Wednesday, November 19, 2025

 *#నిశ్శబ్దం ఒక ఔషధం / ఉపవాసం/సంభాషణ*

*మెదడు*మనలోని నిశ్శబ్ద దేవాలయం.
ఒక మనిషి జీవితం  కేవలం గుండె కొట్టుకునే లయ కాదు.అది మెదడులోని ఒక సున్నితమైన సంగీతం.ఆ సంగీతం ఏ స్వరంలో నడుస్తుందో, మన జీవితం అదే రాగాన్ని పాడుతుంది.

బ్రెయిన్ స్ట్రోక్ కాని ట్యూమర్ కాని, అవి ఒక్కరోజులో పుట్టే విత్తనాలు కావని నెమ్మదిగా చదవసాగాను. అవి సంవత్సరాలుగా మనం మన ఆలోచనల్లో, మన ఆహారంలో, మన భయాల్లో వేసుకున్న విత్తనాలే.

మనకు చిన్న చిన్న ఆలోచనలు వస్తుంటాయి 
“ఏం జరుగుతుందో?” 
“వారు అలా ఎందుకు చేసారు?” 
“నాకే ఎందుకు ఇలా?”
అవి మన తలలో నిలిచిపోతే, నాడులపై ఒత్తిడి పెరుగుతుంది.

మీకు తెలుసా ఒక చినుకు సరిపోతుంది, ఒక రాయిని పగలగొట్టడానికి.అలాగే ఒక ఆలోచనే సరిపోతుంది, ఒక మనిషి నాడి స్రవంతి అల్లకల్లోలమయ్యేందుకు.మనిషి తలలో విత్తనం వేయొద్దు, పుష్పం వేయి.
*నువ్వు ఆలోచన ఇస్తే అది శరీరమవుతుంది*
*నువ్వు ప్రేమ ఇస్తే అది ఆరోగ్యమవుతుంది*
*నువ్వు భయం ఇస్తే అది వ్యాధి అవుతుంది*

శరీరాన్ని కాపాడటానికి మనం మందులు వెతుకుతాం,కానీ మనసును కాపాడటానికి మనం మౌనం నేర్చుకోవాలి.

ప్రతి రోజూ ఐదు నిమిషాలైనా తలను నిశ్శబ్దంగా ఉంచాలి. ఆ తర్వాత నిశితంగా గమనించాలి. 
ఆలోచనల మబ్బులు కరిగిపోతాయి. ఆ సమయంలో రక్తప్రసరణ కూడా నిటారుగా ప్రవహిస్తుంది.ఎంత చెప్పిన మెదడు నిశ్శబ్దాన్ని కోరుకుంటుంది శబ్దాన్ని కాదు.

ఒకసారి ప్రక్యాతి సంగీత దర్శకులు ఏ ర్ రెహమాన్ గారిని ఒక వ్యక్తి ఇంటర్వ్యూ లో ఒక ప్రశ్న అడిగారు 
"ప్రపంచానికి ఇంత మంచి సంగీతాన్ని అందించారు కదా మరి మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీరెలాంటి సంగీతం వింటారు"

*దానికి సమాధానం*
"నేను ఏమి వినను జస్ట్ పిన్ డ్రాప్ సైలెన్స్ ని ఇష్ట పడతాను" 

అడిగిన వ్యక్తి అవాక్కయినట్టు నేను అశ్చర్య పోయాను. "అవును... నేను సైలెన్స్ ను ఇష్ట పడతాను. నిశ్శబ్దంగా ఉంటాను. నిశ్శబ్దాన్ని కోరుకుంటాను" అన్నారు. 

*నిశ్శబ్దం*
మనిషి జీవనంలో అది ఒక “పాజ్ బటన్” కాదు అది “రీకనెక్ట్ బటన్.”

