Friday, June 28, 2024

****అవినీతి అంటే ఏమిటీ?

 అవినీతి అంటే ఏమిటీ?

మనలో చాలామంది అవినీతికి పాల్పడ్డారు అంటే కేవలం డబ్బులు మింగితేనో, భూములు మింగితేనో అనుకుంటాము.
మనకు అర్హత లేనిదాన్ని ఏది పొందినా అది అవినీతే! మనలో చాలామంది, వారు చాలా నీతిమంతులు, ఒక్కరి దగ్గర ఒక్కరూపాయి తీసుకోలేదు, ఎవర్ని దోచుకోలేదు, అంతా కష్టపడి సంపాదించాను అంటూ ఉంటారు.
కానీ చట్టం దృష్టిలో దొంగతనం అంటే సొమ్ము ఎంత అనేది చూడదు. ఎంత సొమ్ము అవినీతితో సంపాదించినా, అవినీతి పరుడనే అంటారు. దానికి పెద్ద, చిన్న అనేది ఉండదు.
అసలు అవినీతి అంటే ఏమిటీ అనేది చూస్తే, మనకు అర్హత లేనిది, మన స్వశక్తితో సంపాదించనిది, అలాగే మన ధర్మం, కర్తవ్యం సరిగా చేయకపోవడం కూడా అవినీతే! 
భారతములో శ్రీకృష్ణుడు రాయబారానికి దుర్యోధనుండి వద్దకు వెళ్ళినపుడు, దుర్యోధనుని ఆతిధ్యం స్వీకరించలేదు, ఎందుకంటే అన్యాయం చేసిన సొమ్ము తినేవాళ్ళ దగ్గర ఆతిధ్యం కూడా అవినీతే. అవినీతి సొమ్ముతో యాజ్ఞాలు, యాగాలు, దేవునికి ఎంత చేసినా పుణ్యం రాదు అని చెప్పారు. భక్తితో ఒక్క పుష్పము, ఫలము, పత్రము ఇచ్చినా భగవంతుడు మనల్ని కరుణిస్తారు.

అలాగే ఈ మధ్య ఓటుకు డబ్బులు తీసుకుని, దాన్ని ఇతరులకు దానం చేస్తున్నారు. అంటే అవినీతిని మీ చేతిద్వారా ఇంకొకరికి అందిస్తున్నారు. అవినీతి యొక్క శాతములో తేడా ఉండచ్చు, కానీ అవినీతి మరకలు మనకు కూడా అంటుకుంటాయి.అవినీతి పరుల దగ్గర చందా తీసుకొని పార్టీలు, సంఘాలు నడపటం కూడా అవినీతే! 

కొంతమంది నేను చాలా స్ట్రిక్ట్, ఒక్కరూపాయి కూడా లంచం తీసుకోను, అంటారు. చాలామంచిది. 
కానీ మన డ్యూటీ చేసేటప్పుడు, ఒక్క ఫైల్ ను ఎంత కాలపరిమితిలో క్లియర్ చేశాము. మన దగ్గరకు వచ్చిన వ్యక్తిని ఎన్ని సార్లు తిప్పాము. వారికి ఎంత ఆర్ధిక, మానసిక, శారీరక నష్టం జరిగింది. ఎంతకాలములో క్లియర్ చేయాల్సిన వాటిని, మనం ఎంత కాలములో క్లియర్ చేశాము. అంటే, మనం తీసుకున్న జీతానికి, ఉద్యోగసమయములో ఎంత కాలము టైమ్ వేస్ట్ చేశాము అనేది కూడా అవినీతే కదా! ఆఫీస్ కు వచ్చేది 10:30.. టీ తాగడానికి, ముచ్చట్లు, లంచ్ కు ఎంత టైమ్ తీసుకుంటున్నాము, తిరిగి ఎంత టైమ్ సీట్లో ఉన్నాము, ఏ రోజు క్లియర్ చేసిన ఫైల్ ఆరోజు క్లియర్ చేయలేదు అంటే, ఆ రోజు జీతము లో కొంత లంచం తీసుకున్నట్లే కదా! 

అలాగే పాఠశాలలో మనం ఉండే సమయములో బోధనకు ఎంత సమయం కేటాయించారు! మనం ఎంత సమయం బోధించాము! పిల్లలకు ఎంత జ్ఞానం వచ్చింది. సరిపడ పని చేయలేదు అంటే, వేస్ట్ చేసిన సమయం లంచమే కదా!

కూలికి వచ్చిన వ్యక్తి, ఎన్ని గంటలకు పైసలు తీసుకుంటున్నారు! ఎన్ని గంటలు పని చేస్తున్నారు! అందులో కూడా వేస్ట్ చేసిన సమయానికి తీసుకున్న పైసలు లంచమే కదా! 
దేన్నిబట్టి చూస్తే అసలు అవినీతి పరులు అనే వారు ఎవరు అనేది తెలుస్తుంది.
అందుకే, అవినీతి మరకలు చేతికే కాదు, మనసుకు కూడా అంతకూడదు మిత్రమా!

గోళ్ళముడి మల్లికార్జున శర్మ, 
విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ,

No comments:

Post a Comment