*భగవంతుడికి ఇష్టమైన పనులు చేస్తే పుణ్యం, ఆయనకు ఇష్టం కాని పనులు చేస్తే పాపం వస్తాయి.*
```
భగవంతుడు మనకిచ్చిన వేదాలు, ధర్మశాస్త్రాలు ఆయన ఇష్టాయిష్టాలు తెలియజేస్తాయి. స్థూలంగా చెప్పాలంటే ఎదుటివారికి మంచిచేస్తే పుణ్యం, చెడు చేస్తే పాపం వస్తాయి. కర్మ అంటే మనం చేసే పని! అంతేకాదు ఆ పని చేయడానికి మనం చేసే, ఆలోచనలు కూడా కర్మలే!
కర్మ మనం చేసే చర్య, ప్రతి చర్య గొలుసులాంటిది. ఈ గొలుసు తెగితేనే ముక్తి.
మన జన్మకు, కర్మకు అవినాభావ సంబంధం ఉంటుంది. మన జన్మతో పాటే చేసుకున్న కర్మ కూడా వస్తుంది. ఈ కర్మ మూడు విధాలు.
సంచిత కర్మ, ప్రారబ్ధకర్మ, ఆగామి కర్మ.
వెనుక జన్మలలో చేసుకున్నది సంచిత కర్మ. సంచితంలో నుంచి ఈ జన్మలో మన అనుభవించడానికి వచ్చేది ప్రారబ్ధం. ఈ జన్మలో చేసుకుని, వచ్చే జన్మలో అనుభవానికి వచ్చేది ఆగామి. అయితే కొన్ని కర్మలు, వాటి ఫలాలు ఈ జన్మలోనే అనుభవానికి వస్తాయి.
ఎలాగంటే నేరస్థుడికి న్యాయస్థానం కఠినశిక్ష విధిస్తుంది. అంటే ఈ జన్మలోనే కర్మఫలాన్ని పొందినట్లు. ఆ శిక్ష అతడికి సరైనది కాకపోతే, శిక్ష పడేలోగానే అతడు మరణిస్తే కర్మఫలం వచ్చే జన్మకు బదిలీ అవుతుంది.
అలా జన్మజన్మలకు పేరుకుపోయిన మన కర్మల ఫలితాలనే మనం అనుభవిస్తాం. అదే భగవంతుని కృప ఉంటే మన ప్రారభ్దాన్ని సుఖంగా (తేలికగా) అనుభవించే శక్తిని ఆయన ప్రస్తాదిస్తాడు.
కర్మసిద్ధాంతం మూలసూత్రం ఏంటంటే, కర్మలు చేసేది మనమైతే దాని ఫలితాలను ఇచ్చేది భగవంతుడు. అందుకే ఆ భగవానుడిపై భారంవేసి, అన్నీ మంచి పనులు చేసి లోక హితం చేకూర్చడానికి మనం పాటుపడాలి.
ఏవైనా తప్పులు చేస్తే పశ్చాత్తాపపడాలి. మరొక్కసారి మనవల్ల అలాంటి తప్పులు జరగకుండా నడుచుకోవాలి.
No comments:
Post a Comment