బలగమే బలం
---------------------
---హెచ్. రవీందర్
బలగం సినిమా చూసిన.
గుండెలో గూడు కట్టిన దుఃఖం తన్నుకొచ్చింది. సినిమా చూసిన తరువాత కూడా చాలా సేపు మౌనం. గుండెలో ఏదో అర్థం కాని వేదన.
మెచ్చుకోలు సమీక్షలు, ఎత్తి పట్టడాలు, ఎత్తి చూపడాలు, వీరతాళ్ళు, మూతివిరుపులు ఏ సినిమాకు లేనంతగా బలగం సినిమాకు వచ్చాయి. వస్తున్నాయి."ఈ సినిమా చూసి ఏడవని వాళ్లు మనుషులే కాదనీ", "తెలంగాణ గ్రామీణ జీవితపు మాధుర్యాన్ని చూపిన సినిమా అనీ" "పియ్యి తినెడి కాకి పితరుడెట్లాయెననీ" "తెలంగాణ సంస్కృతి పేరిట మద్యం సేవనాన్ని గ్లోరీఫై చేస్తున్నారనీ " రకరకాల వ్యాఖ్యనాలు, విమర్శలు సోషల్ మీడియా నిండా పర్చుకొంటున్నాయి. అయినా రోజు రోజుకు సినిమా చూసే వారి సంఖ్య పెరుగుతోంది. బలగాన్నంతటిని పిల్సుకుని మరీ బలగం సినిమా చూస్తున్నారు.
ఇంతకీ... సగటు ప్రేక్షకులకు ఈ సినిమా ఇంతగా నచ్చడానికి కారణాలేమిటి? నా చిన్నతనంలో వచ్చిన పౌరాణిక సినిమాల తరువాత ఈ సినిమాను అత్యధికంగా చూడటాన్ని నేను చూస్తున్నాను.
గత నలభై యాభై యేండ్లుగా మన దేశంలో వ్యవసాయం దండగమారి రంగంగా క్షీణిస్తోంది. కరువులు, వరదలు, పాలకుల విధానాల లోపాలు, యాంత్రీకరణ వల్ల వ్యవసాయ రంగం నుండి బలవంతంగా ప్రజలు నెట్టివేయబడుతున్నారు. దిగుబడుల తగ్గుదల, గిట్టుబాటు లేకపోవడం, కొన్ని సందర్బల్లో కూలీలు దొరకకపోవడం,మరి కొన్ని సందర్భాల్లో కూలీలకు వ్యవసాయ పనులు దొరకకపోవడం వంటి సంక్షోభపు వికృత క్రీడలు అధికమయ్యాయి . ఫలితంగా వ్యవసాయ రంగం నుండి ప్రజలు దినసరి కూలీలుగా, భవన నిర్మాణ కూలీలుగా పనిదొరికిన కాడికి వలసెల్లిపోతున్నారు.వ్యవసాయదారులు తమ బిడ్డలెవరూ సేద్యం చేయవద్దని, వాళ్ళను పెద్దపెద్ద చదువులు చదివిస్తున్నారు. వాళ్లు ఉద్యోగరీత్యా ఇంటిని, బలగాన్ని, ఊరినీ విడిచి పట్నాలకు వెళ్లిపోతున్నారు.
ఇంటిల్లిపాదీ వ్యవసాయంలో నిమగ్నమైన రోజుల్లో ఉమ్మడి కుటుంబాల అవసరం ఉండేది. మారిన పరిస్థితుల్లో ఆ అవసరం లేదు.అయితే, ఆనాటి ఉమ్మడి కుటుంబాల్లో ఒకర్పట్ల మరొకరు ప్రేమాప్యాయతలు కలిగివుండడమే కాక ప్రదర్శించే తీరిక సమయమూ దొరికేది.బతుకమ్మ పండుగ రోజున అన్నదమ్ములెల్లి పూలు తెంపుకురావడం,చాద బాయి నుండి నీళ్లు చేదడం వంటి పనుల్లో పరస్పర సహకారం తొ పాటు ఈ ఆప్యాయతలూ ఉండేవి.
ఈ ఉమ్మడి బతుకుల విచ్చిన్నతతో ఆ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ జీవితాలను కొనసాగిస్తున్నారు.
రోజూ పది పన్నెండు గంటల పాటు ప్రయివేటు ఉద్యోగాలు, కూలీ పనులు.. పక్క మనిషిని కూడా పట్టించుకోని జీవన పరుగులు... వెరసి మనిషి పలకరింపు, పరామార్ష కోసం మొఖం వాచిపోయి వున్నాడు. అంతే కాదు గతంలో కంటే సమాజంలో శరవేగంగా వస్తున్న మార్పులు, కొత్త కొత్త విధానాలు, నయా మోసాలు మనుషులను భయకంపితులను చేస్తున్నాయి.కోవిడ్, కోవిడ్ అనంతరం కాలం పేద మధ్యతరగతుల్లో అభద్రతనూ పెంచాయి. ఇంతటి ఆందోళనకర పరిస్థితుల మధ్య...ఇగో.. ఈ బలగం సినిమా మనిషి మనిషినీ పలకరిస్తోంది. ఈ సినిమా చూస్తోన్న ప్రతి మనిషీ ఆ సంఘటనలు తమ ఇంట్లో జరిగిన సంఘటనలతో పోల్చుకుంటున్నారు. ఆ కథతో తాధాత్మ్యం చెందుతున్నారు.కుటుంబాలే కాదు ఊరు ఊరంతా ఒక్కటై ఈ సినిమా చూస్తున్నారు.అందుకే ఇది ఒక్క తెలంగాణ కే కాకుండా ఉమ్మడి రాష్ట్ర ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటోంది.
ఈ కథ చెప్పే విధానంలో జానపద కళారూపాలను అద్భుతంగా వాడుకున్నారు. ప్రజాకళా రూపాల శక్తి ఏమిటో ప్రజా ఉద్యమాలల్లో మనం చూసి వున్నాము.
డప్పుల దరువుల మధ్య బుడుగ జంగాల పాటతో కథ అద్భుతంగా నడిచింది. పల్లె అందాలను పొగిడే పాట షరా మామూలే. బలగం టీం నిజంగా అభినందనీయులు.
ఇక విమర్శల విషయానికి వద్దాం...
మూఢ నమ్మకాలను పెంచిపోషిస్తుందన్నది అపవాదు మాత్రమే. ఈ సినిమా చూసిన కుటుంబాలు అక్కడక్కడా విభేదాలు మాని కలిసిపోతున్నాయి. పక్షి ముట్టని కుటుంబాలను వెలివేయడం మొదలవుతుందని హేతు వాదులు ఏమాత్రం రంధి పడాల్సిన అవసరం లేదు.
పూలుగు బొక్క కోసం ఇరవై సంవత్సరాలు మాట్లాడుకోకుండా వుంటారా? అన్న ప్రశ్న అమాయకమైనది. పంతాలు, పట్టింపులు వెనుకబడిన సమాజాల్లో తీవ్రంగా ఉంటాయి. ఇరవై రూపాయల కోసం హత్యలు చేసుకోవడం, గట్ల పంచాయితీలు నిత్యం చూస్తూనే వున్నాం కదా.
మానవ సంబంధాల మెరుగుదల పై ఒక స్పార్క్ లాంటి సినిమా ఇది. అది వెలుగులా ఈ సమాజంపై ప్రసారించాల్సి వుంది.దానికి ఈ సినిమా శక్తి సరిపోదు. మరింకేదో కావాలి.
No comments:
Post a Comment