*స్నేహితుడు మనిషి తత్వం...*
*అందమైన ఇల్లు అది. ఆ ఊరిలోనే సుందర బృందావనం ఆ ఇల్లు. పొందిగ్గా కట్టుకున్న పొదరిల్లు. ఆ ఇంట్లో తండ్రి , ముగ్గురు కొడుకులు ఉంటారు. ఆ ఇల్లు సోంతం చేసుకోవాలని ప్రయత్నించనివారు ఒక్కడు కూడా లేరు ఆ ఊరిలో. ఆ ఇంటికి రెట్టింపు డబ్బు ఇచ్చి కొనుక్కుంటాము అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే ఆ ఇల్లు అమ్మనని గట్టిగా చెప్పాడు తండ్రి.*
*ఒక రోజు పనిమీద వేరే ఊరు వెళ్ళి రాత్రికి ఇంటికి తిరిగి వచ్చాడు తండ్రి. అతని ఇల్లు మంటల్లో కాలిపోతోంది. మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. ఏ ప్రయత్నం చేసినా లాభం లేదు. తండ్రికి ధారగా కన్నీళ్ళు కారిపోతున్నాయి. గుండెల్లో బాధ తన్నుకొస్తోంది. మొదటి కొడుకు ఎక్కడినుంచో పరుగున వచ్చి తండ్రి చెవిలో చెప్పాడు, "ఈ ఇల్లు మద్యాహ్నం ఒకతనికి అమ్మేసాను. ధర ఎంత మంచిది వచ్చిందో తెలుసా, అంత ధర వస్తుంటే వదులుకోబుద్ధి కాక, నీకు చెప్పకుండానే అమ్మేసాను, క్షమించండి నాన్న " అని.*
*అది విన్న తండ్రికి ఏడుపు ఆగిపోయింది, తానూ మిగిలిన అందరి ప్రేక్షకుల్లానే ఇంటిని ఏ భావం లేకుండా చూడసాగాడు. రెండో కొడుకు వచ్చాడు, తండ్రి చెవిలో చెప్పాడు "నాన్న కొనుక్కుంటాను అన్న అతను బయానా(advance) మాత్రమే ఇచ్చాడు, ఇప్పుడు ఇలాంటి ఇల్లు కొంటాడో లేడో మరి" అని చెప్పాడు. తండ్రి కళ్ళల్లో మళ్ళీ నీళ్ళు తిరిగాయి, మళ్ళీ బాధ మొదలయ్యింది.*
*మూడో కొడుకు పరిగెత్తుకుంటూ, ఆయాసపడుకుంటూ వచ్చాడు., అతనూ తండ్రి చెవిలో చెప్పాడు, "నాన్నా కొనుక్కునే అతను మాట మీద నిలబడే మనిషి. అతని దగ్గరికే వెళ్ళి వస్తున్నా, కొంటానని ఒకసారి చెప్పాను కాబట్టి తప్పకుండా ముందుగా అనుకున్న ధరకే ఇల్లు కొనుక్కుంటా, మీకూ ముందుగా తెలీదు, నాకూ ముందుగా తెలీదు కదా ఇల్లుకి ఇలా అవుతుందని అని భరోసా ఇచ్చాడు నాన్న అతను, అని చెప్పాడు. తండ్రి మళ్ళీ ఏ భావమూ లేకుండా నిర్లిప్తంగా అందరితో పాటూ ప్రేక్షకుడు అయ్యాడు.*
*ఇదిగో, ఇలాంటి ఎంతో క్లిష్టమైన, చిక్కుముడుల మనస్తత్వం మనుష్యుల తత్వం. ఇల్లు తనది అనుకున్నప్పుడు అంత బాధ వేసింది అతనికి., అదే వేరొకరిది అనుకోగానే అప్పటివరకు ఇంటిపైన ఉండే అంత ఇష్టమూ, ఇంటితో ఉండే అంత అనుబంధమూ ఎక్కడికి పోయింది. ఒక్కో కొడుకు వచ్చి ఒక్కో మాట చెప్తూ ఉంటే, పదే పదే మారిపోయింది అతని భావమూ, స్వభావమూ. తనది అయితే ఒకలాగా, వేరేవారిదైతే ఒకలాగా అతని ప్రతిస్పందన(reaction) మారుతూ ఉంది. అప్పటివరకు అందంగా ఉన్న ఇల్లంటే అంత ఇష్టం ఉంది, ఎవ్వరికీ ఇవ్వనంటే ఇవ్వనన్నాడు, అదే ఇల్లు తన అందాన్ని కోల్పోతుంటే వేరేవారు తీసుకున్నారంటే ఊరుకున్నాడు, పైగా ఆ ఇంటిపై వచ్చే లాభనష్టాలు బాగా లెక్కలు వేసుకుని, మార్చి మార్చి కొంచెం సంతోషం, కొంచెం బాధ పడ్డాడు. ఇంటిమీద ఉండే ప్రేమని లాభనష్టాలతో బేరీజు వేసుకున్నాడు.*
*ఇప్పటిరోజుల్లో మనమందరం మనుష్యులం బంధాలను,* *స్నేహాలను కూడా ఈ లాభనష్టాల తూకం వేసుకుని నడిపించడానికే ఎక్కువ అలవాటుపడుతున్నాము.*
*ఆ అలవాటు మంచిదో కాదో అసలు ఆ అలవాటు అవసరమో కాదో తేల్చుకుంటే మంచిది. మనిషితత్వం మానవత్వం నుంచి మరతత్వం(machine like), మృగతత్వం వరకూ రానేవచ్చింది. ఇంకెంత అభివృద్ధి కావాలో మనిషి మొత్తం మాయం కావటానికి., మనసన్న మాటే పూర్తిగా మరచిపోవటానికి..*
No comments:
Post a Comment