చలాచల బోధ:--
ఉలి దెబ్బలు తినిన బండరాయి శిల్పమై దేవునిగా పూజింప బడుతుంది.లేకుంటే నేలపై పడియుండి కాళ్ళతో తొక్కబడుతూ ఉంటుంది.అలాగే ఒక సంసారి తన జీవితంలో బాగా కొట్టబడినప్పుడు మాత్రమే తాత్కాలిక వైరాగ్యం కలిగి దేవుడు ఉన్నాడనే నమ్మకం లేకపోయినా ఆ దేవుని మీద భారం మోపుతాడు.అప్పడు శ్రేయోభిలాషి మాటలు వింటాడు.అంతా బాగానే ఉంటే తనకే అన్నీ తెలుసు అని అనుకుంటూ ఎవరిమాటలూ వినడు.జిల్లెళ్ళమూడి అమ్మ అంటుంది "బాధలు లేని బ్రతుకు స్థాణువులా ఉంటుంది"అని.అనగా బాధలు ఉంటేనే ఆలోచనా శక్తి పెరుగుతుంది.పోరాట పటిమ, ధైర్యము పెరుగుతాయి.బుద్ధిలో వివేకము పెరగటము ద్వారా మానవునిలో చైతన్య వికాసము జరుగుతుంది.ముముక్షువైన వానికి ఆ చైతన్యానుభవము ప్రాప్తిస్తుంది.
భక్తుడు భక్తుడుగానే మరియు భగవంతుడు భగవంతుగానే ఉండడము కాదు.ఏనాటికైనా భక్తుడు భగవంతు డైపోవాలి.అందుకే భక్తునికి బాధలు ఎక్కువ.ఈ బాధలు భక్తుడు భగవంతునిగా స్వానుభవం పొందటానికే! భక్తుని కష్టాలు ఆతని శిక్షణకేగాని శిక్ష కోసం కాదు.
ఆర్జునకు విషాద యోగం సంభవించినందువల్లనే శ్రీకృష్ణుడు సాంఖ్య యోగముతో మొదలుపెట్టి భగవద్గీత బోధించి, విశ్వరూప సందర్శనం అనుగ్రహించాడు.
కావున మనము సమస్యలను స్వాగతిస్తూ మనలోని విచారణా శక్తిని మరియు వివేకాన్ని పెంచుకోవాలి గాని,బాధల నుండి పారిపోకూడదు, క్రుంగి పోకూడదు.మన బాధలే మన చైతన్య వికాసమునకు తోడ్పడతాయి.అందుకే జీవితంలో కొట్టబడ్డ సంసారియే ముముక్షువై మంచి సాధకుడవుతాడు.
No comments:
Post a Comment