బురదలో పద్మం...
(డా. తుమ్మల దేవరావ్ నిర్మల్ — “నా జెన్ కవితల నుండి”)
రాత్రి చంద్రుడు…
విశ్వపు నిశ్శబ్దాన్ని తన వెన్నెలలో ముంచి
భూమి మీదికి జలపాతం లా ధారపోస్తున్నాడు.
ఇసుక తేనెలపై పడిన ఆ నాజూకైన వెలుగు
కాలం మొదటి శ్వాసను తాకినట్టు
అందని లోతుల్లో ప్రకంపిస్తుంది.
నీటి ఎడారిలో నిశ్చలంగా తేలుతున్న చేపలు
తమ కన్నులతో ఆకాశాన్ని చదవుతున్నాయి—
ఆనందం అనే రహస్య గ్రంథాన్ని తెరిచి.
“రా… ఇక్కడే కూర్చో,” అంటుంది రాత్రి.
“నిన్ను నువ్వు మరచిపోయేంత నిశ్శబ్దంగా
ఈ అలల నడకను విను.
నీడలు చెట్ల మధ్య కరిగిపోయినట్లు
నీ ఆత్మలో మిగిలింది
కేవలం నీవే అవ్వాలి.”
ఏకాంతం అంటే…?
బాహ్య లోకాన్ని విడిచిపెట్టడం కాదు—
అంతర్లీన ద్వారం వద్ద
నీ శ్వాస నీకు చేస్తున్న సత్యాన్ని వినడం.
పండుటాకులు రాలినప్పుడు వచ్చే అంతర స్వరం
బ్రహ్మాండపు గుడారంలో ప్రతిధ్వనిస్తుంది.
అప్పుడు తెలుసుకుంటావు:
నీ ఆలోచనల యాత్రకు
నీకంటే గొప్ప సాక్షి ఎవరూ లేరని.
మనిషి…
భూమిపై నడుస్తున్న ఒక విరిగిన రేఖ.
తానే గీసుకున్న గీతల మధ్య
జాతులు, మతాలు, కులాలు, భేదాలుగా
తనను ముక్కలు ముక్కలుగా విభజించుకుంటాడు.
అది అతని స్వభావమే—
తనలోని సంపూర్ణత్వాన్ని మరచిపోవడం.
కానీ ప్రేమ,
ఆ గీతలన్నింటినీ అగ్నిలో కరిగించే తుపాను…
ప్రేమ లోకంలో
వర్గాలు, వర్ణాలు, భేదాలు
గాలిలో దూది లా ఎగిరిపోతాయి.
అక్కడ హృదయాలు—
తాకిన వెంటనే తలుపులు తెరిచే ఆలయాలు.
ఆహ్వానం అక్కడ అతిథికి కాదు,
అంతరంగ స్వరూపానికే.
చూడు ఇప్పుడు…
నీ హృదయ సరస్సులో
కమలాలు మెదులుతున్నాయి.
వెన్నెల వాటి పుటలపై పలుకుతుంది—
“బురదే నాకు ఊయల.”
వెన్నెల బురదను తాకినప్పుడు
అది అపవిత్రం కాదు,
ఇంకా స్వచ్ఛమైన కాంతిగా మారుతుంది.
ఎందుకంటే…
పద్మం బురదలోనే పుడుతుంది.
చీకటి గర్భంలో పుట్టి
ప్రకాశానికి అర్హమైన పువ్వుగా వికసిస్తుంది.
మనిషి కూడా అలాగే—
తన బురదలోని దుఃఖం, వియోగం, ఆనందం, అనిశ్చితి
అన్నింటినీ అధిగమించి
ఒక నిశ్శబ్ద పద్మంలా
వెలుగు వైపు తెరచుకుంటాడు!!
(ఓం మణి పద్మేహం)
No comments:
Post a Comment