తిరిగొచ్చిన సాయం(కథ )
శృంగవరం ప్రక్కనే ఉన్న దట్టమైన అడవుల్లో ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసేవాడు ముని శతానందుడు. ఆ ఆశ్రమం చుట్టూ ఎన్నో పూల మొక్కలు, పండ్ల చెట్లు, పొదలు పెరిగాయి.
అడవిలో కంటే ముని ఆశ్రమం చుట్టూ బాగుండడంతో ఆ ప్రశాంత వాతావరణానికి అలవాటు పడ్డాయి జంతువులు. అక్కడకు వచ్చి విశ్రాంతి తీసుకునేవి. అదేమి వింతో కాని అక్కడకు వచ్చే జంతువులకు మరొక జంతువుని చంపాలనే కోరిక ఉండేది కాదు. అక్కడ వాటికి ప్రాణభయం లేకపోవడంతో ఎక్కువ సమయం గడిపేవి.
ముని కూడా వాటిపట్ల దయతో ప్రవర్తించేవాడు. ఏ జంతువుకైనా గాయమయితే ఆకులు తెచ్చి పసరు పూసి వైద్యం చేసేవాడు. వాటికి స్వస్థత కలిగే వరకూ కనిపెట్టేవాడు. అలా మునితో స్నేహం కుదిరింది జంతువులకు.
ముని తపస్సులో ఉన్నప్పుడు దూరం నుండే చూసేవి తప్ప తపోభంగం కలిగించేవి కాదు జంతువులు. వాటిని చూసి పక్షులు కూడ వచ్చి చెట్ల మీద కొలువుండేవి.
ముని తపస్సులో మునిగి ఒక్కోసారి ఆహారం సంగతి మర్చిపోయేవాడు. అలాంటప్పుడు తియ్యటి పండ్లను తెచ్చేవి చిలుకలు. దుంపలను తెచ్చేవి కుందేళ్లు. తేనె పట్టులను తెచ్చేవి ఎలుగుబంట్లు.
ఒక ఉదయం శతానందుడు నదికి వెళ్లి స్నానం చేసేసి, కందమూలాలతో ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ కనబడిన దృశ్యం చూసి అడుగు ముందుకు వేయలేక తన్మయత్వంతో నిలుచుండి పోయాడు.
ఒక సింహం యొక్క జూలుని తొండంతో నిమురుతోంది ఏనుగు. ఆ సింహం మైమరచిపోయి పడుకుంది. ఒక పెద్దపులి పంజాతో లేడిపిల్లను పట్టుకుని ముద్దు పెడుతుంటే అది భయం లేకుండా ఆడుకుంటోంది. ఒక కొండ గొర్రిని కౌగిలిలోకి తీసుకుని తోడేలు బుజ్జగిస్తుంటే తల్లి కౌగిలిలో ఉన్నట్టు పరవశిస్తోంది కొండగొర్రె. గుర్రం మీద కూర్చుని స్వారీ చేస్తోంది కొండముచ్చు . బాలింతరాలైన ప్రియురాలికి పచ్చగడ్డి పసరుని పుక్కిటతో పట్టి నోటికి అందిస్తోంది మగ లేడి . కళ్ళైనా తెరవకుండా తాగుతోంది ఆడలేడి. కాలిగాయమై కదలలేకుండా ఉన్న ఎలుగుబంటికి చెరుకుగడలు తినిపిస్తోంది కోతి.
ఆ దృశ్యాలను తనివితీరా చూసిన శతానందుడు “మీరిలా కలసిపోయి ఆడుకుంటుంటే చూడటానికి ఎంతో ఆనందంగా ఉంది” అన్నాడు. జంతువులు సంతోషంగా తలలను ఆడించాయి .
కొన్నాళ్లు గడిచాక ఒక వర్షాకాలం ఉదయం నదికి వెళ్లాడు ముని. స్నానం చేసి తిరిగి వస్తుండగా జారుగా ఉన్న చోట పాదం వేయడంతో జారిపోయి క్రింద ఉన్న పెద్ద గోతిలో పడ్డాడు. ఆయన కాళ్ళు విరిగాయి. నిలబడలేక బాధతో అరిచాడు.
