Thursday, April 6, 2023

అభయం - ఆనందం. దీని గురించి తెలుసుకుందాం

అభయం - ఆనందం. దీని గురించి తెలుసుకుందాం

మానవుడికి కొన్ని ప్రత్యేక కష్టాలు ఉంటాయి. ఇవి అని చెప్పుకోలేనివి. అవి ప్రకృతిలో ఏ ప్రాణికీ ఉండనివి. మనిషి జాతిగా ఆలోచించి భయాలు సృష్టించుకోవడం మూలంగా కొన్ని వినూత్న కష్టాలు కొనితెచ్చుకుంటాడు. నిజానికి ఆ కష్టాలు అతడి ఆలోచనల నుంచి పుట్టినవే! వాటిని ఆలోచనల స్థాయిలోనే తుంచివేయాలంటారు పండితులు..

మానవజాతిలో ఏ స్థాయి మనుషులు ఎక్కువ ఆనందంగా ఉంటారన్న విషయం పై ఆసక్తికరమైన చర్చ జరిగింది. దానికి సమాధానం సైతం అలాగే వచ్చింది. నిజానికి సమాజంలో తన స్థాయిని బట్టి కాక ప్రతి మనిషికి ఆనందం జీవితంలో లభ్యమవుతూనే ఉంటుంది. ఎంతకాలం ఆ ఆనందం కొనసాగుతుందో ఎవరూ చెప్పలేరు. రెండు కష్టసమయాల మధ్య అనుభవాన్ని ఆనందం అన్నారు. అవగాహనా రాహిత్యం వల్లనే కష్టాలు సంప్రాప్తిస్తాయంటారు విమర్శకులు. ఎవరు ఎక్కువగా భయాన్ని పెంచుకోరో వారే ఎక్కువ ఆనందంగా జీవించగలుగుతారని పరిశోధకుల భావన. అసలు భయమంటే ఏమిటని ప్రశ్నిస్తే అది తన ప్రాణం, సంపద, సౌందర్యం, ఆరోగ్యం, పరువు, ప్రతిష్టతో ముడివడిన అంశమని బోధపడుతుంది. కలిగి ఉన్నది పోతుందేమోనన్న ఆలోచన మనిషిలో ఆందోళన కలిగిస్తుంది. అదే భయానికి దారితీస్తుంది. సుఖమయ జీవితానికి మనిషికి అభయం కావాలి అందచందాలు, సంపద, పేరుప్రతిష్ఠలు ఉన్నప్పుడే కోల్పోతామన్న భయం ఉంటుంది. కదా! ధర్మమార్గంలో నడుస్తూ అనవసర భయాల పై దృష్టి పెట్టనివారికి భయం ఎప్పుడూ ఆమడ దూరంలోనే ఉంటుంది. ధర్మమార్గంలో నడిచే వ్యక్తికి ప్రకృతి
ప్రసాదించే వరం అభయం? శిఖరాగ్ర స్థాయిలో ఒక వ్యక్తి ఉంటే అంతకు మించి అతడు సాధించగలిగింది ఏమీ ఉండదు. సరిగ్గా అప్పుడే, భయమనే భూతం అతణ్ని పట్టుకుంటుంది. ఆకారణంగా భీతి చెందుతాడు. ప్రకృతి సహజ సూత్రమైన మార్పు వల్ల ఉన్నత స్థాయి నుంచి తదుపరి పరిణామం కిందకు దిగడమే కదా!! సరిగ్గా ఆ అంశమే మనిషిలో పరిణామ భీతిని కలిగిస్తుంది.

స్థితిగతులు అనుకూలంగా లేకపోతే మనిషి భయపడే తీరాలా అన్నప్పుడు- అవసరం లేదని ఆధ్యాత్మికం అభయమిస్తుంది. భయానికి విరుగుడు, ఆధ్యాత్మికమే అన్న పసిడిసూత్రాన్ని మనిషి పట్టుకోవాలి... భయానికి ఆనందాన్ని మాయం చేసే శక్తి ఉండగా ఆధ్యాత్మికం అందుకు భిన్నంగా ఆనందాన్ని సృష్టిస్తుంది. సాధన వృద్ధి చెందుతున్న కొద్దీ ఆ ఆనందం సుస్థిరమవుతుంది. అందుకే కనీసస్థాయిలోనైనా వైరాగ్యాన్ని మనిషి సాధన చేయాలంటారు పండితులు, పుట్టినప్పుడు ఖాళీ చేతులతో లోకంలోకి వచ్చే మనిషి మరణించాక సైతం ఖాళీ చేతులతోనే వెళతాడు. జీవించినంత కాలం దేవుడిచ్చిన సంపదకు రక్షకుడిగా.. వ్యవహరిస్తూ కష్టసుఖాలు అనుభవించి, పోయేప్పుడు వారసులకు ఆస్తి పాస్తులను అప్పగించి వెళతాడు. కాస్తంత వైరాగ్యం అలవరచుకుంటే అది సమస్త ఆశాంతినీ పోగొడుతుందన్నది . అనుభవైక జ్ఞానం. ఆ జ్ఞానం, కోల్పోతానన్న భయం నుంచి విముక్తి కల్పిస్తుంది. జీవితంలో ఎదురయ్యే హెచ్చుతగ్గులను సమదృష్టితో స్వీకరించి ఆనంద స్థాయిని పెంచుకోవాలని శాస్త్రజ్ఞులు సూచిస్తారు. ఆనందాన్ని దూరం చేసే అనవసర భయాలను ఆహ్వానించకుండా వాటిపట్ల అప్రమత్తత కలిగి జీవించాలి. అప్పుడు ఆనందం మనిషికి దొరకని వస్తువు ఎంతమాత్రం కాదు!
గోపాలుని రఘుపతిరావు

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment