Wednesday, June 5, 2024

నీవు ఎవరవు?* *ఎవరి వాడివి?* *ఎక్కడి నుండి వచ్చావు?*

 హరిఓం   ,   

*నీవు ఎవరవు?*
*ఎవరి వాడివి?*
*ఎక్కడి నుండి వచ్చావు?*

భార్యాభర్తలు అన్యోన్యంగా, అనురాగంగా ఉంటారు, 
అలా ఉండాల్సిందే. 
అయితే వారి మధ్య ఉండవలసిన బంధం యొక్క అసలు తత్త్వం తెలిసి ఉంటే వారి బంధం అందంగాను, 
అద్భుతంగా ఉంటుంది, 
అలా తెలుసుకోలేక పోతే దుఃఖమయం అవుతుంది.

కళ్ళు అందంగా కనిపించాలని కాటుక పెట్టుకుంటారు, 
అది సరైనది కాకపోతే, 
అందం సంగతి ఎలా ఉన్నా 
కళ్లు పోయే ప్రమాదం ఉంటుంది.
అలాగే భార్యాభర్తల మధ్యగల బంధం యొక్క యదార్థస్థితిని తెలుసుకోలేకపోతే, 
సుఖం కోసం చేసుకున్న వివాహం దుఃఖంతో అంతమవుతుంది.

భార్యాభర్తలు కలసి ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి, 
కాని ఇలా కలిసి ఉన్నప్పుడు కూడా ఇద్దరి మధ్య కొంచెం ఎడం ఉండాలి. 
ఒకరికొకరు పూర్తిగా అతుక్కుపోతే, 
ఒకరు లేకపోతే మరొకరు బ్రతుకలేని పరిస్థితిని తెచ్చిపెట్టుకుంటే 
అది ఇద్దరిలోను ఎవరో ఒకరికి భరించలేని దుఃఖ కారణమవుతుంది. 
కనుక తత్త్వాన్ని విచారించాలి.

1) *కాతే కాంతః*
*నీ భార్య ఎవరు?* 
ఇప్పుడు నీ భార్య అనబడే స్త్రీ వివాహానికి ముందు ఒకరి కుమార్తె. ఆమె పుట్టుకలోగాని, పెరగటంలోగాని నీకు 
ఏ ప్రమేయమూ లేదు. 
ఆమె ఎక్కడో పుట్టింది, 
నీవు ఎక్కడో పుట్టావు. 
అయినా పెళ్ళితో మీ ఇద్దరకూ 
ముడిపెట్టటం జరిగింది.
పోనీ ఇప్పుడు ఇద్దరూ కలిసి ప్రయాణిస్తున్నారు గదా! 
*చివరిదాకా ఇలాగే కలిసే ప్రయాణిస్తారా?* 
అదేం లేదు. 
ఈ ప్రయాణంలో ఎవరో ఒకరు ముందుగా దిగిపోతారు, 
ఆ రెండవ వారు ఒంటరి ప్రయాణం సాగించాలి. 
అంటే జన్మించటం ఒక్కసారి జరగలేదు. 
వెళ్ళిపోవటం కూడా 
ఒక్కసారిగా జరగటం లేదు. 
ఈ మధ్యలో మాత్రం 
కొంతకాలం విడిగాను, 
కొంతకాలం కలసి మెలసి 
జీవిస్తారు అంతే.

ఇదంతా రైలు ప్రయాణం లాంటిది.  ఒక ప్రయాణీకుడు మద్రాసులో రైలెక్కాడు, 
కొంతదూరం ప్రయాణించి నెల్లూరు రాగానే మరొక ప్రయాణీకుడు ఆ కంపార్ట్ మెంట్ లోకి ఎక్కాడు. ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. లోకాభిరామాయణంతో ప్రారంభమై రాజకీయాలు, సినిమాలు, వేదాంతం అన్నీ మాట్లాడుకున్నారు. 
ఎంతో ఆత్మీయులయ్యారు. 
మొదటి ప్రయాణీకుడు చీరాల రాగానే దిగిపోయాడు. 
రెండవ ప్రయాణీకుడు మొదటివాణ్ణి విడిచి ఒంటరిగా, 
దీనంగా ప్రయాణించి విజయవాడలో దిగిపోయాడు. ఇంతే వారి మధ్య సంబంధం.

భార్యాభర్తల సంబంధం కూడా ఇలాంటిదే. 
అందుకే తత్త్వ విచారణ చేసి 
ఈ బంధం ఎట్టిదో సరియైన అవగాహన చేసుకోవాలి. 
అప్పుడే ఎలా ప్రవర్తించాలో 
సరిగ్గా తెలుస్తుంది.

2) *కస్తే పుత్రః*
*అలాగే కుమారుడెవరు?* 
అని కూడా విచారించు!
పుట్టిన దగ్గర నుండి అతడు ఎంతో ప్రేమాస్పదుడైన కుమారుడు.

