కాఫీ కబుర్లు సంఖ్య 628 (మే 27 - 2024) 2 -- చాలామంది ఇష్టపడే సంఖ్య 2 (రెండు). ఇది రెండవ అతి చిన్న సంఖ్య మరియు ఈవెన్ నెంబర్. అంకెల్లో ద్వితీయ స్థానంలో రెండు కి అనేక రకాల ప్రాధాన్యత ఉంది. లయ కారకులు ఆదిదంపతులు ఇద్దరు. దంపతులు అంటేనే ఇద్దరు.. భార్య భర్త. ఈ రెండు కలిస్తేనే సృష్టికార్యం జరుగుతుంది. శరీరంలో చాలా మటుకు రెండేసి ఉంటాయి. రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు చేతులు, రెండు కాళ్ళు, రెండు చెంపలు ఇలా. జంట రెండు సంఖ్య అర్ధాన్ని సూచిస్తుంది. ఇద్దరు సరిసమానంగా ఉంటేనే చూడ చక్కని జంట, చూడ ముచ్చటైన జంట. జంట పదాలు చాలా ఉన్నాయి. వెలుగు నీడలు, లాభ నష్టాలు, కష్ట సుఖాలు, ఈడు జోడు, తోడు నీడ, ఎండ మావులు.. ఇలా ఎన్నో ఉన్నాయి. పండుగలు వస్తే విధిగా రెండు పిండివంటలు చేసుకుంటాం.. ఓ స్వీట్, ఓ హాట్. ప్రతీ ఫలహారంలో అసలు ఫుడ్ కు జతగా మరోటి అంటే రెండు ఉండాల్సిందే.. లేకపోతే తినలేం. ఇడ్లీకి చట్నీ సాంబార్ ఉండాలి, వడకి సాంబారు ఉండాలి, మసాలా దోసెకి కూర ఉండాలి, ప్రతీ దోసెకు చట్నీ ఉండాలి, ఉప్మాలో జీడిపప్పు ఉండాలి, పూరీ చపాతీ లలో కూర ఉండాలి. ఒక్క అన్నం తినగలమా.. తినలేం. జతగా రెండవ ఐటెం ఉండాలి. అన్నంతో పాటు కలుపుకుందికి పచ్చడో పప్పో చారో పులుసో పెరుగో మజ్జిగో ఉండాలి 2 ను సూచించే విధంగా. అందరి ఇళ్ళల్లో రెండేసి వెహికల్స్ ఉంటాయి. దగ్గరగా వెళ్ళాల్సి ఉంటే బైకు, ఫ్యామిలీ తో వెళ్ళాలంటే కారు. ఇప్పుడు చాలా ఇళ్ళల్లో టీవీలు రెండేసి ఉంటున్నాయి. హాల్లో ఒకటి, బెడ్ రూంలో ఒకటి. రోజూ మనం తీసుకునే వేడి పానీయాలు రెండు.. టీ & కాఫీ. అన్నట్లు ప్లతీ బాత్ రూంలో రెండేసి కొళాయిలు ఉంటాయి.. చన్నీటి స్నానంకి & వేడినీటి స్నానంకి. ధరించే దుస్తులు కూడా రెండే.. ప్యాంటు షర్టు, చీర జాకెట్. ఇక ఏ ఆటకైనా, ఏ క్రీడకైనా రెండు ఉండాలి.. చదరంగం బోర్డు పావులు, కేరంబోర్డు పిక్కలు, బ్యాటు బాల్.. ఇలా. మా బాగా చిన్నతనంలో థియేటర్ లలో సినిమాలు రోజుకు రెండు షోలు మాత్రమే చేసేవారు. ఈవెనింగ్ షో & నైట్ షో. ఇప్పుడు మ్యాట్నీ ఉదయం ఆట అంటూ అదనంగా మరో రెండు ఆటలు కలిశాయి. 2 కి కుటుంబ నియంత్రణ తో కూడా సంబంధం ఉంది. 60, 70 వ దశకాల్లో ఇద్దరు పిల్లలు చాలు అంటూ కుటుంబ నియంత్రణ ప్రచారం విపరీతంగా ఉండేది. ఇక.. నాకు రెండు నా అభిమాన సంఖ్య ఎప్పట్నుంచో.. కారణం ఇదీ అంటూ ప్రత్యేకంగా చెప్పలేను. నాకో వింత అలవాటు ఉంది. తలుపు గడియ గానీ, తాళం గానీ వేశాక 2 సార్లు చెక్ చేస్తాను. మంచినీళ్ళు రెండేసి గుటకలు చొప్పున మింగుతాను. వడ్డించుకుంటు న్నప్పడు గరిటెతో రెండేసి సార్లు వడ్డించుకుంటాను. స్నానం చేసేటప్పుడు రెండు సార్లు సబ్బుతో రుద్దుకుంటాను. ఏ సీజనైనా ఉదయం సాయంత్రం 2 సార్లు స్నానం చేస్తాను. బాత్ రూం లో నా సబ్బులు ఎప్పుడూ 2 ఉంటాయి.. ఒంటికోటి, ముఖానికోటి.. మార్గో/డెట్టాల్ & మైసూర్ శాండల్.. ఈవిధంగా. ఒక కారు అమ్మాను.. ఒక కారు కొన్నాను అంటే రెండు. ఒక ఇల్లు అమ్మాను ఒక ఇల్లు కొన్నాను అంటే 2. నా అభిమాన నటులు కూడా ఇద్దరే.. సూర్యకాంతం & రమణారెడ్డి. మేమిద్దరం (2).. మాకిద్దరు పిల్లలు (2).. మొత్తం 4 (నాలుగు). అందుకేనేమో.. నా ఫేవరేట్ నెంబర్స్ 2 & 4.. నాకు ఉన్న రెండు పేర్లు మీ అందరికీ తెలిసిన విషయమే.. రెండు గోలని ఇంతవరకు భరించినందుకు.. ధన్యవాదాలు & కృతజ్ఞతలు.. మళ్ళీ 2.... -------- గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని) విజయనగరం ఫోన్ 99855 61852....
No comments:
Post a Comment