Monday, November 17, 2025

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ

                    భక్తుడు :
  భగవాన్! దైవ నిర్ణయమే వర్ధిల్లు గాక! తథాస్తు. నేను ఒక ఇంజనీరింగ్ కంపెనీలో భాగస్థుడను. నా దృష్టిలో అదేమంత ముఖ్యంకాదు. నా కంపెనీ దినదిన వ్యవహారాలలో ఆధ్యాత్మిక ప్రమాణాలను తీసుకురావాలని చూస్తాను. అది సాధ్యమేనా!

                  మహర్షి :
   అది మంచిదే. మొదట దైవశక్తికి నిన్ను అర్పించుకో గలిగితే అప్పుడు అంతా సరిగానే జరుగుతుంది. ఆ శక్తియే సర్వమూ చూసుకుంటుంది. నేను కర్తను (నేను చేస్తున్నాను) అని అనుకుంటే, నీ కర్మఫలాలను అనుభవింపక తప్పదు. 
 
   అట్లుగాక నిన్ను నీవు దైవార్పితం చేసుకోగలిగితే, అప్పుడు ఆ శక్తికి నీవు ఒక ఉపకరణ మాత్రంగా మెలుగుతావు. నీ కార్యాలన్నీ, వాటి ఫలితాలతోసహా ఆ శక్తియే తన మీద వేసుకుంటుంది. అవి నిన్ను బాధించవు. పని మాత్రం ఎటువంటి ఆటంకంలేక సాగిపోతుంది. నీవు ఆ శక్తిని గుర్తించినా లేక  గుర్తించకపోయినా, పనిలో ఎటువంటి మార్పు ఉండదు. ఉండేది నీ దృష్టి భేదం. 
   
    ఉదాహరణకు రైలు బండిలో ప్రయాణిస్తూ, నెత్తిపై నీకు మూట ఎందుకు? బరువు నీ నెత్తిపై ఉన్నా, బండిలో ఉన్నా, నీతో సహా బరువును రైలుబండి లాగేస్తుంది. నెత్తిపై బరువును ఉంచుకొంటే నీవు అనవసరంగా కష్టపడతావు. బండికి ఏమైనా బరువు తగ్గుతుందా? ప్రపంచంలో వ్యక్తుల కర్తృత్వ (నేను కర్తను ; నేను చేస్తున్నాను) భావన అలాంటిదే.

No comments:

Post a Comment