*మరి అంతకుముందు?*
అతడు భార్య గర్భంలో పిండం.
*అంతకు ముందో!*
అతడు బీజరూపం!
*ఆ బీజం ఎలా వచ్చింది?*
తిన్న ఆహారం ద్వారా తయారైంది?
*మరి ఆ ఆహారం ఎక్కడి నుండి వచ్చింది?*
భూమిలో నుండి వచ్చింది.
అంటే మట్టి అనేక మార్పులు చెంది, ఆహారంగా మారి, 
ఆ ఆహారం బీజంగా మారి, 
ఆ బీజం భార్య గర్భంలో ప్రవేశించి పిండంగా మారి, 
అది వృద్ధి చెంది శిశువుగా వ్యక్తమైంది.
అంటే మట్టి యొక్క చివరి రూపమే కుమారుడు అన్నమాట. 

*మరి నీవు ఎవరు?* 
నీవూ అంతే, 
కాకపోతే ఆ బిడ్డకన్నా కాలంలో 
నీవు ముందున్నావు. 
నీవు కూడా మట్టి యొక్క ఆఖరి రూపమే. 
ఈ లెక్కన చూస్తే కదులుతున్న ఒక పెద్ద మట్టి ముద్ద మరొక చిన్న మట్టి ముద్దను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది, 
ప్రేమను పెంచుకుంటుంది. 
విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు 
విల విలలాడి పోతుంటుంది.

దూరంగా ఉండి ఈ రెండు మట్టి ముద్దల నాటకాన్ని మనం తమాషాగా చూస్తున్నాం అనుకోండి. నవ్వకుండా ఉండలేం! 
కాని అదే నాటకంలో మనం పాత్రధారులమై ఎంతో సీరియస్ గా ఆ మట్టి ముద్దల పాత్రలను పోషిస్తున్నాం!
ఇదే భ్రమ! 
ఇదే మాయ! 
ఇదే అజ్ఞానం!

ఉన్నది ఉన్నట్లుగ చూడలేక 
'నాది - నాది' అని భ్రమలో పడి కొట్టుకుపోతుంటాం. 
ఎంత చిత్రం. 
అందుకే ఈ సంసారం అతి విచిత్రం, 
తమాషా అయినట్టిది. 

ఇంతకీ ఈ సంసార బంధంలో చిక్కుకు పోయిన
*నీవు ఎవరు?*
*ఎవరి వాడవు?*
*ఎక్కడి నుండి వచ్చావు?*....
ఈ విచారణ ముఖ్యమైనది. 
వేదాంతంలో 
*నేనెవరు?* 
అని విచారణ చేయటమే మానవ జీవిత సార్థక్యానికి ఏకైక ఉపాయం. 

సమస్త దుఃఖాలకు, అజ్ఞానానికి అంతమే ఈ *"నేనెవరు?"* 
అనే విచారణయే.

*నేనెవరు?*
*నేను ఈ శరీరమా?* కాదు.
ఇదొక గృహం లాంటిది. జడమైనది.
ఇందులో కూర్చుని నేను నా పనులను నిర్వర్తించు కుంటున్నాను. 

*మరి నేను మనోబుద్ధులా?* కాదు. అవి నేను పనిచేయటానికి ఉపయోగించుకొనే పనిముట్లు మాత్రమే, 
అవీ జడమే.
వాటిని నేను ఉపయోగించుకుంటున్నాను.

*మరైతే నేనెవరు?* 
దేహంలో కూర్చొని, మనోబుద్ధులను ఉపయోగించుకొని పనిచేసే జీవుడను. 

*అయితే జీవుడనైన *
ఎక్కణ్ణించి వచ్చాను?
నేను నిజంగా అంతటా వ్యాపించియున్న పరమాత్మకు చెందినవాడను.
నేను వచ్చింది అక్కణ్ణించే.

*మరి ఎక్కడకు వెళ్ళాలి?* 
ఆ పరమాత్మ వద్దకే. 
పరమాత్మ నుండి వచ్చిన జీవుడు కొంతకాలం ఈ జీవన నాటకరంగంలో సుఖదుఃఖాలు అనుభవించి చివరకు ఆ పరమాత్మలో చేరిపోవాలి. 
అప్పుడే పరమశాంతి, శాశ్వతానందం.........

ఆశ్చర్యకరమైన, 
అద్భుతమైన, 
అపురూపమైన, 
అతి దుర్లభమైన 
ఈ మానవజన్మను 
మరల జన్మ 
లేకుండా చేసుకుందాం!
ఆ పరమాత్మ అందర్నీ అనుగ్రహించుగాక!............

          🙏🙏  ......                               -       వలిశెట్టి  లక్ష్మీశేఖర్.....                  -        98660 35557.......                        -        05 .06 .2024........

No comments:

Post a Comment