*ఓం నమః శివాయ*:
*🧘♂️57- శ్రీ రమణ మార్గము🧘♀️*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
*శ్రీ రమణీయం గ్రంథం నుంచి శ్రీ రమణమహర్షి జీవిత చరిత్ర*
*7- మూడవ భాగం*
ఏది కొత్తగా నేర్చుకోవాలన్నా, గురువు అవసరం. ఎవరి వలన సకలం తెలుస్తుందో, వారే గురువు. ఆ సకలమే, సత్యం. ఆ సత్యం అందరిలో వుంది. కానీ, మనల్ని నడిపేందుకు ఆ సత్యం ఒక రూపంలో దర్శనమిస్తుంది. ఆ రూపాన్ని “గురువు" అంటాం. అంటే, “గురువు” అనే ఆయన మనకు విడిగా, బైట వున్నారని భావిస్తాము కాని, ఆ గురువు మనలోని ఆ భావాన్ని, భ్రాంతిని, మాయని, అజ్ఞానాన్ని తొలగించి, మన లోనే హృదయంలో కొలువై ఉన్న ఆత్మ గురువును మేల్కొల్పుతారు. అంటే, మన పొరపాట్లను, మనం తెలుసు కునేటట్లు చేస్తారు. పక్వదశకు వచ్చినప్పుడు, మనల్ని సరైన దారికి మళ్లించి నడుపుతారు. అంతేకాని, ఆయన మనకు ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించరు. కాని, ఆ దారిలోని అడ్డంకుల్ని, అవరోధాల్ని, అభ్యంతరాల్ని తొలగిస్తారు.
దేహాత్మ బుద్ధి వలన తాను ఒక ప్రత్యేక వ్యక్తిననే అజ్ఞానం - భ్రాంతి - మాయ కలుగుతాయి. అలాగే గురువును కూడా తనవలె దేహధారి అయిన ఒక ప్రత్యేక వ్యక్తి అనుకుంటారు. అలా అను కోవడమే పెద్ద పొరపాటు. ఆ భావం పోవడానికే ధ్యానం.
అటువంటి
ద్వంద్వ భావం వున్నంతకాలం, బాహ్య గురువు అవసరం.
అసలు సత్యం తెలుసుకున్న తర్వాత తానూ, గురువూ ఒకటేనని తెలుసుకుంటాడు. తనతోపాటు గురువూ అశాశ్వతమనీ, శాశ్వతమైనది ఆత్మ ఒక్కటేనని తెలుసుకుంటాడు. ఆ ద్వంద్వ భావం అదృశ్యం కావడమే, అజ్ఞానం తొలగడం. ప్రతి ఒక్కరిలో ఆత్మగా, శాశ్వత దివ్యకాంతిగా వున్నారు గురువు. నిరాకార ఆత్మే గురువు. గురువూ, ఆత్మా, ఈశ్వరుడూ ఒకటే.
గురువును మొదట బాహ్యంగా కనుక్కోవడం, తర్వాత లోపల దర్శించడం విషయంలోవి. వెంకట్రామన్ తో “ఇప్పటి
వరకు మీరు మొదటిదే చేశారు" అన్నారు భగవాన్. అంటే, మీరు గురువును బాహ్యంగానే చూశారు. ఇంక ఆయన్ని ఆంతర్యంలో దర్శించండి" అని అర్థం.
వెంకట్రామన్ శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యులు. ఆయన కోర్కె, తన గురువైన రామకృష్ణ పరమహంస స్థితికి తక్కువస్థితి కాని వారిని, సజీవంగా, దేహంలో అంటే, రక్త, మాంసాదులతో వున్న వారిని దర్శించాలని. ఆ తర్వాత ఆయన శ్రీ రమణమహర్షి పేరు విన్నారు. వారి దర్శనానికి ఆశ్రమానికి వచ్చారు. వస్తూ ఒక పూలమాల తెచ్చారు. ఆయన హాల్లో ప్రవేశించిన సమయానికి భగవాన్ దగ్గర ఎవరూ లేరు. ఆయన తెచ్చిన పూలమాలను భగవాన్ చేతికి ఇచ్చారు. ఆయన దాన్ని రెండు భాగాలుగా విడదీసి, ఒకభాగం గుడిలో లింగానికి, రెండో భాగం అక్కడ గోడకు వేళ్ళాడుతున్న శ్రీ రామకృష్ణ పరమహంస పటానికి వేయమని పరిచారకునికి ఇచ్చారు. అది చూసి వెంకట్రామన్ ఎప్పటికీ తన గురువు శ్రీ రామకృష్ణ పరమహంసేనని గుర్తించారు. ఆయన హృదయం శాంతపడింది. ఆయన్ని ఉద్దేశించి, “మీరు దక్షిణామూర్తి గురించి విన్నారా ?" అని అడిగారు భగవాన్. “వారు మౌన దీక్ష ఇస్తారని విన్నాను” అన్నారు వెంకట్రామన్.
