Monday, November 17, 2025

 #మోక్షం అంటే ఏమిటి?*
దాన్ని ఎలా పొందాలి? అసలు వీలుందా?

మోక్షం అంటే బంధ విముక్తి. బంధ విముక్తి అంటే బాహ్యంగా ఉన్న జగత్తులోని అసత్య వస్తువుల మీద కోరిక లేకుండా జీవించడం. అసత్య వస్తువులు అంటే పిపీలికం(చీమ) మొదలు బ్రహ్మాండం వరకు మనకి కనిపించే ఏదైనా అసత్య వస్తువులే. అంటే కొన్నాళ్ళు ఉండి గతించి పోవడం అసత్య వస్తువు అంటున్నాయి మన ఉపనిషత్తులు, వేదాలు, భగవద్గీత వంటి మన గ్రంథాలు.

వీటిని అర్థం చేసుకోవడం ఎలా? ఒకటవ తరగతి చదివే కుర్రాడికి డిగ్రీ పాఠాలు చెబితే అర్థమవుతాయా? అలానే బాహ్య ప్రపంచంలో బంధాలు, బాధ్యతలు మోస్తూ, వాటిలో లీనమై తాను శరీరంగా భావిస్తూ, బంధాల బాధ్యతల కోసం క్షణం తీరిక లేకుండా శ్రమిస్తూ, వారిని పోషించడం కోసం తాను ఎందుకు వచ్చానో, తాను ఎవరో మరచిపోయి, అసలు ఆ ఊహే లేకుండా తప్పుల మీద తప్పులు చేస్తూ, దానధర్మాలు మరచి, మంచి చెడు విచక్షణ కోల్పోయి, దైవంపై నమ్మకం లేక, దైవం చెప్పిన విషయాలు ఏ రోజూ ఆచరించకుండా, ఎవరో గురువు, ఏదో దైవం నన్ను కాపాడతారు అని వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కోర్కెల లంపటంలో చిక్కి శల్యమై తనువు చాలిస్తున్నారు 99.99999 శాతం మంది.

మోక్షం కావాలంటే ముందు మానసిక శుద్ధి జరగాలి. బాహ్య ప్రపంచంలోని వస్తువుల పై మమకారాన్ని వదలాలి. మనస్సుని నిష్కల్మషమైన దానిగా చేయాలి. ప్రతి ఒక్కటీ నేనే, నేను.ఆదిత్యయోగీ.
ఈ శరీరం కాదు. ఆ శక్తి స్వరూపం అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నేను ఎవరు? ఎక్కడి నుండి వచ్చాను. ఎక్కడికి వెళతాను? ఎందుకు కోసం ఇక్కడికి వచ్చాను? అని తన్ను తాను ప్రశ్నించుకొని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. 

నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను. 
నా ఇష్టానికి జీవిస్తాను. కానీ దేవుడు నాకు మోక్షం ఇవ్వాలి అంటే స్కూల్ కి వెళ్లకుండా రోడ్ల వెంట తిరిగి నేషనల్ ర్యాంక్ కొట్టాలి అన్నట్లు ఉంటుంది. 

ఫలానా శ్లోకం చదివినప్పుడు ఫలం మోక్షం అని వస్తుంది. శ్లోకం చదివితే, భాగవతం చదివితే, లేదా ఇంకో గ్రంథం ఏదో చదివితే 10రోజుల్లో మోక్షం వస్తే యోగులు దశాబ్దాల పాటు సాధనలు ఎందుకు చేస్తారు? ఇవి చదివితే ఆయా దేవతల వద్దకు వెళ్ళి పుణ్యఫలం ఏదైతే ఉందో అంతవరకూ అక్కడ ఉండి ఫలం తీరిన వెంటనే భూమి మీద తల్లి గర్భంలోకి వచ్చి పడతారు.

