Sunday, April 23, 2023

భక్తిని మించిన శక్తి లేదు

 🪔🪔 భక్తిని మించిన శక్తి లేదు🪔🪔

🌹తిరుమల ఆనంద నిలయంలో బ్రహ్మస్థానమనే దివ్య ప్రదేశంలో శ్రీ వేంకటేశ్వరస్వామి అర్చా రూపంలో స్వయం వ్యక్తమూర్తిగా నిలిచి భక్తులను అనుగ్రహిస్తారు. తన దివ్య పాదాలే పరమార్థమని చూపించే వజ్ర కవచ వరదహస్తంతో శోభిల్లే కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించే భక్తుల ఆనందం వర్ణనాతీతం.
🌹 హరిపాద సేవతో పాపాలు నశిస్తాయి.

🌹గోవిందనామస్మరణ మనోధైర్యాన్నిస్తుంది.

🌹శరణాగతవత్సలుడి ముందు శిరస్సువంచిన భక్తుడి మనసు పావనమై ప్రశాంత నిలయమవుతుంది.
🌹దానవులు, దైత్యులు, నరులు, గంధర్వులు ఎవరైనా లక్ష్మీపతి పాదపద్మాలను సేవిస్తేనే
పుణ్యాత్ములవుతారని, తన మనసు దివ్యమైన విష్ణుపాదాలను ధ్యానించడంలోనే పరవశించి ఆనందిస్తుందని చదువులలో మర్మమెల్ల గ్రహించిన ప్రహ్లాదుడు భక్తితత్వాన్ని వివరించాడు. 
🌹సాటి లేని శాంతస్వభావుడు సర్వలోక రక్షకుడైన శ్రీహరి భక్తుల హృదయాల్లో ప్రకాశించే పాదపద్మాలు కలవాడని నారదుడు ధ్రువుడికి ఉపదేశించాడు.

🌹ధర్మార్థకామమోక్షాలనే నాలుగు విధాలైన
పురుషార్థాలను పొందాలనుకునే వారికి శ్రీహరి
పాదపద్మాలను సేవించడం తప్ప మరో మార్గంలేదు.

🌹ఆది మధ్యాంతాలు లేని విష్ణుపాద దర్శనం తమకు శుభాన్ని కలిగిస్తుందని బ్రహ్మాది దేవతలు ఒక సందర్భంలో వెల్లడించారు. అపారమైన భక్తితో శ్రీహరి పాద పద్మాలను సేవించే వరం ప్రసాదించమని ఇంద్రుడు ప్రార్ధించాడు.

🌹 శ్రీకృష్ణభగవానుడు ప్రాణులందరికీ నేత కనుక దేవతలందరూ అతడి దివ్య చరణాలపై శిరసు వంచుతారు. శ్రీకృష్ణుడు తనను ఆశ్రయించిన వారిని ఆదరిస్తాడు. శరణాగతులను రక్షిస్తాడు. కనుక వాసుదేవుడికి ప్రణమిల్లాలని పరమేశ్వరుడు. హిమాలయ శిఖరం మీద మునీంద్రులకు తెలియజేసినట్లు భారతం చెబుతోంది. అంతటి మహిమాన్విత పాదపద్మాలను మనసులో ప్రతిష్టించుకుని ధ్యానించే అవకాశం లభించిన మానవుడు అత్యంత భాగ్యశీలి.

🌹బాలకృష్ణుడి ప్రచండ తాండవానికి కాళీయుడి తల చితికిపోయింది. కాళియుడు శ్రీకృష్ణుణ్ని శరణువేడి సముద్రంలోకి వెళ్ళిపోయాడు. శరణు కోరినవారిని రక్షించే శ్రీవారి పాదాలే దుష్టులను శిక్షిస్తాయి. ఏడు దీపాలతో కూడిన భూమండలానికి రాజైన అంబరీషుడి మనసు శ్రీహరి పాదాల మీద, మాటలు హరిగుణ సంకీర్తనలపై చూపులు గోవిందుడి రూపాన్ని తనివితీరా చూడటం పట్ల లగ్నమై ఉండేవంటారు. అంబరీషుడి భక్తితత్పరత అందరికీ అనుసరణీయం.

🌹భక్తుల ప్రేమబంధానికి చిక్కిన తాను ప్రేమతో వారివెంటే ఉంటానని, తనను నమ్ముకున్న ఎవరినైనా తాను వదిలిపెట్టనని, తన భక్తులకు తానే దిక్కని శ్రీ మహావిష్ణువు దుర్వాసమహర్షికి చెప్పినట్లు భాగవతం వెల్లడిస్తోంది.
🌹 విష్ణుపాదమందిరం గయలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అక్కడ విష్ణుపాద ముద్రగల రాతిబండను భక్తులు పూజిస్తారు. ఆ క్షేత్రంలో చేసే పితృకార్యాలు ఏడు తరాలను ఉద్దరిస్తాయని భక్తుల విశ్వాసం. 
🌹బదరీనాథ్ దగ్గర చరణపాదుక అనే ప్రదేశంలో ఒక రాతిపై శ్రీమహావిష్ణువు కాలి అడుగుల ముద్రను దర్శించవచ్చు.

🌹భక్తికి మించిన శక్తి లేదన్నది నిర్వివాదాంశం.

🌹 ఎన్నో జన్మల పుణ్యఫలంగా లభించిన మానవజన్మ మహిమాన్వితమైన శ్రీహరి పాదపద్మాలను ఆరాధించడం ద్వారా సార్ధకం కాగలదని గ్రహించాలి.🙏

-ఇంద్రగంటి నరసింహమూర్తి

No comments:

Post a Comment