Monday, June 17, 2024

కర్మ, విధి, మానవసంకల్పము

 *శ్రీ గురుభ్యోనమః*

   *కర్మ,  విధి,  మానవసంకల్పము*

 
            కర్మలను  మూడు  విధాలుగా  విభజిస్తారు.  హిందూ  సిద్ధాంతాలు  చాలా  మట్టుకు  క్రింద  వివరింపబడిన  విభజనను  చేస్తాయి.  

*1.  సంచిత  కర్మ :*  పూర్వ  జన్మలలో  సమకూడిన  కర్మ.

*2.  ప్రారబ్ధ  కర్మ :*  ఈ జన్మలో  అనుభవించవలసిన  సంచితకర్మలోని  భాగం.  

కర్మ  సిద్ధాంతాన్ని  అనుసరించి  మనిషి  వ్యాపకాలు  ముందే  నిర్ణయింపబడి  ఉండటం  వల్ల,  ప్రారబ్ధాన్నే  *విధి*  అని  కూడా  అంటారు.

*3.  ఆగామి  కర్మ :*  ఈ జన్మలో  అదనంగా  చేసే  కర్మ  -  ఉత్తర  జన్మలో  అనుభవింప  వలసి  వచ్చేది.

కర్మ  సిద్ధాంతాల  నిజాన్ని  శ్రీ రమణులు  అంగీకరించినా,  మనిషికి  పృథక్  భావమున్నంత  సేపే  ఆ సిద్ధాంతం  వర్తిస్తుంది  అనేవారు.  మనిషి  అజ్ఞానిగా  ఉన్నప్పుడు ..  పూర్వ  చేష్టలకి,  భావాలకి  ఫలితాలైన  కొన్ని  నిర్ణీతమైన  వ్యాపకాలకూ,  అనుభవాలకూ  వశుడవుతాడు.

*మనిషికి  సంబంధించిన  ప్రతి  పని,  అనుభవము  పుట్టినప్పుడే  నిర్ణయమైపోతాయని,  మనిషికి  ఉన్న  స్వేచ్ఛ  అంతా  పనిచేసేవాడు  గాని,  అనుభవించేవాడు  గాని  ఎవ్వరూ  లేరని  గ్రహించటమేనని  కూడా  అప్పుడప్పుడు  అనేవారు.*

శ్రీ రమణులు  భగవంతుని  సంకల్పానికి  రూపం  కర్మ  అనేవారు.  ఆత్మ  సాక్షాత్కారానికి  పూర్వం  వ్యక్తిగత  ఈశ్వరుడున్నాడని,  ఆయనే  మనిషి  యొక్క  అదృష్టాన్ని  నియంత్రిస్తాడని  అనేవారు.  ప్రతి  మనిషి  తన  చేతల  ఫలితాలను  అనుభవించవలసిందే !  వాటిని  నిర్ణయించేది,  ఏ క్రమంలో  అనుభవించాలో  నిర్ణయించేది  కూడా  ఈశ్వరుడే !  దేహాత్మబుధ్ధి  ఉన్నంత  వరకు,  ఈశ్వరుని  పరిధినుండి  ఎవ్వరూ  తప్పించుకోలేరు.  కర్మకి  పూర్తిగా  అతీతమవటానికి  ఒకే  ఒక  మార్గం  ఆత్మసాక్షాత్కారం  పొందటం.
            
 *"నీ సహజస్థితిలో  ఉండు"*
 *భగవాన్ శ్రీ రమణమహర్షి బోధనలు*
                       
🪷🙏🏻🪷🙏🏻🪷

No comments:

Post a Comment