మనమందరం ఒక శబ్ద సముద్రంలో జీవిస్తున్నాం. మాటల శబ్దం, ఆలోచనల శబ్దం, ఆందోళనల శబ్దం.ఇతరుల మాటలు మనసులో మారుమ్రోగుతూనే ఉంటాయి,కానీ మన మనసు మనతో మాట్లాడే శబ్దాన్ని మనం వినలేము.

నిశ్శబ్దం అంటే శూన్యం కాదు.అది ప్రాణం శ్వాస తీసుకునే స్థలం.అందుకే మహర్షులు గుహల్లో కూర్చుని మౌనాన్ని ఆశ్రయించారు,
ఎందుకంటే వారు తెలుసుకున్నారు 
*శబ్దంలో సమాధానం ఉండదు, నిశ్శబ్దంలో జ్ఞానం ఉంటుంది*

ఒకసారి మనం మనలోకి వెళ్లి వినిపించని శబ్దాలను వింటే,అక్కడ ఒక సత్యం ఉంది
“నీకు కావాల్సింది బయట కాదు,
నీలోనే ఉంది. నీవే ఆ ప్రశాంతత.”

మనిషి తలలో మబ్బులా తిరుగుతున్న ఆలోచనలునిశ్శబ్దంలో క్రమంగా కరిగిపోతాయి.
ఆ క్షణంలో శరీరం ఆత్మను కలుస్తుంది.
ఆత్మ శరీరాన్ని ఆలింగనం చేసుకుంటుంది.
అది ఆత్మ వివేకం, ఆ శాంతి 
మెదడులోని ప్రతి నాడికి మందు.

నిశ్శబ్దం ఒక ఔషధం.
నిశ్శబ్దం ఒక ఉపవాసం.
నిశ్శబ్దం ఒక సంభాషణ.
ఆ నిశ్శబ్దం తల్లిలా మనకు ఒక మాట చెబుతుంది 
“ఏమీ మాట్లాడకు... నేను ఉన్నాను.”

ప్రేమలో, కోపంలో, దుఃఖంలో ఎప్పుడు మనం నిశ్శబ్దంగా ఉంటామో అప్పుడు మన నిజమైన భావం బయటపడుతుంది.కోపంలో మాటలతో గాయపరచలేనంతగా,నిశ్శబ్దం ఒక మనిషిని మార్చగలదు.

నిశ్శబ్దం అనేది పర్వతం లాంటిది.నువ్వు ఎక్కుతుంటే శబ్దం తక్కువ అవుతుంది,
శ్వాస ఎక్కువ అవుతుంది.నిశ్శబ్దం లోకాన్ని దాటిపోతుంది,శరీరం ఒక సాధనం అవుతుంది,
ఆత్మ సంగీతమవుతుంది.

ఏం తింటావు, ఏమి ధరిస్తావు అనేది కంటే
ఏమి ఆలోచిస్తున్నావు, ఎలాంటి మౌనం పాటిస్తున్నావు అనేదినీ ఆరోగ్యానికి, నీ బుద్ధికి, నీ జీవన దిశకు నిర్ణయాత్మకం.

ప్రతి రోజు ఐదు నిమిషాల మౌనం.అది కేవలం ధ్యానం కాదు, అది శరీరానికి పండుగ.

ఆ నిమిషాల్లో మనం మన శరీరాన్ని వినగలం,
మన ఆత్మ మన భయాలను తుడిచేస్తుంది,
మన ఆలోచనలు నీటిలా పారిపోతాయి.

రహ్మాన్ గారు చెప్పినట్టు 
“పిన్ డ్రాప్ సైలెన్స్” అంటే శూన్యం కాదు,
అది దేవుడు పిలిచే స్వరం.

మనం నిశ్శబ్దాన్ని నేర్చుకుంటే,
మన మెదడు చల్లబడుతుంది,
మన హృదయం నయం అవుతుంది,
మన సంబంధాలు స్పష్టమవుతాయి.
ఎందుకంటే,మాటలకన్నా లోతైన భాష నిశ్శబ్దమే.

