తప్పు అని తెలిసి కూడా చెడు ఆలోచనలు మానుకోలేకపోతున్నాం. మనం ఒక నిమిషం తరువాత ఏమి ఆలోచిస్తామో చెప్పలేనంత అస్వతంత్రులం. అలాంటప్పుడు ఆలోచన నాదేనని అనుకోవడం సరికాదు. విధి ప్రేరణతో ఎంతో మంది ప్రమాదాలు కోరి తెచ్చుకోవడం, వాటికి ఎదురెళ్ళి ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తూనే వున్నాం. అలోచన మనచేతిలో ఉంటే... ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత అటు వెళ్ళకపోయినా బాగుండేదనీ, అలా చేయకుండా వుండాల్సిందని విచారించడం వంటివి జరగవుకదా! ఆలోచనా విషయంలో మనిషి స్వతంత్రుడే అయితే నేను ఫలానా ఆలోచన చేయబోతున్నాను అని చెప్పడం సాధ్యమై ఉండేది. కానీ అలా జరగటంలేదు. దీనిని బట్టి మన మనసు ఆలోచన విషయంలో అస్వతంత్రమని తెలుస్తుంది.

✳️ ఇక శరీరం విషయానికొస్తే బాహ్యంగా జరిగే పనులను మాత్రమే మనం తెలుసుకోగల్గుతున్నాం. మనం ఏపని చేయాలన్నా.. మనసు శరీరాన్ని ప్రేరేపించాలి. శరీరం చేసే పనులన్నింటికీ ఆలోచనలే కారణం. ఈ ఆలోచనల విషయంలో మనం అస్వతంత్రులం కనుక మనం చేసే పనుల విషయంలో కూడా మనం అస్వతంత్రులమనే చెప్పాలి. మన వల్ల జరిగే పొరపాట్లు, తప్పిదాల విషయంలో సాధారణంగానే ఈ సూత్రాన్ని ప్రవృత్తిని మార్చలేనిదే అన్వయింపచేస్తాం కానీ మన వల్ల జరిగే మంచి పనులు, మనం పొందే కీర్తి అంతా మన గొప్పదనమేనని భావిస్తాం. సాధకులకు ఇది సరిపడదు. ప్రతి విషయంలోనూ తాను నిమిత్త మాత్రుడనేనన్న సత్యాన్ని గ్రహిస్తేనే అతనికి శాంతి లభిస్తుంది.

✳️ బాహ్యకర్మలలో కూడా అనుకోకుండా చేసే అనేక పనులను మనం గమనిస్తూనే వుంటాం. సూక్ష్మంగా గ్రహిస్తే ఏదో ఒక అంతర్గత శక్తి ఆలోచన కన్నా వేగంగా మనతో ఆ పని చేయించిందని తెలుసుకోగల్గుతాము. శరీర కర్మలు రెండు రకాలు. బాహ్యంగా మనకి తెలిసి జరిగే పనులు కొన్ని అయితే, శరీరం లోపలి భాగాల్లో తెలియకుండా జరిగే పనులు మరెన్నో వున్నాయి. మన శరీరం లోపల జరిగే ఏ పనిలోనూ మన ప్రమేయమేమీ లేదనే విషయం మనకు తెలిసిందే. మన ఆలోచనతో నిమిత్తం లేకుండానే జన్మించింది మొదలు మరణించే వరకు ఈ శరీరాన్ని నిలిపి ఉంచే ఒకానొక దైవశక్తి మన ఆలోచనలకు, పనులకు ఆధారంగా వుంది. సాధకుడు ఈ విధంగా ఆలోచిస్తే సృష్టిలో జరిగే ప్రతి పని దైవకార్యంగానే దర్శించగలుగుతాడు.