స్నానానికి వెళ్లిన ముని ఎంతకీ ఆశ్రమానికి తిరిగి రాకపోవడం గమనించింది ఓ చిలుక. వెంటనే ఎగురుకుంటూ నదివైపు వెళ్లింది. మధ్య దారిలో ఒక గోతిలో పడిపోయి, బాధతో మూలుగుతున్న మునిని చూసింది. అది ముని ఎదురుగా వాలి ఏమి జరిగిందో తెలుసుకుంది. మిగతా జంతువులను పిలిచి మునిని బయటకు రప్పిస్తానని ధైర్యం చెప్పి ఆశ్రమం వైపు వెళ్లింది చిలుక.
అప్పటికి ఆశ్రమం దగ్గర ఉన్న ఏనుగు, ఎలుగుబంటి, గుర్రం, మేక, కోతి ఉన్నాయి. చిలుక చెప్పిన విషయం వినగానే మునిని రక్షించాలని ఆయన పడిపోయిన గోతి దగ్గరకు పరుగు తీసాయి.
మునిని పరామర్శించి బయటకి తీసుకువెళతామని, ధైర్యంగా ఉండమని చెప్పాయి. ముని ఉన్న గోతిలోకి దారి తయారు చేసింది ఏనుగు. ముని చుట్టూ తొండం వేసి నెమ్మదిగా లేపి తమతో వచ్చిన గుర్రం మీద కూర్చోబెట్టింది. ఆయన జారి పడకుండా మిగతా జంతువులు చుట్టూ నడుస్తుండగా ఆశ్రమానికి చేర్చాయి.
“వైద్యం అవసరం కదా . ఏమి చేద్దాము” అని గుర్రం మిగతా వాటిని అడిగింది.
“ఆయన మనలో చాలామందికి వైద్యం చేసినప్పుడు చూసాను. ఎలాంటి దెబ్బకు ఏ ఆకులు, మూలికలు వాడాలో నాకు తెలుసు” అంది ఎలుగుబంటి నమ్మకంగా.
దానికి సహాయ పడతానని ముందుకు వచ్చింది కోతి. ఆ రెండూ కలసి మూలికలు, ఆకులు సేకరించాయి. ముని కాళ్ళకి పసరుతో వైద్యం చేసింది ఎలుగుబంటి.
మునికి అవసరమైన ఆహారాన్ని జంతువులు, పక్షులే సమయానికి అందించాయి . అవన్నీ కలసి ఆయనకు పూర్తిగా నయమయ్యే వరకు సేవలు చేశాయి. కొన్నాళ్లకు ముని లేచి నిలబడగలిగాడు, మరి కొంతకాలం తరువాత నడవగలిగాడు.
అప్పుడు శతానందుడు పక్షులు, జంతువులతో “నా బంధువులైనా మీరు చేసినట్టు సేవలు, సంరక్షణ చేయలేరేమో. నేను కోలుకోడానికి మీరందరూ సాయపడ్డారు. ప్రేమ చూపారు. మీ మేలు మరువలేను” అన్నాడు.
అది విన్న ఏనుగు ముందుకు వచ్చి “ ఆశ్రమం దగ్గరకు మేము రాగానే మీ ప్రభావం వల్ల జాతి భేదం మరచిపోయి ప్రాణభయం లేకుండా బ్రతుకుతున్నాము. గతంలో వైద్యం చేసి మాలో చాల జంతువులను బ్రతికించారు మీరు. అలాంటి మీకు కష్టం వస్తే సాయపడకుండా ఉండగలమా? మీకు సాయపడినందుకు సంతోషంగా ఉంది” అంది.
‘అవును’ అన్నాయి మిగతా జంతువులు.
ముని తృప్తిగా నవ్వి “మనుషుల్లా మంచిగా ఒకరికొకరు సాయపడుతూ జీవించమని ఒకప్పుడు మీకు చెప్పేవాడిని. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు ” అన్నాడు.
No comments:
Post a Comment