కొన్ని ప్రేమలు మాటల్లో పుట్టవు మౌనంలో పుడతాయి.కొన్ని గాయాలు మందులతో నయం కావు  నిశ్శబ్దంతో నయం అవుతాయి.
కొన్ని సమాధానాలు ప్రపంచం ఇవ్వదు 
నిశ్శబ్దం మాత్రమే ఇస్తుంది.

అందుకే,రోజు చివర్లో ఒక ప్రశ్న నీకు నీతో అడుగు 
“నేను ఈరోజు ఎన్ని నిమిషాలు నిశ్శబ్దంగా ఉన్నాను? ఉండగలిగాను?”

నువ్వు లేని చోటే ఉంటుంది... నీ మనసు. 
గాలి కన్నా వేగమైంది మనసు... 

ఎందుకంటే,నిశ్శబ్దం అంటే పరారితనం కాదు,
అది పరమార్థం..*

లోకములోని చీకట్లను కబళించివేసే,నిర్మూలన చేసే సూర్యుడి వలె నీవు నా మనః పద్మమును వికసింప చేయుము..

నా మనసులో ఉన్న మాలిన్యపు ఆవరణము ను తొలగించుము..ఈ మాలిన్యము లోకములోని చీకట్లవలె నా హృదయమును ఆవరించి యుండుటచే నా మనో కమలము వాడి పోయి యున్నది..కరుణా కటాక్షములు తో కూడిన నీ కడగంటి చూపులు నాపై ప్రసరింప చేసినచో, అవి నా హృదయ పద్మమునకు సూర్యకిరణముల వలె జీవము ప్రసాదించుము..

సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ మబ్బులు ఉన్నచోట కనుపించడు.. ఆత్మ కూడా బుద్ధి మొదలైన ఆవరణలతో కప్పబడినపుడు కుండలో ఉన్న దీపంలా కనుపించదు..
ఆత్మజ్ఞానము అనే సూర్యుడు ఉదయించినపుడు మనలోని అజ్ఞానము తొలగి పోతుంది..

ఆత్మ ప్రకాశము స్వతంత్రమే అయినప్పటికీ అవిద్య,,అహము వంటి వాటితో కప్పబడినపుడు ప్రకాశము కనుపించక పోవచ్చు.. అటువంటి సమయంలో అరుణాచలేశ్వరుడు వెలుగుకు వెలుగై హృదయ కమలము అను ఆత్మ జ్ఞానము ను వికసింపచేయగల సూర్యుడు..ఈ సూర్యోదయము కొరకు భక్తుని హృదయము ఆతురతతో వేచిఉన్న ఉన్న క్షణం కోసం ఎదురుచూస్తూ..*
.

ధ్యానం చేస్తే ఆరోగ్యం వస్తుందా, ధ్యానం చేస్తే నేను అందంగా అవుతాన. ధ్యానం చేస్తే నా తెల్లజుట్టు నల్లగా అవుతుందా, ధ్యానం గంటలు గంటలు చేస్తే ఆటోమేటిక్ గా డబ్బులు వచ్చేస్తాయా, ధ్యానం చేస్తే నాకు పేరు ప్రఖ్యాతులు వస్తాయా, ధ్యానం చేస్తే నేను పెద్ద గురువును అయిపోతానా అని ఇలా ఆశిస్తూ అనుకోవటం కంటే పెద్ద మూర్ఖత్వం ఇంకోటి ఉండదు, ధ్యానం చేయటం వలన మనకి ధ్యానం గురించి తెలుస్తుంది, అలా తెలియటమే గొప్ప విషయం, ఇప్పటివరకు తెలియని ధ్యానం గురించి తెలుసుకోవటం కంటే గొప్ప భాగ్యం ఇంకేం ఉంటుంది,  కర్మఫలాన్ని పట్టించుకోకుండా కర్మలు చేసే సాధనలో ఉత్తీర్ణుడు అయినవాణ్ణి మాస్టర్ అంటాము..*.          

No comments:

Post a Comment