"ఇక్కడా అదే ఉపదేశం పొందుతారు" అన్నారు భగవాన్. అని “అసలు ఏది మిమ్మల్ని ఇక్కడకు తీసుకొచ్చింది?” అని మళ్ళా అడిగారు.
“మీ గురించిన యోచన” అన్నారాయన.
“అదే సాధన. అది చాలు” అన్నారు భగవాన్. అంటే, మననం ముఖ్యమని అర్థం. ఆ మననమే గురువై నడుపుతుంది. గురువు అనుగ్రహమే నిరంతర మననాన్ని లభింపజేస్తుంది.
శరణాగతి పొంది మనసును శాంతపరచి, గురువు అనుగ్రహం పొందటం అంత తేలికైన పని కాదు. దానికి కూడా గురువు అనుగ్రహం కావాలి. నిరంతరం సంపూర్ణ ఎరుకలో వుండాలి, తీవ్ర సాధన చేయాలి, భారమంతా గురువుపై వుంచాలి.
గురువు ఎప్పుడూ నిర్మలంగా, శాంతంగా, మౌనంగా వుంటాడు. ఆయన మౌనం అపారం. ఆ మౌనంతో మనలోని ప్రత్యేక వ్యక్తిత్వపు భావనని తొలగిస్తాడు. ఆ మౌనమే ఆయన బిగ్గరగా అరిచే ఉపదేశం. అన్నిటి కన్నా మౌనోపదేశం గొప్పది.
గురువులందరి లక్ష్యం ఒకటే. మానవాళికి సహాయం చేయడం; ప్రజల వికాసంకోసం పాటుపడటం. వారు అహంకారంలో అణగిపోకుండా, భ్రాంతిలో మునిగిపోకుండా, ఉద్ధరించి వారి ఆత్మోన్నతికి సహాయపడటం. కాని, గురువులందరిదీ ఒకటే పద్దతి కాదు. వారి భాషలూ భిన్నమే. చాకలి బట్టల్ని రాతిబండ మీద బాదటం, బట్టల్ని చింపాలని కాదు; వాటిని అతుక్కున్న మురికిని వదలగొట్టడం కోసం. అలాగే గురువు మనోమాలిన్యాల్ని పోగొట్టేందుకు అనేక కఠిన నియమాల్ని ఏర్పరుస్తాడు. మత్తగజంలాంటి అహంకారాన్ని అణచగలిగేది, సింహం వంటి గురువు ఒక్కడే. వెదికే వారికి దారిచూపడం, గురువు పని. అంతేకాని, మతస్థాపన, దీక్షలివ్వడం, ఉపదేశాలు చేయడం కాదు.
1935 - జనవరి మొదటి వారంలో "పిగ్లోట్” అనే ఒక ఇంగ్లీషు ఆమె పాల్ బ్రంటన్ రాసిన పుస్తకం చదివి, ఉత్తేజితురాలై భగవాన్ దర్శనానికి వచ్చింది. ఆమె వచ్చిన సమయానికి ఆశ్రమంలో, భగవాన్ సన్నిధిలో చాలా మంది వున్నారు. భగవాన్ సోఫాలో కూర్చుని ఎటో చూస్తున్నారు.
పిగ్గోట్ :- స్వామీ, ఆత్మానుభవానికి ఆటంకాలేవి ?
భగవాన్ :- వాసనలు.
పిగ్గోట్ :- వాటిని పోగెట్టేదెట్లు ?
భగవాన్ :- ఆత్మజ్ఞానం వల్ల .
పిగ్గోట్ :- ఆత్మానుభవానికి సాయపడేవి ఏమిటి ?
భగవాన్ :- శ్రుతివాక్యాలు, జ్ఞానుల బోధలు.
పిగ్గోట్ :- ఆత్మసిద్ధికి గురువు అవసరమా ?
భగవాన్ :- గురువు అనుగ్రహ ఫలితమే ఆత్మసాక్షాత్కారం. ఉపదేశాలకన్నా, ఉపన్యాసాలకన్నా, శ్రవణ, ధ్యానాదులకన్నా గురువు అనుగ్రహం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది.
జీవితంలో గురువు అనుగ్రహ ఫలితమే, ముఖ్యమైన ప్రధానమైన సంగతి. తక్కినవన్నీ రెండో పక్షానికి చెందినవి! అనే మాటను ఆధారంగా తీసుకుని అరవిందబోసు భగవాన్ని అడిగారు, “సాధకుని ప్రయత్నం ఫలించడానికి గురువు అవసరం అనుకుంటాను. భగవాన్ మా కోసం అనుకుంటారా? అని.
