Tuesday, August 6, 2024

చిల్లర నాణేలు -- ఇప్పుడు..

 కాఫీ కబుర్లు సంఖ్య 669 ((ఆగస్టు 06 - 2024)  చిల్లర నాణేలు -- ఇప్పుడు.. ఈరోజుల్లో చిల్లర అంటే  10 20   50 రూపాయల నోట్లు.  ఆరోజుల్లో ఐదు దశాబ్దాల ముందు.. చిల్లర అంటే  2 3 5 10 25 50 నయాపైసాల కాయిన్స్ (నాణాలు).  మన ఉద్యోగస్తుల ఇళ్ళల్లో నోట్లు కంటే నాణేలే ఎక్కువగా వాడకంలో ఉండేవి.  ఒకటో తారీఖు జీతం రాగానే చేబదుళ్ళు తీర్చడం, అద్దెలు కరెంట్ బిల్లు కట్టడం, పిల్లల స్కూలు కాలేజీ ఫీజులు చెల్లించడం, నెలకు సరిపడా కిరాణా తెచ్చుకోవడం  వంటివి అయ్యేసరికి మిగిలినవి ఎక్కువగా ఈ నాణేలే.  జీతం 500 దాటితే మంచి జీతగాడు, 1000 దాటితే గొప్ప జీతగాడు అనుకునేవారు.  రాష్ట్ర కేంద్ర ప్రభుత్వోద్యోగుల జీతాలు ఐదారు వందల లోపే ఉండేవి.  నేను మొదటిసారి వంద రూపాయల నోటు చూసింది బ్యాంకు ఉద్యోగంలో చేరిన తర్వాతే.  మా నాన్నగారి ఉద్యోగం పోస్టాఫీసులో గనుక జీతం వచ్చాక వంద రూపాయల అన్ని నయాపైసా ల కాయిన్స్ అందుబాటులో ఉంచి నోట్లు మాత్రం బీరువాలో భద్రంగా దాచేవారు మిగతావారికి తీయడానికి అవకాశం లేకుండా.  చాలా మధ్యతరగతి ఇళ్ళల్లో ధోరణి ఇలాగే ఉండేది.  చిన్న చిన్న ఖర్చులకి నోట్లు అవసరం ఉండేవికావు.. ఒక రూపాయి లోపు నయాపైసాలతోనే.  అరకప్పు టీ 15 పైసలు, ఒక కప్పు టీ పావలా (25 నయా పైసలు), పాన్ సిగరెట్ ఐదు పది పైసలే.  అయ్యర్ హోటల్ లో  ఇడ్లీ పూరీ ఉప్మా రవ్వదోసె.. ఏదైనా అర్ధ రూపాయే (50 పైసలు).  టిఫిన్ కాఫీ కి అయ్యే ఖర్చు 75 నయాపైసలు మాత్రమే..  ఒక రూపాయి లోపే.  సినిమా, ఇంటర్వెల్ లో టీ ఖర్చు 90 పైసలే.  ఆంధ్ర సచిత్ర వారపత్రిక, ఆంధ్రప్రభ వీక్లీ 25 నయాపైసలు మాత్రమే.  వీక్లీ ముఖచిత్రం పై 25 న.పై. అని ముద్రించే వారు.  యువ జ్యోతి జయశ్రీ వంటి మాసపత్రికల వెల ఒక రూపాయి ఉండేది.  మా స్కూల్ గోయింగ్ డేస్ లో అప్పుడప్పుడు పది ఇరవై నయాపైసాలు ఇచ్చేవారు.  ఇంటర్వెల్ లో పిప్పరమెంట్లు, జంతిక(లు) వంటివి ఆ పది పైసలుతో కొనుక్కుని తినేవారం.. దాహం వేస్తే ఐదు పైసలిచ్చి గోళీ సోడా తాగేవాళ్ళం.  అప్పట్లో పెద్ద పెద్ద వీధులు, పెద్ద పెద్ద ఇళ్ళు.  బెగ్గర్స్ తాకిడి ఎక్కువే.  ఒక్కో బెగ్గర్ ఒక్కో వారం వచ్చేవాడు. వాళ్ళకి రెండు లేదా మూడు నయాపైసల నాణాలు వేసేవారం.  కాయగూరలు పండ్లు కూడా కేజీ 50 పైసలు అలా ఉండేవి.  ఈవిధంగా ఆ రోజుల్లో చిన్నా చితకా చిల్లర ఖర్చులు అన్నీ నయాపైసల లోనే.. అంటే ఒక రూపాయి లోపే.  ఇప్పుడు..  పైసల నాణేలు పోయి చాలాకాలం అయింది.  బయట మామూలు కాఫీ ఇరవై రూపాయలు.  సింగిల్ థియేటర్ లో సినిమా టికెట్ ధర 150 రూపాయలు.  ఆరోజుల్లో ఐతే నెలకి నాలుగు సినిమాలు చొప్పున చూస్తే మూడు సంవత్సరాలకి 150 సినిమాలకి అయ్యే ఖర్చు ఇది.  అర్ధ దశాబ్ద కాలంలో ఎంత తేడా.. ఎంత మార్పు.. ఇంతకీ ఈరోజు కాఫీ కబుర్లు లో పైసలు చేర్చడానికి ఒక (బలమైన) కారణం ఉంది.  రాత్రి ఓ విచిత్రమైన కలొచ్చింది.  నేను హిమాలయాల్లో చేసిన నా తపస్సుకి మెచ్చి ఎవరో ప్రత్యక్షమై..  తపస్సుకి మెచ్చాను  ఏం కావాలో కోరుకో అంటే.. తెలివితక్కువగా నేను అన్నిరకాల చిల్లర నాణేలు గల  ఒక బ్యాగ్ కావాలని కోరేనుట.. వెంటనే బ్యాగ్ నుంచి.. రెయిన్ రూపంలో కాయిన్ లు నాముందు వర్షించాయిట.. అలారం లేపేసింది ఉదయం నిద్ర నుంచి లేచే సమయం కావడంతో..  ----- గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని) విజయనగరం ఫోన్ 99855 61852....

No comments:

Post a Comment