Monday, November 17, 2025

 🦚జ్ఞాన ప్రసూనాలు🚩

భగవంతుని అనుగ్రహ జ్యోతి ప్రసారము లేకుండా అల్పులైన జీవులు మాయాబంధ విముక్తులు కాలేరు.
శుద్ధస్థితిని పొందలేరు.

 దేవుడు సర్వాంతర్యామి సర్వవ్యాపకుడు అన్నాక నీవుండే చోటులో దేవుడు ఉండడా? నీవుండే చోటే దేవుడుండే చోటు.

 భిన్నత్వానికి ఆధారంగా ఏకత్వాన్ని చూడడమే సమత్వం.

 మనం పదిమంది మాట్లాడుతున్నట్టు కనబడుతున్నప్పటికీ అందరిలో ఉండి మాట్లాడేవాడు ఒకడే అనేది అర్థమైతే చాలు. తత్త్వం బోధపడ్డట్టే.

 నిద్రలో తెలియకుండా అనుభవించే ఆనందాన్నే తురీయంలో ఎఱుకతో అనుభవిస్తాం.

 భోగం, రోగం - పాశ్చాత్య లక్షణం.
యోగం, జ్ఞానం - భారతీయ లక్షణం.

 మాట ఆగితే నిశ్శబ్దం.
మనసు ఆగితే - “మౌనం”.

 నిజమైన శిష్యునికి అందరి పాదాలూ గురు పాదాలుగానే కనిపిస్తాయి.

 మెలకువ వస్తేగాని తెలియదు 'ఇది కల' అని.
సాక్షాత్కారం అయితే గాని తెలియదు 'నేనే దేవుడు' అని.

అందరిలో ఒకడిగా ఉండు కానీ నీ లోపల మాత్రం దేవుడు ఒక్కడే ఉండాలి.

 బంగారానికి అంటుకున్న మట్టిలాంటివే ఈ నామరూపాలు. మట్టి ఉన్నా తొలగినా బంగారం బంగారమే.

 అనుభవంలో నుంచి శాస్త్రాలు వచ్చాయే గాని శాస్త్రాల వలన అనుభవం కలుగదు.

నీ మనసు దిగంబరం అయితే నీవే అవధూత.

జనన మరణాలనేవి లేవని తెలుసుకోవడమే జనన మరణ రహస్యం.

నీతో సదా ఉండేది ఆత్మ ఒక్కటే. 'ఆత్మ బంధువు' అంటే ఆత్మే నిజమైన బంధువు అని అర్థం.

జీవస్థితి నుండి దైవీస్థితికి చేర్చే వంతెనలాంటిది ప్రపంచం. ఈ ప్రపంచంలో మనం శాశ్వతంగా ఉండాలనుకోవడం వంతెనపై ఇల్లు కట్టుకోవాలని అనుకోవడం లాంటిదే.

 అనంతమైన జీవాన్ని మనం ఈ దేహం వఱకే పరిమితం చేశాం. ఇదే జీవసమాధి.

No comments:

Post a Comment