Friday, June 28, 2024

సమయవినియోగం

 *సమయవినియోగం* 

“కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్ఛతి ధీమతాం 
వ్యసనేన చ మూర్ఖాణాం నిద్రయా కలహేన వా"
         
“బుద్ధిమంతులకు కావ్య, శాస్త్ర వినోదంతో సమయం గడుస్తుంది. మూర్ఖులకు మాత్రం విచారంతోనో, నిద్ర తోనో, తగవులతోనో గడుస్తుంది " అని ఈశ్లోకానికి భావం. 

 కాలం అమూల్యం. ఎవ్వరూ దానికి విలువకట్టలేరు. సంపదలు లేనివారు ఎందరో ఉండవచ్చు, కానీ కాలసంపద లేనివారు ఏ ఒక్కరూ ఉండరు. దానిని సద్వియోగం చేసుకోటంలోనే జీవన సాఫల్య రహస్యం దాగి ఉంటుంది. కాలమంటే ఆయుర్దాయమే.“ఆయుః పరిస్రవతి భిన్న ఘటాదివాంభో.."(బీటపడిన కుండలోని నీరువలె ఆయుర్దాయం ప్రవహిస్తోంది) అన్నాడొక కవి. ఆయువు తీరిపోక ముందే చేయవలసిన సత్కార్యాలను చేయాలి. అనంత ధనరాసులను ఇచ్చినా - గడచిపోయిన ఒక్క క్షణమైనా వెనక్కి రాదు. 

బుద్ధిమంతులు కావ్యాలూ, శాస్త్రాలూ చదువుతూ రసానందాన్ని అనుభవించటమేకాదు, అవి ప్రతిపాదించిన ధార్మిక జీవన విధానాన్ని ఆచరిస్తూ ఆముష్మికానంద నిధులను కూడా సమకూర్చు కోగలుగుతారు. కాలం విలువ తెలియని వారు దానిని వృధా చేసుకుంటారు.  
“I wasted time, and now doth time waste me"(నేను సమయాన్ని వృధా చేశాను. ఇప్పుడది నన్ను వ్యర్థుణ్ణి చేసింది) అంటాడు షేక్స్పియర్. మూర్ఖులు కాలాన్ని వ్యసనాలతో, నిద్రతో, తగవులతో గడుపు తారు. నిద్ర జీవులకు అవసరమే అయినా దానికి పరిమితి ఉండాలి. 
“Six hours in sleep is enough for youth and age. Perhaps seven for the lazy, but we allow eight to no one."అనేది ఒకఆంగ్ల సూక్తి. 

 “సమయం ఉచితంగానే లభిస్తుంది. కానీ అది అమూల్యమైనది. నువ్వు దానిని సొంతం చేసుకోలేవు, కానీ విని యోగించుకోగలవు. నువ్వుదానిని దాచుకోలేవు, కానీ ఖర్చు చేసుకోగలవు. ఒకసారి దానిని నువ్వు పోగొట్టు కుంటే  తిరిగి వెనక్కి తెచ్చుకోలేవు "అంటాడొక ఆంగ్ల రచయిత. కాలాన్ని దైవస్వరూపంగా పెద్దలు చెప్తారు. అందుకే దానిని ఎంతో పవిత్రవస్తువుగా భావించాలి. సకాలంలో చేసిన పనికే విలువ ఉంటుంది. సమయం మించి పోతే చేయగలిగినదేమీ ఉండదు. “నిర్వాణ దీపే కిము తైలదానమ్ "(ఆరిపోయిన దీపానికి నూనె పోయటం ఎందుకు?) అన్నట్టుగా కాలాన్ని వ్యర్థం చేసికొని, విచారించటం అవివేకం.            
     

No comments:

Post a Comment