అరిషడ్వర్గాలు-రాగద్వేషాలు
ప్ర): రాగద్వేషాల నుండి, మోహవ్యామోహాల నుండి బయటపడడం ఎలా?
జ): ఎందుకు బయటపడాలి? ఉండండి లోపల్నే....
* * *
ప్రపంచం వైవిధ్యభరితంగా ఉండాలంటే,
అందరూ రకరకాలుగా ఉండాలి.
అందరూ ఒకే రకంగా ఉంటే,
అంత దరిద్రంగా ఉంటుంది ప్రపంచం.
* * *
అరిషడ్వర్గాలు ఉత్త జడాలు.
స్వతఃగా వాటికి ఉనికి లేదు.
వాటికి ఊపిరి పోసేది నీవే.
నీ సంస్పర్శ వల్లనే వాటికి ఉనికి వస్తోంది...
నీ నుంచి బయట పడడం ఎలా? అని పాపం అవి కూడా ప్రయత్నం చేస్తుంటాయి...
పిల్లి కాలు విరిగింది...
ఉదయం నిద్ర లేవగానే ఎవడి ముఖం చూశానో అని అది కూడా బాధపడవచ్చు.
* * *
అరిషడ్వార్గాలను వాటి మానాన వాటిని వదిలేస్తే,
అవి నిర్దోషులుగానే ఉంటాయి.
కానీ మనం రివర్స్ లో చెప్తాము-
కామ క్రోధాదుల వలన నేను ఇబ్బంది పడుతున్నాను...అని.
నిజానికి మన వల్లనే వాటికి చెడ్డ పేరు వస్తోంది.
* * *
భగవాన్ కూరగాయలు తరుగుతుంటే,
వ్రేలు తెగింది...తడిగుడ్డ చుట్టారు.
ఒకడు ఆ కట్టు చూసి- 'అరె ఏమైంది?' అని అడిగాడు.
'వ్రేలు మీద కత్తి పడింది' అని జవాబిచ్చాడు ఇంకొకడు.
భగవాన్ ఇలా సవరించారు-
వ్రేలు మీద కత్తి పడలేదు, కత్తి మీద వ్రేలు పడింది.
కత్తి జడం, వ్రేలు చైతన్యం. అన్నారు.
అనగా కత్తిని నిర్దోషిగా ప్రకటించారు.
కామక్రోధాదుల విషయంలో కూడా అంతే.
అవి జడం, నీవు చైతన్యం.
* * *
"నేను ఏదీ కాదు" అనైనా ఉండు.
"నేను కానిది ఏదీ లేదు" అనైనా ఉండు.
ఏ సమస్యా ఉండదు.
నేను ఈ సురేష్ ను మాత్రమే అని ఉన్నప్పుడు మాత్రమే అన్ని సమస్యలూ తగులుకుంటాయి.
* * *
ఏ సమస్యకూ ఎవరూ, ఏదీ కారణం కాదు.
తానే సమస్య; తనకు సమస్య కాదు.
అని తెలుసుకున్నప్పుడు ఏ సమస్యా ఉండదు.
* * *
స్వప్నప్రపంచానికి కేంద్రం నేనే అని తెలుసుకునేవరకు
ఏ సమస్యా తెగదు, తెగినట్లు అనిపించినా సరే.
'స్వప్నప్రపంచానికి నేనే కేంద్రం' అని తెలుసుకున్నవాడే
నిజంగా మెలకువలో ఉన్నవాడు.
ఆ మెలకువకే జ్ఞానం, మోక్షం అని పేర్లు.
* * *
ఇతరం తోస్తోందంటే నీవు కలలో ఉన్నట్లు.
ఇతరం తోయలేదంటే నీవు మెలకువలో ఉన్నట్లు.
నీవేంటో తెలిపే "ధర్మామీటర్" ఇదే.
* * *
'ఇదొక స్వప్నం' అని ఉన్నప్పుడు పాపం కూడా యజ్ఞమే అవుతుంది.
'ఇది నిజం' అని ఉన్నప్పుడు యజ్ఞం కూడా పాపమే అవుతుంది.
* * *
No comments:
Post a Comment