✳️ దైవాన్ని స్వార్థపూరిత దృష్టితో చూడటం ఆయన విశాలత్వాన్ని తగ్గించటమే అవుతుంది. ఈ సంకుచిత భావన భగవంతుని దయను అర్థం చేసుకోకుండా అడ్డు పడుతుంది. మన ఇష్టాయిష్టాలను బట్టి దైవాన్ని కొలవటం సరికాదు. మనకు లభించే ఫలాలను బట్టి కాకుండా తాను నిమిత్తమాత్రుడనన్న భావనతో మాత్రమే ఆ దైవం యొక్క తత్వం బోధపడుతుంది. లౌకిక జీవనంలో బాహ్య దృష్టికి అలవాటుపడ్డ మనిషి ఇంత సూక్ష్మంగా ఆలోచించలేక దైవానికి దూరమౌతున్నాడు. శ్రీ రమణ భగవాన్ చూపిన విచారణా మార్గం మన మనస్సుకు ఆ సూక్ష్మదృష్టిని ఇచ్చి సత్యదర్శనానికి ఉపకరిస్తుంది. ఆత్మ విచారణా మార్గమంటే మన మనస్సును, దాని పోకడలను, స్వరూప స్వభావాలను విశ్లేషించడమే! కన్పించని మనస్సునే..  సూక్ష్మ శరీరం అంటారు. మనం ఈ శరీరానికి పేరు పెట్టామని భావిస్తాంగానీ, పుట్టకతోనే కోమాలో వున్న శిశువుకు ఎవరూ పేరు పెట్టరు. ఎందుకంటే అక్కడ పేరుకు ప్రతిస్పందించే మనసు లేదు కదా! మనం పేరు పెట్టి పిలిచేది, పిలిచినప్పుడు పలికేది సూక్ష్మ శరీరమైన మనసే. మన మనసు ఈ శరీరాన్ని దాటి పనిచేయలేదు. ఆత్మ జ్ఞానులైన మహానుభావుల మనసు ఈ విశ్వమంతా వ్యాపించి వుంటుంది. అందుకే మన సూక్ష్మ శరీరమైన మనస్సులో వారి నామాన్ని స్మరించగానే విశ్వమంతా నిండిన వారి సూక్ష్మ శరీరం మన మనస్సును స్పృశిస్తుంది. ఏ నామమైనా మనం కొలిచే దేవుని రూపానికి చెందిన సూక్ష్మశరీరానికే వర్తిస్తుంది. అందుచేతనే నామజపంలో మనసు మన ఇష్ట దైవంతో మమేకం కాగలుగుతుంది. పాము తన శరీరంతో స్పర్శనూ, శబ్దాన్నీ తెలుసుకున్నట్లే మన మనసు బాహ్యమైన ఈ దేహంతో పాటు తనకు మూలమైన దైవాన్ని కూడా తెలుసుకోగల్గుతుంది. కాని లౌకిక దృష్టి, కోర్కెలు మనస్సును నిరంతరం ఈ దేహ సేవకే పరిమితంచేసి అంతర్దృష్టి లేకుండా చేస్తున్నాయి.
[4/12, 08:07] +91 73963 92086: ✳️ మనిషికి ఈ దేహ భావన, కోరికలు తగ్గటానికి సద్గుణ సంపద అవసరం. ఎన్ని జపాలు, కర్మకాండలు చేసినా మంచి గుణాలు అలవడనిదే ఆధ్మాత్మికత ఫలించదు. మనసుకు దేహ భావన తగ్గిస్తేనే తన సహజ రూపం అయిన దైవాన్ని తెలుసుకోగలుగుతుంది. అదే పరమాత్మ. ఒకప్పుడు దూరంగా నీటిని చూసిన జ్ఞాపకం వల్లనే ఎడారిలో ఎండమావులు మనల్ని మోసం చేయగల్గు తున్నాయి. అలాగే సుఖసంతోషాలనే జ్ఞాపకాలు మన జీవితంలో ఎన్నో ఎండమావులను సృష్టిస్తున్నాయి. ఒకనాటి భ్రమ (నిజం) మరొకప్పటి భ్రమకు కారణమవుతుంది.  కానీ, సత్యం ఏనాడూ భ్రమను కల్గించదు. మన శరీరంలో జరిగే మార్పులు నిజమైతే మారని ఆత్మ ఉనికి సత్యం. నాదమే దాని స్వరూపం. నాదమంటే అక్షరాలు లేని శబ్ధం. అదే మనం సర్వత్రా వినే ఓంకారం. వేడి చేయాలన్న ధర్మాన్ని మరచి పాలు తోడు వేస్తే ఫలితం లేనట్లే వైరాగ్యంలో కాలని మనస్సు ఎన్ని పూజలు చేసినా శాంతిని సాధించలేదు. భగవంతుడు మనలో మనసు రూపంలో వుంటాడు. అది నిరంతరం శాంతిని, ఆనందాన్ని కోరుతుంది. బాహ్యంలో అవి శాశ్వతంగా లభించవని తెలుసుకొని దైవాన్ని ఆశ్రయిస్తుంది. సాధనలో ఆ దైవం తన మూలంలోనే వుందని తెలుసుకొంటుంది. మనం కష్టాలను, దుఃఖాలను భరించలేకపోవటానికి కారణం అవి మనకు మాత్రమే వస్తున్నాయని అనుకోవటం వల్లనే. కాని ఈ లోకంలో అవి లేని మానవుడే లేడని గ్రహిస్తే వేదన తగ్గుతుంది. మనలోనే వున్న దైవం ఎప్పటికైనా మనం తన సన్నిధానాన్ని కోరతామనే ఆశతోనే మనస్సులో వుండి మన కోర్కెలన్నీ తీరుస్తున్నాడు.