"మీకు సాధన ముఖ్యం, అవసరం. అనుగ్రహం ఎప్పుడూ వుండనే వుంది" అని, కొంతసేపు ఆగి, “పీకలోతు నీళ్ళలో నిలబడి “దాహం, దాహం” అని అరుస్తున్నారు మీరు. సూర్యుణ్ణి చూడాలంటే, ఆయన ప్రకాశించే దిక్కుకు తిరగాలి” అన్నారు భగవాన్. అంటే, దృష్టి మార్చుకోమని అర్థం.
భగవాన్ ఆ విషయాన్నే శివప్రకాశం పిళ్ళెకు హామీగా "పులి నోట పడ్డ మాంసంకండ తప్పిపోయినట్లు, గురువు అనుగ్రహం పొందినవారు తరించకపోరు, ఎప్పటికీ తరించబడకుండా విడవబడరు” అన్నారు.
మరొక భక్తునితో, “నువ్వు భగవాన్నీ వదలి వెళ్లిపోవాలన్నా, భగవాన్ నిన్ను వదలి పోనివ్వరు” అన్నారు భగవాన్.
“గురువులోంచి అనుగ్రహం ప్రసరించింది కాదు, ప్రసరించబడింది, అని వుండాలి" అని ఒక సందర్భంలో భగవాన్ సుందరేశ అయ్యర్ ని సరిదిద్దారు.
తమకు ఎంతకీ పురోభివృద్ధి కనుపించడం లేదని “నేను ఇలాగే వుంటే, నరకానికి పోతాను" అన్నాడు ఒక భక్తుడు భగవాన్.
“నువ్వు నరకానికి వెళ్ళినా, నిన్ను భగవాన్ వదలక వెనక్కి తీసుకొస్తారు” అన్నారు భగవాన్ అతనితో.
అవకాశం కల్పించిన అటువంటి సందర్భాన్ని ఆధారంగా తీసుకుని చాడ్విక్ “భగవాన్, తమకు శిష్యులు లేరన్నారు” అన్నారు. “అవును, లేరన్నాను” అన్నారు భగవాన్.
చాడ్విక్ :- ముక్తి పొందాలనుకునేవారికి గురువు అవసరం అన్నారు భగవాన్.
భగవాన్ :- అవును, అన్నాను.
చాడ్విక్ :- అయితే నేనేం చెయ్యాలి ? ఇన్నేళ్ళూ నేను ఇక్కడ కూర్చోవడం వట్టి మూర్ఖం, దండగ అంటారా ? నేను చేసింది కాలం వృధా చేయడమేనా ? భగవాన్ తాను గురువును కాదన్నారని నేను ఇప్పుడు వెళ్ళి, మరొక గురువును వెతుక్కుని. దీక్ష తీసుకోవాలా ?
భగవాన్ :- అంత దూరం నుంచి ఏ శక్తి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది? ఇన్నేళ్ళూ ఇక్కడ ఏ శక్తి మిమ్మల్ని
నిలిపింది ? ఎక్కడైనా గురువును వెతుక్కోవలసిన అవసరం వస్తే, మీరు ఏనాడో వెళ్ళిపోయి వుందురు.
చాడ్విక్ :- అయితే భగవాన్ కి శిష్యులు వున్నారా ?
భగవాన్ :- నేను చెప్పినట్లు భగవాన్ ప్రకారం ఆయనకు శిష్యులు లేరు. కాని, శిష్యుని దృష్టి నుంచి గురువు అనుగ్రహం సముద్రం మాదిరిగా వుంది. శిష్యుడు ఒక చిన్న పాత్ర తీసుకుని ఆ సముద్రం దగ్గరకు వెడితే, ఆ పాత్ర పట్టేంత నీరే తీసుకుంటాడు. “తనకు అంత తక్కువ నీరు ఏమిటి ?" అని ఫిర్యాదు చేసి ఏం ప్రయోజనం? పెద్ద పాత్ర తీసుకువెళ్ళినవాడు ఎక్కువ నీరు తీసుకుంటాడు. అది వారి వారి పాత్రల మీద ఆధారపడి వుంటుంది.
చాడ్విక్ :- నిజంగా, గట్టిగా తెలుసుకోవాలని విశ్వాసంతో అడుగు తున్నాను “భగవాన్ నాకు గురువు అవునా, కాదా ? భగవాన్ ఒప్పుకోకపోతే .. .” అని ఆపేశారు. ...
భగవాన్ :- (భగవాన్ నిటారుగా నిలబడి) దుబాసి వంక చూస్తూ, స్థిరనిశ్చయభావంతో, చాడ్విక్ను చూపిస్తూ,“ఆయన్ని అడగండి, వ్రాత మూలకమైన పత్రం ఏమైనా భగవాన్నించి కావాలేమో?”
