Friday, June 28, 2024

 "జ్ఞానగీత" (నిత్యజీవితంలో ఉపనిషత్తులు) -ప్రశ్నోపనిషత్తు - 05వ భాగము.
నాలుగవ ప్రశ్నగా గార్గ్యుడు, బ్రహ్మవేత్తయైన పిప్పలాదునుద్దేశించి, గురువర్యా! జీవునిలో నిద్రించేవి, మేలుకొనేవి ఏవి? ఆనందాన్ని అనుభవించేది ఏది? వీటికి ఆధారమేది? అని ప్రశ్నించేడు.
ప్రశ్నకు సమాధానంగా పిప్పలాద మహర్షి, ఋషులారా! నిద్రించే సమయంలో జీవుని ఇంద్రియాలన్నీ అతని మనస్సులో విలీనమౌతాయి, మెలుకువ వచ్చినప్పుడు మరల వికసిస్తాయి. ఈ నిద్రావస్థలో జీవుని ఇంద్రియములు తాత్కాలికంగా అచేతనములైనప్పటికీ, శరీరంలో ప్రాణములనే అగ్నులు మాత్రం మేలుకొనేవుంటాయి.
ఈ స్థితిలో మనస్సు తన సంస్కారాలను అనుభవిస్తుంది. దీనినే స్వప్నావస్థ అని అంటారు. జాగ్రదావస్థలో మనస్సు ఏయే విషయాలను గ్రహిస్తుందో, వాటితో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకొని, దానిని స్వప్నావస్థలో అనుభవిస్తుంది మనస్సు.
ఆపిదప మనస్సు ఒక తేజస్సుచే ఆవహింపబడి, స్వప్నావస్థను దాటి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తుంది. దీనినే సుషుప్తి స్థితి (గాఢనిద్ర) అంటాము. అంటే ఎటువంటి విషయాల జోలికి పోకుండా మనస్సు తానే స్వయంగా ప్రకాశిస్తూ వుంటుంది. ఈ స్థితిలో ఇంద్రియాలు, మనస్సు జీవాత్మలో ఏకమౌతాయి.
ఇక్కడ ప్రాణప్రక్రియను యజ్ఞముగా చెప్తూ, మనస్సును యజ్ఞకర్తగా (యజమానిగా) పేర్కొంటూ, ప్రతిరోజూ ఈ యజ్ఞమే, యజమానిని పరమాత్మ (సుషుప్తి) వద్దకు తీసుకొని పోతుందని ఎంతో శాస్త్రీయంగా చెప్పడం జరిగింది.
ఈ మహోన్నత స్థితిలో ఒక్క "జీవచైతన్యం" మాత్రమే మిగిలివుంటుంది. మిగతావేవీ అనుభవంలోకి రావు. ఆ అవస్థలో జీవాత్మ పరమాత్మలో ప్రతిష్టింపబడతాడు.
ఇదే "అద్వైత" స్థితి, "అయమాత్మాబ్రహ్మ" స్థితి, "సర్వం ఖల్విదం బ్రహ్మ" స్థితి.
ప్రతిరోజూ తాత్కాలికంగా ఈ స్థితిని పొందుతాడు ప్రతి జీవుడు. దీనిని శాశ్వతంగా పొందే స్థితిని "జీవన్ముక్తి" అంటారు. ఈ స్థితిని పొందినవాడు సర్వజ్ఞుడవుతాడని పిప్పలాదుడు గార్గ్యుడడిగిన నాల్గవ ప్రశ్నకు సమాధానమిస్తాడు.
ఐదవ ప్రశ్నతో, తదుపరి భాగంలో మళ్ళీ కలుసుకుందాము... 🙏🏻

No comments:

Post a Comment