Saturday, August 16, 2025

 *ఒక్కోసారి చిన్న పని అయినా మనల్ని అలసిపోయేలా చేస్తుంది, కానీ కొన్నిసార్లు రోజంతా పనిచేసిన తర్వాత కూడా మనలో ఉత్సాహం, శక్తి ఇంకా ఉంటుంది! కారణం ఏమి అయ్యుండవచ్చు?*


*అసాధారణమైన* *వ్యక్తిత్వం*
*...కథ*

భారతదేశపు నవరత్నాలలో ఒకటైన ఒ ఎన్ జి సి కంపెనీలో ఉద్యోగాన్ని వదిలిపెట్టి, వ్యవసాయ రంగంలో అడుగుపెట్టిన ఆర్ మాధవన్ ది ఒక అసమానమైన వ్యక్తిత్వం.

శ్రీ మాధవన్ కి చిన్నప్పటి నుంచి చెట్లు నాటడం, కూరగాయలు పండించడం అంటే చాలా ఆసక్తి. చిన్నప్పటి నుంచీ తానే స్వయంగా పండించిన కూరగాయలను అమ్మకి తెచ్చి ఇచ్చేవాడు. తల్లి ప్రశంసించడంతో అతనిలో ఉత్సాహం ఇంకా పెరిగింది.

చిన్నప్పటి నుండీ రైతు కావాలన్నది అతని కల. కానీ భారతదేశంలోని దాదాపు ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఇదే జరుగుతుంది, అతన్ని కూడా చాలామంది చాలా రకాలుగా విమర్శించారు,
 'నువ్వు వ్యవసాయం చేస్తావా? ఎంత సంపాదిస్తావు? నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది?' ఇలా...

కుటుంబ ఒత్తిడి కారణంగా మాధవన్ రైతు కావాలనే తన ఆలోచనను అప్పట్లో వదిలేయాల్సి వచ్చింది.

మాధవన్ IIT-JEE పరీక్ష వ్రాసి, IIT చెన్నై నుండి మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీని పొందాడు. చాలా గొప్ప ఉద్యోగం, గొప్ప కెరీర్, ఉజ్వల భవిష్యత్తు అతని ముందు ఉన్నాయి, కానీ ఎవరో చెప్పినట్లు, "బాల్యంలోని ప్రేమను అంత తేలికగా మరచిపోలేం కదా ...."

అంతేకాకుండా, IIT చేస్తున్నప్పుడు, ఈ 'వ్యవసాయం' అనే అభిరుచి అతనికి "జీవనోపాధితో కూడిన సామాజిక సేవ" అనే స్వరూపాన్ని తీసుకుంది. ఒ ఎన్ జి సి లో పనిచేస్తున్నప్పుడు కూడా తన అభిరుచిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించాడు.

నీటి అడుగున ఆయిల్ రిగ్ లో పనిచేసే వారికి వరుసగా 14 రోజులు పనిచేసిన తర్వాత 14 రోజులపాటు వేతనంతో కూడిన సెలవు ఇస్తారు. 14 రోజులు మెకానికల్ ఇంజినీరింగ్ పని, తర్వాత 14 రోజులు కొత్త వ్యవసాయ ప్రయోగాలు, అనుభవాలు.... తొమ్మిదేళ్లు మాధవన్ ఇలా పని చేసాడు.

మాధవన్ మాటల్లో చెప్పాలంటే.. ‘‘ఇన్నేళ్లు పని చేసిన తర్వాత నేను వ్యవసాయం చేయాలనుకుంటున్నాను అని మా నాన్నకు చెప్పినప్పుడు ఆయన నన్ను ఒక వెర్రివాడిగా భావించారు. నాలుగేళ్ల ఉద్యోగంలో నేను కొంత డబ్బు ఆదా చేశాను. దాంతో చెన్నైకి సమీపంలోని చెంగల్ పట్టు గ్రామంలో 6 ఎకరాల భూమి కొన్నాను. 1989లో, ఆ గ్రామంలో ప్యాంటు, షర్టు వేసుకుని వ్యవసాయం చేసిన మొదటి వ్యక్తిని నేనే, ప్రజలందరూ నన్ను ఆశ్చర్యంగా, వింతగా చూసేవారు.”


తన 6 ఎకరాల్లో మొదటి పంట కేవలం 2 టన్నులు మాత్రమే రావడంతో  అతను చాలా నిరాశ చెందాడు, కానీ పట్టుదల కోల్పోలేదు. 1996 సంవత్సరంలోని ఇజ్రాయెల్ పర్యటన అతని జీవితంలో ఒక కీలకమైన మలుపు అని చెప్పవచ్చు. 