✳️ భగవంతుడు ప్రతి శరీరాన్నీ తనంతటి శక్తిని నింపి ఈ లోకానికి పంపుతాడు. సాధనలో తరించిన జ్ఞానులు, యోగులు మాత్రమే ఆ విషయం తెలుసుకొని ఉపయోగించుకోగల్గుతారు. మన మనసు ఈ శరీరంతో ఏర్పర్చుకున్న బంధం వల్ల దైవభావన నుండి విడిపోతుంది. ఈ శరీరంతో కలిసి వున్నప్పటికీ బంధాన్ని తగ్గించుకుంటే దైవాన్ని తెలుసుకోగల్గుతుంది. వయసు పెరుగుతుందని అనుకుంటాం. గానీ, ముసలితనం వస్తుందని తెలుసుకోలేనంత అజ్ఞానంలో ఉన్నాం. రైలులో పరిచయమైన సహ ప్రయాణీకులతో ఎలా మెలుగుతామో మన దేహంతో మనసు పరిమితమైన అనుబంధంతోనే వుండాలి. ఈ దేహం అసత్యం కాదుగానీ పనులన్నీ అదే చేస్తుందని అనుకోవటం అసత్యం. అలాగాక ఈ దేహాలన్నీ ఆత్మశక్తితోనే కదులుతున్నాయని భావించినప్పుడు మాత్రమే అవి సత్యాలవుతాయి. ఈ ప్రకృతి యావత్తూ బ్రహ్మ పదార్థంతో మాత్రమే నిలిచి వుందని తెలుసుకోవాలి. ఒక చెట్టు పచ్చదనం, ఫలాలు, ఆకులు, ఆకారం అన్నీ అందులో జీవం ఉన్నంతవరకే కదా! జీవమే బ్రహ్మపదార్థం.

✳️ ఏ ఆధ్యాత్మిక సాధనైనా మన నిత్య జీవనంలో మార్పును తీసుకురావాలి. అలా కానప్పుడు ఆ సాధన నిష్ఫలం. దెయ్యాన్ని ఊహిస్తేనే భయం కల్గుతున్నప్పుడు, దైవ భావన వున్నవారిలో శాంతి రాకపోతే ఎలా! పూజలైనా, జప తపాలైనా మనని దైవం వద్దకు చేర్చలేవు. కేవలం భయంతోనో, కోర్కెతోనో కాక వివేకంతో దైవాన్ని ధ్యానించాలి. లేకపోతే శ్రీకృష్ణుడ్ని దర్శించినా బుద్దులు మారని ధృతరాష్ట్రుడితో మనం సమానం అవుతాం. కోరినా, కోరకపోయినా కర్మ ప్రకారం లౌకిక ఫలాలు మనకు అందుతూనే వుంటాయి. కానీ భగవత్ దర్శనం మాత్రం మనం కోరుకుంటేనే జరుగుతుంది. ఈ దేహానికి రాసిపెట్టిన అనుభవాలు ఎటూ తప్పవు కనుక వాటిని అనుభవిస్తూనే దైవాన్ని దర్శించాలనే నిరంతర తపన ఉండాలి. అదే మనని దైవం దరికి చేర్చే శుభేచ్ఛ.


   🙏 ఓం నమోభగవతే శ్రీరమణాయ🙏

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

No comments:

Post a Comment