*మనలో ప్రతీ ఒక్కర్నీ మూర్ఖులుగా చేసి.. హైజాక్ చేసి భారత్ ని ఇలా దెబ్బ తీస్తున్నారు*
*స్వామి వివేకానంద బ్రతికున్న రోజుల్లో.. USలో ఓ సభలో ప్రసంగిస్తూ ఓ మాట అన్నారు.."ఇక్కడ పాశ్చాత్య సమాజంలో మాదిరిగా భారతదేశంలో ఎక్కడబడితే అక్కడ చర్చ్‌లు ఉండవు. మీరు గంగా నది ఒడ్డున చూస్తే వందలాది సాధువులు నిరంతరం సాధనలో ఉంటారు.. భారతదేశంలో ప్రతీ ఇంట్లోనూ ప్రాణసాధన, ధ్యానం ఓ అంతర్భాగం... అక్కడ మతమంటే సాధన.." అని!*
ఒక్కసారి ఆలోచించండి.. ఇప్పుడు ఆయన అంత గొప్పగా మన దేశం గురించి చెప్పిన పరిస్థితి ఎక్కడైనా ఉందా? నేను చాలాసార్లు "సాధన" అనే పదం రాసినప్పుడు.. "సాధన" అంటే ఏంటి? అనే కామెంట్లు కూడా కొంతమంది రాస్తుంటారు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇప్పుడు భారతదేశం ఉంది.
రామకృష్ణ పరమహంస కాళికాదేవి ఉపాసనలో ఆమెని ప్రసన్నం చేసుకున్నారు.. ఎందరో యోగి పుంగవులు దేహంలోని అన్ని చక్రాలు ఉత్తేజితమై కుంఢలినీ ప్రవాహంతో కపాల మోక్షంతో తనువు చాలించిన పుణ్యభూమి ఇది!
ఒకప్పుడు బ్రిటీష్ వాళ్లు మనల్ని ఆక్రమించుకున్నారని ఇప్పుడు స్వేచ్ఛా జీవులమని అందరూ గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా.. పిచ్చి వాళ్లం.. మనం ఇంకా బంధీఖానాలోనే ఉన్నాం.. భౌతికంగా కాదు.. మన ఆధ్యాత్మిక శక్తిని నాశనం చేశారు. మనల్ని చిత్త చాంచల్యులుగా తయారు చేశారు.
ఏకాగ్రమైన చిత్తంతో శక్తివంతమైన ధారణతో జలాన్ని కూడా మంత్రంతో శుద్ధి చేసిన వారసత్వం మనది. క్వాంటమ్ టెలీపోర్టేషన్ అని ఇప్పుడు సైన్స్ ఏదో కొత్త దానిలా భావిస్తున్న అంశం.. ఒక యోగి ఆత్మ కధలో ఒక చోట నుండి మరో చోటికి యోగి పుంగవులు అనేక రూపాలుగా ఒకే సమయంలో కనిపించడంలో దర్శించవచ్చు.
ప్రాచీన సమాజంలో యోగులు మాత్రమే కాదు.. గృహస్థులు కూడా సాధనలో ఉండే వారు. అందుకే వారికి పెద్దగా మాయ కమ్ముకునేది కాదు. ఇప్పుడు భారత్ మీద పాశ్చాత్య శక్తులు గత 20 ఏళ్లుగా విపరీతంగా దృష్టి పెట్టాయి. భారతీయ సంతతిలో, DNAలో మేధస్సు, ఆత్మజ్ఞానం అత్యంత ముఖ్యమైన భాగం. దీనికి ఏకాగ్రత కావాలి, సాధన కావాలి. గంటల తరబడి ఒకే అంశంపై దృష్టి మళ్లించకుండా ధారణ చేయగలిగే శక్తి కావాలి. అవన్నీ నాశనం చెయ్యడానికి టిక్ టాక్, గూగుల్, ఫేస్‌బుక్ వంటివి మెల్లగా పావులు కదిపాయి. 30 నిముషాలు వీడియోలు చూసే వారు కాస్తా.. కొన్నాళ్లకి 8 నిముషాలకి ఓపిక నశించేటంతగా పతనం అయ్యారు.. ఆ తర్వాత 8 నిముషాల నుండి 30 సెకన్లకే బోర్ ఫీలయ్యే భారతీయ యువతరాన్ని ఈ సంస్థలు తయారు చేస్తున్నాయి.