'బిందు సేద్యం' , నీటి నిర్వహణ పరంగా ఇజ్రాయెల్ యొక్క సాంకేతికత అత్యుత్తమమని అతను తెలుసుకున్నాడు. అక్కడకు వెళ్లినప్పుడు, ఇజ్రాయిలీలు ఒక ఎకరం భూమిలో ఏడు టన్నుల మొక్కజొన్నను ఎలా పండిస్తారో చూశాడు, అయితే భారతదేశంలో అదే మొక్కజొన్న ఎకరానికి ఒక టన్ను మాత్రమే పండుతుంది.


భారతదేశంలోని ఒక భూభాగంలో 6 టన్నుల టమోటాలు పండిస్తే, ఇజ్రాయెల్  ప్రజలు అదే భూమిలో 200 టన్నుల టమోటాలు ఉత్పత్తి చేయగలరు. 15 రోజుల పాటు ఇజ్రాయెల్ లో ఉండి మాధవన్ అన్ని మెళకువలు నేర్చుకున్నాడు.

మరుసటి సంవత్సరం మాధవన్ USA కి వెళ్లి తన గురువైన డాక్టర్ లక్ష్మణన్ ను కలుసుకుని, అతని వద్ద మరిన్ని అభ్యాస అనుభవాలను అందుకున్నాడు, ఆయన అప్పటి నుండి అతనికి మార్గదర్శకత్వం వహిస్తూ వచ్చాడు.

కాలిఫోర్నియాకు చెందిన NRI, డాక్టర్ లక్ష్మణన్ 1997లో మాధవన్ ను కలిసే సమయానికి, అప్పటికి 35 సంవత్సరాలుగా 50-60,000 ఎకరాల భూమిని ఆయన సాగుచేస్తున్నాడు.

మాధవన్ ఆశయం, అభిరుచి, స్ఫూర్తిని చూసి, ఆయన నిరంతరం అతనికి మార్గదర్శకత్వం ఇచ్చాడు. డబ్బుసంపాదనకు పనిచేసేటప్పుడు మనసుకు కూడా ఆనందం లభిస్తే, పని చేయడంలో ఆనందం రెట్టింపవుతుందని మాధవన్ ని కలవగానే ఆయన గ్రహించాడు.


సుమారు 8 ఏళ్ల నిరంతర పోరాటం, నష్టాలు, నిరాశా నిస్పృహలతో 1997లో తొలిసారిగా వ్యవసాయంలో లాభాలు గడించారు. మాధవన్ మాట్లాడుతూ ''ఇంత కష్టపడినా నేను పట్టు వదలలేదు. ఈ క్రమంలో ఎవరు నాకు మద్దతు ఇచ్చినా, ఇవ్వకపోయినా, నేను పడిపోయినా, మళ్లీ పైకి లేస్తానని, ఇది నేర్చుకునే ప్రక్రియ అని నేను నమ్మాను. నేనే సొంతంగా పోరాడి ఫలితాలు చూపించాలి’’.

1999లో మాధవన్ మరో నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఎకరానికి ఏడాదికి రూ.1,00,000 నికర ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. మధ్య దళారుల సాయం లేకుండా సొంతంగా తన ఉత్పత్తులను తానే అమ్ముకునేవాడు.

మాధవన్ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 300 ఎకరాల భూమిని సాగు చేశారు. అతను ఏర్పాటు చేసిన అతిపెద్ద రైతుల సంఘంలో కేరళలో 4,500 మంది రైతులు, తమిళనాడులో 10,800 మంది రైతులు ఉన్నారు. రైతులతో వర్గాలుగా ఏర్పడి రుణాలు తీసుకునేందుకు సొంతంగా ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఈ సంఘం కసరత్తు చేస్తోంది. తద్వారా మొత్తం వ్యవస్థ నుండి మధ్యవర్తుల, దళారుల పాత్ర తొలగిపోతుంది.

మాధవన్ జీవితంలో మరో బంగారు ఘట్టం వచ్చింది, మాజీ రాష్ట్రపతితో కొన్ని నిమిషాల పాటు జరగాల్సిన సమావేశం రెండు గంటల వరకు సాగింది. ఆఖరికి డా. ఏ పీ జే అబ్దుల్ కలాం గారు 'మన భారతదేశానికి కనీసం ఒక కోటిమంది మాధవులు కావాలి' అని అనకుండా ఉండలేకపోయారు!!

స్వతహాగా చాలా నిరాడంబరంగా ఉండే  శ్రీ మాధవన్ ఇలా అంటారు "నేను కనీసం ఒక్క పారిశ్రామిక వేత్తనైనా  ప్రేరేపించ గలిగితే లేదా సృష్టించగలిగితే, అది నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే డా. కలాం నన్ను అలా చేయమని కోరారు".

*ఎలాంటి సవాలు వచ్చినా, మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకు వెళ్లే మార్గాన్ని కనుగొనండి. పని కష్టమని భావించిన క్షణం మనం అలసి పోతాం. పని చేస్తూ ఉండండి చేస్తున్న పనిని ఆస్వాదించండి..    దాజీ*
 *💥హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం💥*

No comments:

Post a Comment