ప్రాతః స్మరణీయులు
*కావ్యకంఠ గణపతి ముని శాస్త్రి గారు* ( 17.11.1878 - 25.7.1936)
గత సహస్రాబ్ది లో తెలుగు నాట ఉద్భవించిన మేధో సంపన్నులలో కావ్యకంఠుల వారు ఒకరు. కావ్యకంఠుల వారి గురించి ఎంత వ్రాసినా తక్కువే. ఆయన బహుముఖ ప్రజ్ఞా శాలి. పది సంవత్సరాలు వచ్చేసరికి జ్యోతిష, గణిత, మంత్రశాస్త్రాలపై పట్టు సాధించారు. 1900లో నవద్వీప విద్వత్ సభలోని పరీక్షక వర్గం వారు ఈయన కవిత్వ ప్రజ్ఞా ప్రదర్శనను చూసి కావ్యకంఠ అనే బిరుదుతో సత్కరించారు .
ఆయన చేసిన సేవలు మూడు భాగాలుగా చెప్పవచ్చు. 1. ప్రజలలో జాతీయ భావాలు పెంపొందింప చేయడానికి వారు చేసిన కృషి మరియు సంఘం లో ఉన్న అసమానతలు రూపు మాపడానికి వారు చేసి కృషి 2. ఆధ్యాత్మికం గా వారు చేసిన కృషి 3. వారు చేసిన శతాధికమైన రచనలు.
కావ్యకంఠుల వారు తమ ఉపన్యాసాల ద్వారా, కవితల ద్వారా ప్రజలలో చైతన్యం కలుగ చేశారు. ఆయన కవితలలో శౌర్యం, భారత మాత యందు భక్తి, ధైర్యం ప్రధానాంశాలు గా ఉండేవి. అధికార భాష విషయమై కావ్యకంఠుల వారు గాంధీ గారితో విభేదించారు. గాంధీ గారు హిందీ/ హిందుస్థానీ వైపు మొగ్గు చూపగా, కావ్యకంఠుల వారు సంస్కృతాన్ని బలపర్చారు. అయినా, కావ్యకంఠుల వారు ఎక్కువగా ఆధ్యాత్మిక, సామాజిక అంశాలపై దృష్టి పెట్టారు. సమాజం లో బడుగు వర్గాల అభ్యున్నతికి ఆయన కొన్ని సూచనలు చేయటమే కాక, వారి వెనుకబాటు తనాన్ని తొలగించటానికి కృషి చేశారు. పురుషులతో బాటు స్త్రీలకు సమానహక్కు ఉందని వేదశాస్త్ర ప్రమాణాలతో నిరూపించారు. అలాగే అస్పృశ్యత శాస్త్రసమ్మతం కాదని వాదించారు.
కావ్యకంఠుల వారు గొప్ప తపస్వి. ఆయన భగవాన్ రమణుల అంకిత భక్తులు. రమణులను భగవాన్ రమణ అని తొలుత సంబోధించినది ఆయనే. అదే పేరు రమణు లకు స్థిరపడి పోయినది. రమణులు, కావ్యకంఠుల వారిని ‘నాయన’ అని సంబోధించేవారు.
కావ్యకంఠుల వారు శతాధికం గా గ్రంధాలు రచించారు. ఎక్కువగా అవి సంస్కృతం లో ఉండటం వల్ల జనబాహుళ్యం లో ప్రచారం తక్కువ. వీరి రచనలను రమణాశ్రమం వారు పన్నెండు సంపుటాలుగా వెలువరించారు.
**
కావ్యకంఠుల వారు బొబ్బిలి సమీపం లోని కలువరాయి అనే గ్రామం లో జన్మించారు. తల్లి తండ్రులు పెట్టిన పేరు ‘సూర్య గణపతి’. పైన చెప్పినట్లు కావ్యకంఠ అనేది వారికి లభించిన బిరుదు. వారి తపోనిష్టకు భక్తులు, శిష్యులు ఆయనను గణపతి ముని అని పిలువ సాగారు. వశిష్టుల వారు వారి గోత్ర ఋషి. అందుచేత వాశిష్ట గణపతి ముని శాస్త్రి గారని సంబోధించటం వాడుక. రమణులు ‘నాయన’ అని సంబోధించటం వల్ల నాయన గా సుపరిచితులు. వీరి ఇంటి పేరు అయ్యల సోమయాజుల. ప్రముఖ యోగి, కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు వీరి పూర్వీకులు. వీరి పూర్వీకులు తమిళ నాడు నుండి తెలుగు ప్రాంతానికి వలస వచ్చారు.
గణపతి మునీంద్రులు కొంతకాలం ఖరగ్ పూర్ లో భక్తుల కోరికపై నివశించి, అక్కడే సిద్ధి పొందారు.
నేడు గొప్ప తపస్వి , దేశ భక్తుడు, సంఘ సంస్కర్త - గణపతి ముని శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు
ఫోటో: భగవాన్ శ్రీ రమణులతో నాయన గారు
- MA MURTY

No comments:
Post a Comment