భగవాన్ చెప్పక చెప్పిన ఉపదేశం, ఇచ్చిన హామీ అర్ధమై, చాడ్విక్ పరమానంద భరితులయ్యారు.
ఒకసారి దిలీప్ కుమార్ రాయ్ భగవాన్ని అడిగారు. “మహర్షి గురువు అవసరాన్ని నిరాకరిస్తారు అని కొందరూ, దానికి భిన్నంగా కొందరూ చెపుతారు. అయితే భగవాన్ ఏమంటారు?" అని.
భగవాన్ :- నేను ఎప్పుడూ గురువు అవసరం లేదని చెప్పలేదు.
దిలీప్:- అరవిందులు తరచు అంటూ వుండేవారు “మహర్షికి గురువు లేరు” అని.
భగవాన్ :- అది మీరు "గురువు" అని పిలవబడే దాని మీద ఆధారపడివుంటుంది.దత్తాత్రేయునికి ఇరవై నలుగురు గురువులున్నారు. అంటే, ప్రపంచంలో ఏ రూపమైనా, ఏదైనా, ఎవరైనా గురువు కావచ్చు. గురువు తప్పని సరిగా అవసరం. గురువు మినహా మనోకీకారణ్యం నుంచి మనల్ని మరెవ్వరూ బైటికి తీయలేరని ఉపనిషత్తులు చెపుతున్నాయి. దాన్నిబట్టి గురువు అవసరమే !
దిలీప్;- అంటే, గురువు అంటే, మానవరూపంలో వున్న ఒక వ్యక్తా ? మహర్షికి అటువంటి గురువు ఎవరైనా వున్నారా ?
భగవాన్ :- ఎప్పుడో ఒకప్పుడు, నాకూ గురువు అవసరమై వుంటారు. నేను అరుణాచలేశ్వరునికి స్తుతి కీర్తనలు పాడలేదా ? గురువంటే, ఏమిటి ? గురువంటే, భగవంతుడు - ఆత్మ. తన కోర్కెల్ని ఈడేర్చమని మొదట ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. కాని, సమయం వచ్చినప్పుడు అతడే తన కోర్కెల్ని ఈడేర్చమని ఈశ్వరుణ్ణి ప్రార్థించడు. ఇంక తనకోసమే ప్రార్థిస్తాడు,
అప్పుడు అతన్ని నడపడానికి ఈశ్వరుడు ఏదో ఒక రూపంలో గురువుగా దర్శనమిస్తాడు. అదీ, అతని ప్రార్థనా ఫలితమే !
"శంకరాచార్యులవలె మీరూ దేశసంచారం చేసి, ఉపన్యాసాలిచ్చి, ఉపదేశాలిచ్చి, ప్రజల్ని ఎందుకు సన్మార్గులుగా చేయకూడదు?” అని ఒకరు భగవాన్ని అడిగారు.
భగవాన్ :- మహాత్ములు దేహం ధరించడమే లోకానికి గొప్ప మేలు చేసినట్లు, అనుగ్రహం చూపినట్లు. వారు ఏమీ చేయక వూరికేవున్నా, వారి శక్తి తరంగాలు నలు వైపులకూ వ్యాపించి, లోకాన్ని సాత్విక తేజోమయం చేస్తాయి.
కార్యరంగంలో ఒక్కొక్క మహాత్ముని పాత్ర, ఒక్కొక్క విధంగా వుంటుంది. తనను అర్ధించిన వారికి భగవాన్ ఇచ్చే ఉపదేశం, వారి వారి సంస్కార స్వభావాలకు అనుకూలంగా వుండేది. అది వారి హృదయాల్లోకి సూటిగా దూసుకుపోయి, ఒక మార్గం చూపి, వారి జీవితాల్నే నడుపుతుంది,
ఒకసారి పరమహంస యోగానందులు భగవాన్ని అడిగారు. "ప్రజల ఆత్మ ఔన్నత్యానికి, జీవన పురోభివృద్ధికీ ఏ విధమైన ఆధ్యాత్మిక మార్గం మంచిది?” దానికి భగవాన్, అని. "ఏ ఆధ్యాత్మిక మార్గమైనా సరే, ఆయా వ్యక్తుల, ఆర్తుల గుణగణాల మీద, సంస్కార స్వభావాల మీద, ఆధ్యాత్యిక పరిపక్వత మీదా ఆధారపడి వుంటుంది. అందరికీ మూక ఉమ్మడిగా ఆదేశాలు, ఉపదేశాలు ఇచ్చి నడపడమంటూ ఏమీ లేదు”
🕉️🌞🌍🌙🌟🚩
No comments:
Post a Comment