Tuesday, August 6, 2024

🔱 అంతర్యామి 🔱 # వేదాంత గురువులు #

 🔱 అంతర్యామి 🔱

# వేదాంత గురువులు #

🍁ప్రతి మతంలోనూ ప్రత్యేక ఆచార వ్యవహారాలు ఉంటాయి. అలాగే హైందవ ధర్మంలో గర్భస్థ శిశువు మొదలు మరణం వరకూ జరిపే సంస్కారాలను షోడశ సంస్కారాలు అంటారు. వీటిల్లో మనిషి ఉన్నతికి దోహదపడే 'అక్షర 'సంస్కారం' లేదా 'విద్యాభ్యాస సంస్కారం' ఎంతో విశిష్టమైనది. ఇది మనిషిని పాశవికం ప్రవృత్తి నుంచి మానవత్వానికి, అనాగరికత నుంచి నాగరికతకు, చీకటి నుంచి వెలుగులోకి, అజ్ఞానం నుంచి జ్ఞానానికి, మానవత్వం నుంచి దివ్యత్వానికి చేర్చగలదు. ఇంతటి విశిష్ట ప్రయోజనాలను సమకూర్చే ఈ సంస్కారం సద్గురుసేవ, వారి కటాక్ష వీక్షణంతోనే లభ్యమవుతుంది.

🍁సద్గురువు గురించి తెలుసుకునేముందు శిష్యగణంలో ఉండే వర్గాల గురించీ తెలుసుకోవాలి. ప్రాథమికంగా శిష్యజాతిని కుశాగ్రబుద్ధి సంపన్నులు, ముసలాగ్ర బుద్ధులు, మృత్పిండ బుద్ధులు అనే మూడు రకాలుగా వర్గీకరించారు.

🍁దర్భ పోచ కొస(అగ్రం) చాలా వాడిగా ఉంటుంది. అందుకే సూక్ష్మగ్రహణ బుద్ధి కలవారిని కుశాగ్రబుద్ధిమంతులు అంటారు. వీరు తమ బుద్ధిబలంతో గురూపదేశానికి మెరుగులు దిద్దుకోగలరు. రోకటి పొన్నులా ‣ మందబుద్ధి గల ముసలాగ్ర బుద్ధిజులు గురువులు ఎంత బోధించిన గ్రహించలేరు. బోధించిన దాన్ని విపరీత అర్ధంలో తీసుకునే ప్రమాదమూ ఉంది. మట్టిముద్దకు నీరు తగలగానే మెత్తబడి, తడి ఆరిపోగానే మళ్లీ గట్టిపడుతుంది. అలాగే మృత్పిండ బుద్ధి కలవారు కూడా గురూపదేశం ఉన్నంత వరకూ పండితులుగా చెలామణి అయి, వారి ఉపదేశాలు ఆగిపోగానే మూర్ఖుల జాబితాలం చేరతారు.

🍁పైన పేర్కొన్న శిష్యుల్లో రెండు వర్గాలవారు సరైన గురువు లభిస్తే మేధావులుగా మారతారు. ఇలాంటి సందర్భాల్లోనే గురు కటాక్ష బలం అర్థం అవుతుంది. ఆదిశంకరుల శిష్యరికం చేసినవారిలో పద్మపాదుడు గురు కటాక్షానికి పాత్రుడైనట్టుగా శంకర జీవితచరితం చెబుతోంది.

🍁ఈ త్రివర్గ శిష్యగణమే కాకుండా మేష, మహిష జాతి శిష్యులు కూడా ఉన్నారు. మహిషం నీటిగుంటలో దిగితే అడ్డదిడ్డంగా తొక్కి మొత్తం నీటిని బురదమయం చేస్తుంది. ఆ నీరు ఇతరులకు ఉపయోగ పడకుండా చేస్తుంది. అదేవిధంగా మహిష జాతి శిష్యుడు. తాను చదువుకోకపోగా క్రమశిక్షణను ఉల్లంఘించి తోటి విద్యార్థులను కూడా చెడగొడతాడు.

🍁మేషం(మేక) చాలా చురుకైన జంతువు. 
నీటిని కెలక్కుండా ఒడ్డున నిలబడి
తాగుతుంది. అలాంటి శిష్యులు వినయంగా విద్యాబుద్ధులు నేర్చుకుని పేరు ప్రతిష్ఠలు సంపాదించుకుంటారు. శంకర భగవత్పాదులవారు తమ వివేక చూడామణి గ్రంథంలో బ్రహ్మవిద్యకు మేధావి, విద్వాంసుడు, మంచి ఊహకలవాడు, విచక్షణా జ్ఞానసంపన్నుడుగా ఉన్నవారే అధికారిగా ఉండాలని తెలియజేశారు. ఇలాంటి ఉత్తమ  లక్షణ సంపన్నులే ఆ విద్యను పొందేందుకు అర్హులు అవుతారు.

🍁గురువుల్లో సాధారణ గురువులు, సద్గురువులు, అని రెండు రకాలు. సాధారణ గురువులు అక్షరదాతలు మాత్రమే. సద్గురువులు ముసలాగ్రబుద్ధులు, మృత్పిండ బుద్ధులు అయిన శిష్యులను కూడా అనుగ్రహించి విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకుల్ని చేస్తారు. ఇలాంటివారు మనకు చాలా తక్కువగా కనిపిస్తారు. శంకర భగవత్పాదులు, గౌడయతీంద్రులు, వేదవ్యాసమహర్షి, శ్రీరామకృష్ణ పరమహంస ఈ కోవకు చెందిన గురుదేవులుగా కీర్తిని అందుకున్నారు. వీరిని వేదాంత గురువులని సంబోధించారు. విద్యాదానం కన్నా వేదాంత విద్యోపదేశం చేయడం పవిత్రమైనది.

🍁గురువులుగా గుర్తింపుపొందిన వారిలో డాంబికులు ఎవరో సద్గురువులు ఎవరో తెలుసుకున్నాకే గురుస్వీకారం చేసుకోవాలి. సద్గురువుల కటాక్షం అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అనే స్థితిని కల్పిస్తుంది.🙏

- ✍️యం.సి. శివశంకరశాస్త్రి

⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment