ఎందుకో మరి
పదే పదే స్మరణకొస్తోంది
బాలగంగాధర తిలక్
'అమృతం కురిసిన రాత్రి'
సంపుటిలోని ఈ కవిత
**********
@ ప్రార్థన @
దేవుడా ....
రక్షించు నా దేశాన్ని
పవిత్రుల నుండి
పతివ్రతల నుండి
పెద్ద మనుషుల నుండి
పెద్దపులులల నుండి
నీతుల రెండు నాలుకలు సాచి
బుసలు కొట్టే నిర్హేతుక కృపాసర్పాల నుండీ
లక్షలాది దేవుళ్ళ నుండి
వారి పూజారుల నుండి
వారి వారి ప్రతినిధుల నుండి
సిద్ధాంత కేసరుల నుండి
శ్రీ మన్మద్గురు పరంపర నుండి
******
దేవుడా
నూరు కోట్లకు
పైబడ్డ మనుషుల
నిజమైన ప్రాణం ఉన్న
మనుషులతో నిండిన దేశం నాది
ఆకలి బాధలు
ఆందోళనలు సమస్యలు
విరివిగా ఉన్న విచిత్ర సౌధం నాది
కడుపు నిండుగా ఆహారం
గుండె నిండుగా ఆశ్లేషం
బ్రతుకు పొడుగునా స్వాతంత్రం
కొంచెం పుణ్యం .. కించిత్ పాపం
కాస్త కన్నీరు మరి కాస్తంత సంతోషపు తేనీరూ
చాలు మాకు తండ్రీ
*******
సరదాగా
నిజాయితీగా
జాలీ జాలీగా హాయి హాయిగా
బ్రతుకుతారు
మాకు నటనలు వద్దు
మా చుట్టూ కటకటాలు వద్దు
గొప్పలు గోసాయి చిట్కాలు వద్దు
********
దేవుడా....
కత్తి వాదరకు తెగిన కంఠంలో
హఠాత్తుగా ఆగిపోయిన సంగీతాన్ని వినిపించు
మానవ చరిత్ర పుటలలో
నెత్తురొలికి మాసిపోయిన అక్షరాలను వినిపించు
రహస్య సృష్టి సానువుల నుండి
జారిపడే కాంతి జలపాతాన్ని చూపించు
మమ్మల్ని కనికరించు
********
చావు పుట్టుకల మధ్య
సందేహం లాంటి జీవితంలో
నలువైపులా అంధకారం
మంచి గంధం లాగా
పరిమళించే మానవత్వం
మాకు ఉన్న ఒకే ఒక్క అలంకారం
మజిలీ మజిలీకి అలసిపోతున్నాం
మలుపు మలుపు క రాలిపోతున్నాం
ఆశల వెచ్చని పాన్పు మీద
స్వప్నాల పుష్పాలు జల్లుకుని
అది మరిచి కాసేపు విశ్రమించటానికి
అనుమతించు తండ్రీ
- తిలక్
No comments:
Post a Comment