ఇది మన వ్యసనం కాదు... మన బలహీనతను ఆసరాగా చేసుకుని విదేశీ సంస్థలు చేస్తున్న కుట్ర! భారతీయులను మెల్లగా విలాసాలకు అలవాటు చెయ్యడం ద్వారా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన మోహం జయించడానికి లేకుండా తయారు చేశారు. ఇప్పుడు మగా ఆడా అని తేడా తెలీదు అందంగా ముస్తాబవ్వాలి.. లైక్స్, కామెంట్స్ కోసం మోహంలో కొట్టుకుపోావాలి. భగవద్గీత చెబుతుంది.. స్మృతిభ్రంశో... బుద్ధి నాశనహః అని! నిరంతరం చలించే మనస్సుని కలిగిన వ్యక్తి బుద్ధి కాలక్రమేణా నశిస్తుంది. ఆ బుద్ధి నశించినప్పుడు మూర్ఖత్వం పెరుగుతుంది, ఆ మూర్ఖత్వం కాస్తా పిచ్చితనంగా పరిణామం చెందుతుంది. ఇప్పుడు కళ్లారా అనేకమంది ప్రవర్తన సోషల్ మీడియాలో చూస్తే.. ఈ ఆనవాళ్లని చూడొచ్చు.
భారతీయ ఆధ్యాత్మిక సాధనలు.. అహాన్ని జయించడానికి ఎన్నో పద్ధతులు అందించాయి. సంస్కృతంలోనూ, కొన్ని తెలుగులోనూ ఉన్న ఎన్నో ప్రాచీన గ్రంధాలు నేను అధ్యయనం చేస్తుంటాను. ఎంత గొప్ప జ్ఞానం మరుగునపడిపోతోంది. జర్మన్స్ లైబ్రరీల్లో మన పూర్వీకుల అరుదైన గ్రంధాలు ఉన్నాయి. వారు ఆధ్యాత్మిక సాధనలు చేస్తుంటే.. మనం "నా జీవితం నా ఇష్టం" అనే మాయలో కొట్టుకుపోయేలా తయారైపోయాం. దీనికి విదేశీ శక్తులతో పాటు.. విలాసాలకూ, స్వేచ్ఛా జీవన విధానానికి అలవాటు పడి, కనీసం క్రమశిక్షణాభరితమైన జీవితం లేని ఎందరో సినిమా దర్శకులు మొదలుకుని, అభ్యుదయ వాదులుగా భావించే వారు తమ వంతు సమాజాన్ని విచ్చిన్నం చేశారు.
ఎవరేం చేసినా.. సగటు మనిషి విజ్ఞత కలిగి ఉండాలి. ఇది నీ జీవితం.. నీ ఛాయిస్.. నువ్వు నేర్చుకుంటానంటే.. నువ్వు సాధన చేస్తానంటే.. నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతాను అంటే.. ఏ ఫేస్ బుక్, ఏ ఇన్ స్టా రీల్, ఏ సామాజిక కండిషనింగ్ ఏమీ చెయ్యలేదు.. అన్నది తెలుసుకోవాలి. భారత్ లో ఇంకో అతి పెద్ద సమస్య.. భక్తి యోగ పేరిట.. ఆర్భాటం ఎక్కువవడం! భక్తి అంటే ఓ యోగ మార్గం.. ప్రదర్శించుకునేది కాదు.. ప్రవచనంతో సరిపెట్టుకునేది కాదు. మీరాబాయి కృష్ణ పరమాత్ముని పట్ల ఉన్న భక్తి ఏకత్వానికి దారితీసింది.. అబ్జర్వర్, అబ్జర్వ్‌డ్, చేసేదీ చెయ్యబడేదీ అనే సపరేషన్ లేని, అహం లేని స్థితికి చేరుకోవలసిన సాధనలను వదిలేసి.. భక్తి పేరు మీద అహం చూపించుకునేలా మనిషి ప్రవర్తించడం ఇప్పుడు భారత్, హిందూ మతంలో ఏర్పడుతున్న మరో అతి పెద్ద సమస్య!
అనేక పురాతన గ్రంధాల్ని చదువుతుంటే.. ఇంత అద్భుతమైన, అరుదైన జ్ఞానంలో కనీసం వాటిలో ఒక్క అక్షరమైనా అర్థం చేసుకునే స్థితిలో ఇప్పుడు భారతీయ సమాజం లేదనే వేదన కలుగుతుంది. అయితే ఎవరమేమి చేస్తాము.. ఎవరి సోల్ ఛాయిస్ వాళ్లది. సర్వోతృష్టమైన ఈ మానవ జన్మని మూర్ఖత్వంలో, చిత్త చాంచల్యంతో ముగించాలని ఒక సోల్ నిర్ణయించుకుంటే.. సాధన అవసరం లేదని తిరస్కరిస్తే ఆ ఆత్మ యొక్క అభీష్టాన్ని నీ ఇష్టం అని చెప్పాల్సిందే.. నా జీవితం నా ఇష్టం అంటుంటారు కదా.. అలాగే కొనసాగమని చెప్పడమే!! ఇష్ట కామ్యార్థి సిద్ధిరస్తు.. అది మూర్ఖత్వం వైపైనా, జ్ఞానం వైపైనా... ✓ నల్లమోతు శ్రీధర్.
No comments:
Post a Comment