Monday, November 17, 2025

 *_🌴దేనిని తెలుసుకుంటే ఇంకా వేరే దేనినీ తెలుసుకోనవసరం ఉండదో దానిని తెలుసుకోవాలి. దేనిని ఆశ్రయిస్తే ఇంకా ఈ జనన మరణ చక్రంనందు పరిభ్రమించాల్సిన అవసరం ఉండదో దానిని ఆశ్రయించాలి. దేనిని స్మరిస్తే జన్మజన్మల కర్మఫలితమంతా నశించుకుపోతుందో దానిని స్మరించాలి. ఏ కర్మాచరణ ద్వారా అయితే సృష్టి కర్త సంతృప్తి చెందుతాడో దానినే ఆచరించాలి. భగవంతుని గురించి తెలుసుకోవాలి. ఆయన పాదములను ఆశ్రయించాలి. ఆయన నామాన్ని స్మరించాలి. దీనులను సేవించాలి. మానవునిగా పుట్టి ఇంతకంటే మనం చేయాల్సిందేదీ లేదు.*

🌹🙏🌴🪔🪔🪔🪔🌴🙏🌹

*# అమరత్వం...*

☘️మరణం లేని స్థితి పొందడమే అమరత్వం. పురాణాల్లో, ఇతిహాసాల్లో, తత్వశాస్త్రాల్లో, మతపరమైన సంప్రదాయాల్లో ప్రముఖంగా కనిపించే విషయం ఇది. శరీరం నశించినా ఆత్మ నశించదని ఆధ్యాత్మిక సాధకుల నమ్మకం. 'నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః' ఆత్మ జనన మరణాలకు, భావ వికారాలకు అతీతమైందని భగవద్గీత చెబుతుంది. పుట్టిన ప్రతి జీవికి మరణం అనివార్యం. హిందూ ధర్మంలో ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరో శరీరంలోకి ప్రవేశిస్తుందని చెబుతారు. ఈ ప్రక్రియలో జన్మ పరంపరలు ముగిసిపోయాక మోక్షం సిద్ధిస్తుందని విశ్వసిస్తారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి గడిపే ధార్మిక జీవనం, చేసే సత్కర్మలు మరణానంతర జీవితంపై ప్రభావం చూపుతాయని ఆధ్యాత్మిక సాధకులు నమ్ముతారు. ఇది మరణ భయాన్ని నియంత్రిస్తుంది. అప్పుడు మరణం శరీరానికే కానీ ఆత్మకు కాదనే అవగాహన ఏర్పడుతుంది.

☘️అమరత్వం అనేది మానవజాతికి అనాదిగా ఉన్న కల. కానీ, భౌతికంగా అమరత్వం పొందడం అసాధ్యం. ఎందుకంటే మానవ శరీరం వ్యాధులు, బాధలు, ప్రమాదాలు, వృద్ధాప్యం, మరణం వంటి వాటి నుంచి తప్పించుకోలేదు. అయినప్పటికీ భౌతిక అమరత్వం కోసం తపించడం మానుకోలేక పోతున్నాడు మనిషి జీవశాస్త్ర పరంగా అమరత్వం పొందినవిగా భావించే కొన్ని జీవులను చూసి తానూ ఆశలు పెంచుకుంటున్నాడు. ఒకరకమైన జెల్లీఫిష్ తమ జీవిత చక్రాన్ని వెనక్కి తిప్పుకోగలవు. మనుషుల్లో దీన్ని సాధించడానికి వృద్ధాప్యాన్ని  నిలువరించడం, కణాల పునరుత్పత్తి, వ్యాధుల నివారణ వంటి అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి.

☘️ఇలాంటి ఆలోచన లేకపోయినా కొంతమంది చిరంజీవులుగా అమరత్వం పొందుతారు. గౌతమ బుద్ధుడు, శంకర భగవత్పాదులు,  లాంటివారు నేటికీ ఆధ్యాత్మికంగా ఎంతోమందికి మార్గదర్శనం చేస్తున్నారు. మరికొంతమంది తమ రచనల ద్వారా, శాస్త్ర పరిశోధనల ద్వారా ఇప్పటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నారు. స్వాతంత్య్ర్యం కోసం నిస్వార్థంగా పోరాడిన జాతీయ నాయకుల వి నేటికీ స్మరించుకుంటున్నాం. పురాణ పురుషులైన అశ్వత్థామ, మహాబలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు తమ తపస్సు, ధర్మ నిష్ఠల ద్వారా కలియుగాంతం వరకూ చిరంజీవులుగానే ఉంటారనే నమ్మకం ప్రజలలో ఉంది.

☘️అమరత్వం కేవలం భౌతిక జీవితానికి సంబంధించింది మాత్రమే కాదు. ఆధ్యాత్మిక సాధనతో మోక్షం లేదా ఆత్మ సాక్షాత్కారం పొందడాన్ని ఇది సూచిస్తుంది. దాని సంగతి అలా ఉంచితే- చరిత్రలో చిరంజీవులుగా మిగలాలంటే మానవత్వంతో సాటి వారికి, సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చెయ్యాలి. తమ అనుభవాలను, జ్ఞానాన్ని, నైపుణ్యాలను ఇతరులకు పంచాలి. సృజనాత్మక కళల ద్వారా చిరస్మరణీయులు కావడం కూడా అమరత్వ సాధనే అవుతుంది. సద్గుణాలతో సత్కార్యాలు చేసేవారే ప్రజల మనసుల్లో నిత్యం సజీవులై ఉంటారు.🙏

No comments:

Post a Comment