Sunday, June 23, 2024

అఘాసురుడు ఎందుకు కృష్ణుడిని చంపటానికి వచ్చాడు? అందంగా ఉన్న అతను ఎందుకు కొండచిలువుగా మారాడు?

 అఘాసురుడు ఎందుకు కృష్ణుడిని చంపటానికి వచ్చాడు? అందంగా ఉన్న అతను ఎందుకు కొండచిలువుగా మారాడు?

🌷🌷🌷🌷🌷

శ్రీ కృష్ణుడి జీవిత కథ అందరికీ తెలుసు. అతడు కారణజన్ముడు విష్ణువు ఎనిమదవ అవతారం. కృష్ణుడు జన్మించటానికి ముఖ్య కారణం కంస మహారాజు అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

కంస మహారాజు రాక్షస జాతికి చెందినవాడు. అతడి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. కంసుడిని వధించటానికి విష్ణువు శ్రీ కృష్ణుడి అవతారంలో ఈ భూమి మీదకు వచ్చాడు. కావున శ్రీ కృష్ణుడుని బాల్యంలోనే చంపాలని చాలామంది రాక్షసులు భావించారు. వారిలో అఘాసురుడు ఒకడు.. ఇతడు బకాసురుడి సోదరుడు. 

ఒకనొక సమయంలో శ్రీ కృష్ణుడు స్నేహితులతో కలిసి యమునా నది తీరాన ఆడుకుంటుండగా.. కొండ చిలువ రూపంలో ఉన్న అఘాసురుడు కృష్ణుడిని చంపటానికి అక్కడికి వస్తాడు. తన నోటిని చాలా పెద్దగా తెరిచి మింగేయడానికి ప్రయత్నిస్తాడు. అఘాసురుడు భూమి నుండి ఆకాశంలోని మేఘాలకు తగిలేలా పెద్దగా నోరు తెరవటం వల్ల కృష్ణుడు మరియు అతని స్నేహితులు ఏదో గుహలాగా భావించి గోవులను తమ వెంట తీసుకుని లోపలి వెళ్ళిపోతారు.

అందరూ లోపలికి వెళ్ళగానే అఘాసురుడు నోటిని గట్టిగా మూసేస్తాడు. కొండచిలువ నోట్లో ఉన్న విష ప్రభావం వల్ల కృష్ణుడి స్నేహితులు, గోవులు సృహ కోల్పోతారు. ఎలాగైనా తన స్నేహితులను, మూగ జీవాలైన గోవులను కాపాడటానికి ఒక ఆలోచన చేసి అఘాసురుడి నవరంధ్రాలను మూసేస్తాడు. దాని కారణంగా అఘాసురుడి కడుపు ఉబ్బిపోయి మరణిస్తాడు. అప్పుడు అఘాసురుడి కడుపు చీల్చుకొని అందరినీ క్షేమంగా బయటకి తీసుకుని వస్తాడు శ్రీ కృష్ణుడు.

శ్రీ కృష్ణుడి ద్వారా చనిపోయిన అఘాసురుడికి శాప విముక్తి కలిగి మాములు మనిషి అవుతాడు. అఘాసురుడు కొండచిలువులా మారటానికి ఒక కారణం ఉంది. అది ఏంటంటే అఘాసురుడు శంకుడి కుమారుడు, చాలా అందంగా బలంగా ఉంటాడు. తనలాగా ఇంకెవరూ లేరు అన్న గర్వంతో విర్రవీగుతుంటాడు. ఒకసారి అష్టా వక్రుడు అనే మహర్షి అఘాసురుడికి తారస పడినప్పుడు అతడిని చూసి "ఏంటి నీ మూతి అలా ఉంది నీ శరీరం ఎందుకు అన్ని వంకర్లు తిరిగింది" అని అవమానపరిచి నవ్వుతాడు. అప్పుడు అష్టవక్రుడు "నువ్వు ఇలా నన్ను అవమానపరిచి తప్పు చేసావు, దీనికి శిక్షగా నువ్వు కొండ చిలువుగా మారతావు" అని శపిస్తాడు. శపించిన తరువాత తప్పు తెలుసుకొని అఘాసురుడు పశ్చాత్తాపపడతాడు. అది చూసిన మహర్షి శ్రీ కృష్ణుడి చేతిలో మరణించాక నీకు శాప విముక్తి వస్తుందని చెప్తాడు.

అలా కృష్ణుడి చేతిలో మరణించి అఘాసురుడు శాప విముక్తి చెంది మరలా తన సహజ రూపానికి వస్తాడు.

ఓం నమో నారాయణాయ

No comments:

Post a Comment