ముక్తి ఇవ్వకపోయినా పరవాలేదు కాని ఏ జన్మ ఇచ్చినా నా మనస్సు నీ పాదాలపై ఉండేలా అనుగ్రహించు స్వామీ అన్నారు ఆదిశంకరులు:
నరత్వం దేవత్వం నగవన
మృగత్వం మశకతా,
పశుత్వం కీటత్వం భవతు
విహగత్వాదిజననం,
సదా తత్పాదాబ్జస్మరణ
పరమానందలహరీ, విహారాసక్తం చేత్
హృదయమిహ కిం తేన వపుషాం " -10
" మనుష్యునిగా, దేవుడుగా, పర్వతంగా, వనంగా, మృగంగా, దోమగా, పశువుగా, పక్షిగా కాని పుట్టినా ఆ ఆ పుట్టుకలందు నీ పాదపద్మాలను భావించడం అనే ఆనందనదిలో ఈదులాడే తలపు ఉన్నచో ఏ పుట్టుక అయినా లోటేముంది " అని.
ఈ శ్లోకం శంకరాచార్య విరచిత శివానందలహరి లోనిది.
ఏ పుట్టుక అయినా శివుడి ధ్యాసలోనే ఉన్నవారు చరితార్ధులవుతారు అని భావించాలి.
" జంతూనాం నరజన్మ దుర్లభం " అన్నాయి శాస్త్రాలు. కాని శివునిధ్యాసలో లేనప్పుడు ఆ నరజన్మ వ్యర్ధం కదా.
దేవతలకయినా ఇదే వర్తిస్తుంది. కుబేరుడు ప్రతిదినమూ ఇద్దరిని దర్శించుకుని పూజిస్తారుట. ఒకరు శివుడు, ఐశ్వర్యప్రదాత, సంపదకోసం. రెండు వెంకటేశ్వరుడు - తను అప్పుగా ఇచ్చిన ధనాన్ని వసూలు చేసుకోవడానికిట.
కొన్ని కొండలు ఉంటాయి - అరుణాచలం, సింహాచలం, భద్రాచలం, వేంకటాచలం (తిరుమల), రత్నాచలం (అన్నవరం ) మొ.గునవి. కొండగా పుడితేనే స్వామిని తమ తలపై పెట్టుకుని సేవించుకుని చరితార్ధులవుతున్నాయి.
కొన్ని అడవులు ఉంటాయి - శబరిమల, నల్లమల (శ్రీశైలం) మొ.గునవి. స్వామిని తమమధ్యలో ఉంచుకుని తరిస్తున్నాయి.
దోమపుట్టుక గురించి చెబుతూ హాస్యంగా " కొన్ని దోమలు అందరి రక్తమూ త్రాగవు, దేవుడి భక్తుల రక్తమే త్రాగుతూ తరిస్తాయి " అన్నారు పండితులు.
అలాగే జంతువులలో కొన్ని ఏనుగులు, పశువులు దేవుడిసేవలో తరిస్తాయి.
కొన్ని పక్షులు దేవుడిగుడి గోపురాలమీద నివసిస్తూ సుప్రభాతాలూ స్తోత్రాలూ వింటూ, ప్రసాదాలు తింటూ తరిస్తాయి.
No comments:
Post a Comment