Monday, November 17, 2025

 *సచ్చిదానంద స్వరూపం*

సచ్చిదానందమనేది భారతీయ తత్వశాస్త్రంలో పరమ సత్యాన్ని లేదా పరమాత్మ స్వభావాన్ని వివరించడానికి ఉపయోగిస్తారు. ఈ పదం సత్యం, జ్ఞానం, ఆనందం అనే మూడు విషయాలను సూచిస్తుంది. ఇది కేవలం నిర్వచనం కాదు, మన అంతరంగంలో, సకల విశ్వంలో వెలిగే దివ్యజ్యోతి.

‘సత్‌’కి సరళమైన అర్థం ఉనికి. అయితే, వేదాంత దృక్కోణంలో దీనికి లోతైన అర్థం ఉంది. సాధారణంగా ఏ జీవి అయినా పుట్టి, పెరిగి, అంతరించిపోతుంది. ఇదంతా ‘అసత్‌’ అంటే తాత్కాలిక ఉనికి. కానీ, సత్‌ అనేది కాలం, ప్రదేశం, మార్పులకు అతీతమైన శాశ్వత అస్తిత్వం. దీన్ని మార్చడానికి, నాశనం చేయడానికి, సృష్టించడానికి వీల్లేదు. అది నిశ్చలం, స్వయంప్రకాశం. సకల సృష్టికి, చరాచర జగత్తుకు మూలం ఈ సత్‌ శక్తియే. ప్రతిదీ ఈ నిత్యమైన ఉనికి నుంచే ఉద్భవిస్తుంది, అందులోనే లీనమవుతుంది. ‘సత్‌’కి సత్యం అనే మరొక అర్థమూ ఉంది. మిగతా ప్రపంచమంతా మిథ్య అని, బ్రహ్మం మాత్రమే సత్యమని చెప్పేది ఈ ‘సత్‌’ లక్షణమే. అది పర్వతంలా స్థిరంగా, మహాసముద్రంలా అగాధంగా, సూర్యుడిలా నిత్యంగా ఉండే మూలశక్తి. అన్నింటికీ ఆధారభూతమైనది.
సచ్చిదానందంలో రెండోభాగం ‘చిత్‌’. దీనికి జ్ఞానం, చైతన్యం అని అర్థం. ఇది పుస్తకాలూ ఇంద్రియాల ద్వారా పొందే ఎరుక కాదు; సర్వవ్యాప్తమైన, ఆత్మరూపమైన చైతన్యం. సృష్టిలోని ప్రతి అణువులో, ప్రతి ప్రదేశంలో నిండి ఉంటుంది. ప్రతి జీవిలో ఆత్మరూపంలో ప్రకాశించేది ఈ చిత్‌ శక్తే. సూర్యుడికి వెలుగునివ్వడానికి వేరే దీపం అవసరం లేనట్లే, ‘చిత్‌’ ఎవరి సహాయం లేకుండా ప్రకాశిస్తుంది. మనసు, బుద్ధి, ఇంద్రియాలు పనిచేయడానికి వెనకనున్న ఇంధనం ఇదే. అద్దం స్వయంగా వస్తువులను సృష్టించకపోయినా, అన్ని వస్తువులనూ తనలో ప్రతిబింబిస్తుంది. అదేవిధంగా, బ్రహ్మం తన చైతన్యంతో ఈ సృష్టి అంతటినీ గమనిస్తుంది, ప్రతిబింబిస్తుంది, కానీ దేనికీ అంటకుండా ఉంటుంది.

మూడోది ఆనందం. ఇది క్షణికమైన సంతోషాలకు, ఇంద్రియ సుఖాలకు అతీతమైంది. మనం అనుభవించే ప్రతి సుఖం కూడా ఆనందం తాలూకు ప్రతిబింబమే. ఈ సుఖాలన్నిటికీ మూలం ఆనంద స్వరూపమైన బ్రహ్మమే. ‘ఆనందం’ దేనిపైనా ఆధారపడదు. పరమాత్మ నిజమైన స్వభావం నిరంతర ఆనందం. అది సముద్రంలా ఉంటుంది. సంద్రంలో ఎన్ని అలలు, కల్లోలాలు వచ్చినా, లోపలి భాగం ఎల్లప్పుడూ ప్రశాంతంగా, అచంచలంగా ఉంటుంది. అదేవిధంగా, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, పరమాత్మతో అనుసంధానం అయినప్పుడు లభించే ఆనందం ఎప్పటికీ చెక్కుచెదరదు.

సచ్చిదానందం అనేది కేవలం బ్రహ్మానికి సంబంధించిన లక్షణాల వివరణకే కాదు; విశ్వానికి, మానవ జీవితానికి సంబంధించిన లోతైన తాత్విక సత్యం. ఈ నిత్యమైన, చైతన్యవంతమైన, ఆనంద స్వరూపాన్ని తెలుసుకోవడమే మానవ జీవిత అంతిమ లక్ష్యం.
~డాక్టర్‌ చిట్యాల రవీందర్‌

No comments:

Post a Comment