Friday, June 28, 2024

 జాగరణ

జాగరణ అంటే నిద్రని మాని మెలకువగా వుండడం అని అర్ధం. నిద్రలో వున్నవాడు తన శరీర పరిస్థితిని యెరుగక-యితరులు ఆక్షేపించే స్థితికి చేరుతాడో-ఆ పరిస్థితి లేకుండా వుండడమే మెలకువ. అంటే తప్పులు శారీరకంగా మానసికంగా చేయకుండా వుండటమని భావం. మెలకువవున్నవాడు ప్రమాదాలు లేకుండా గమ్యాన్ని చేరినట్లు-మానసికంగా మెలకువ వున్నవారు-యే దోషమూ చేయకుండా -జీవనగమ్యాన్ని చేరుకొంటారు. కంటికి
నిండుగా నిద్ర, కడుపునిండా తిండి వగైరాలు- శారీరకంగా మెలకువని యివ్వవు. అందుకని అలాగే మానసికంగా వున్న తమకము-గర్వము వగైరాలు మానసికంగా మెలకువని యివ్వవు. కాబట్టి శరీరానికి మెలకువనీయడానికి ఉపవాసం-భగవత్సాన్నిధ్యం అవసరం అన్నారు. అది వుంటే మానసికంగా- మెలకువ- గర్వరాహిత్యం- వినయశీలత వస్తాయి. అందువలన జన్మానికి ఒక రాత్రి అయినా శారీరక వికారాలనీ-మానసిక వికారాలనీ అదుపులో వుంచుకొని స్వచ్ఛతని పొందితే-శివము-శుభము-కలిగే రాత్రి-శివరాత్రి అని అన్నారు. అంటే సంవత్సరానికి - ఒకమాఘమాస మైనా మాఘవ్రతం చేసి-ఒకశివరాత్రి అయినా- వుపవాసం-జాగరణ-పూజ-చేస్తే త్రికరణాలాపరిశుద్ధత కలిగి మానవుడు తరిస్తాడు. లేకపోతే శరీరానికి బాధ తప్ప మరేమీవుండదు. మనము యీ లోకాన్ని ముఖ్యం(పగలు) అనుకొని-దానికై కొన్ని తప్పులను చేస్తాము. ధర్మాన్ని- జ్ఞానాన్ని (రాత్రిని) నిర్లక్ష్యం చేస్తాము. అశాంతిని పొందుతాము. ధార్మికులు- జ్ఞానాన్ని (పగలు) ముఖ్యం అనుకొని-ఈ లోకధర్మాలని (రాత్రి) అనుకొని నిర్లక్ష్యం చేస్తారు. కాని ధర్మాన్ని-జ్ఞానాన్ని ముఖ్యం అనుకోవడంవల్ల శాంతిని పొందుతారు. అజ్ఞానులు పగలు అనుకొనేదీ విలువైనది యిహలోకసుఖం-రాత్రి అనుకొనేది జ్ఞానం. జ్ఞానం జ్ఞానులకు పగలు-యిహలోకం రాత్రి.

No comments:

Post a Comment