నేను విశ్వమంతా వ్యాపించి ఉన్న చైతన్య శక్తి స్వరూపం అని తెలుసుకుని, దాన్ననుభూతి చెందేవరకు ఇదే పరిస్థితి. కర్మ కాలి తప్పుల మీద తప్పులు చేస్తూ పోతే మనిషి జన్మ నుండి వెనక్కి వెళ్లి నువ్వు ఏ తప్పులైతే చేశావో ఆయా తప్పులు చేసే క్రిమి కీటక పశువుల యోనుల్లో జన్మిస్తావ్.. మళ్ళీ అక్కడి నుండి మానవ జన్మ వచ్చే వరకు ఎన్ని జన్మలు తీసుకుంటుందో తెలీదు.

మోక్షం గురించి గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన అంశం. 
ఆత్మకి చావు లేదు. వినే ఉంటారు కదా.. చావు లేని ఆత్మకి మోక్షం ఎలా? ఎలాగంటే! బంధవిముక్తి ఇదొక్కటే మార్గం. ఇది ఎలా వస్తుందంటే.. మనస్సుని నిష్కల్మషం చేసినప్పుడు వస్తుంది. జీవకోటి దయ, సకల జీవరాశిలో తనని తాను దర్శించడం, క్షమ కలిగి ఉండటం, సాధుగుణం, వంటి మంచి లక్షణాలు అలవరచుకొని, మృత్యువు వచ్చి ఎదురుగా ఉన్నప్పుడు కూడా ధైర్యంగా “పదా నేను సిద్దంగా ఉన్నాను” అనే ధైర్యం.  ఇది సహజగుణంగా మారిపోవాలి. 

సంసారం, వ్యాపారం, జీవకోటి సాంగత్యం ఇలా అన్నింటిలో ఉన్నా దేన్నీ మనసుకి అంటకుండా, ‘నేను శరీరం కాదు విశ్వ చైతన్యాన్ని’ అనే స్పృహలో ఉండటమే మోక్షం.ఆదిత్యయోగీ.
ఇది జీవన్ముక్త స్థితి. దీని అనంతరం మరణం. నేను విశ్వఛైతన్యన్ని అని తెలిసి మరణం ఒక ఆట అని గ్రహించి మరణించిన తరువాత జన్మలు తీసుకోవడానికి స్వేచ్చ లభిస్తుంది. ఈ విశ్వఛైతన్యం తాను ఎప్పుడు కావాలి అంటే అప్పుడు శరీరం పొందే అవకాశం వస్తుంది. ఇదే మోక్షం. అంతేతప్ప వెళ్ళి దైవంలో లీనం అవ్వడం, జన్మరాహిత్యం పొందడం మోక్షం అనుకోకండి.. 

సర్వత్రా వ్యాపించి ఉన్న చైతన్యమే పరమాత్మ. ఇక్కడ పుట్టుక చావు లేనేలేవు. రూపం తీసుకోవడం వదలడం మాత్రమే ఉంది. రూపానికి మాత్రమే నశింపు. శక్తికి కాదు. శక్తి కదలికల వల్లనే 84లక్షల జీవరాశులు పుట్టుక మరణం జరుగుతుంది. దీనికి ఆది అంతం లేదు.. చేయాల్సింది ఒక్కటే.. నేను విశ్వఛైతన్య శక్తిని అని గ్రహించి అనుభూతి చెందితే జన్మలు తీసుకునే స్వేచ్చ లభిస్తుంది. ఇదే మోక్ష స్థితి. ఇలాంటి జన్మకి కర్మలు అంటవు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస దీనికి పెద్ద ఉదాహరణ. అవతార పురుషులు అంటారు. దారి తప్పిన మానవవాళికి దారి చూపడం కొరకు శక్తి రూపాన్ని తీసుకొని వచ్చి మార్గం చూపి వెళుతుంది. దీన్ని పట్టుకున్న వాడు తరిస్తాడు. పట్టుకొనని వాడు అనేక రకాల యోనుల్లో పడి తిరుగుతూనే ఉంటాడు..*

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ 
ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🕉️🕉️🕉️

No comments:

Post a Comment