Monday, November 17, 2025

 Kalwa Badrinath:
పాలబిల్లు నుంచి పలకరింపు దాకా అన్నీ మేమే!

పిల్లలు అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో ఉంటున్నారంటే ఏ తల్లిదండ్రులకు మాత్రం సంతోషం ఉండదు! కానీ ఇక్కడ ఒంటరిగా ఉన్న పెద్దవాళ్ల పరిస్థితే కాస్త ఆలోచించుకోవాలి. కొత్త తరహా ఫోన్‌లనీ, టెక్నాలజీని వాడుకోవడం రాదు. అనారోగ్యం వస్తే చూసే వాళ్లుండరు. ఒంటరిగా...బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి. అలాంటివారి సమస్యలకు పరిష్కారం చూపించేందుకు అన్వయ.కామ్‌ని ప్రారంభించింది దీపికారెడ్డి. మాటసాయంతో మొదలుపెట్టి అన్ని పనులూ చేసేపెట్టే కేర్‌ మేనేజర్లూ, అనారోగ్యం తలెత్తితే క్షణాల్లో అందించే వైద్యసేవలూ అన్వయ ప్రత్యేకం!

పదేళ్ల క్రితం మావారి ఉద్యోగరీత్యా అమెరికాలో ఉండేవాళ్లం. ఆయన టీసీఎస్‌లో పనిచేస్తే నేను ఇంట్లో ఖాళీగా ఉండేదాన్ని. మా అత్తామామలకి మావారు ఒక్కరే. దాంతో నాకూ, ఆయనకీ వాళ్లు ఇక్కడ భారత్‌లో ఎలా ఉన్నారో అన్న దిగులు ఉండేది. ఎవరైనా ఆత్మీయులు దగ్గరుండి చూసుకుంటే బాగుండు అనుకునేవాళ్లం కానీ.. ఎవరుంటారు? అలా ఆలోచించీ, ఆలోచించీ చివరకు మేమే దగ్గరుండి చూసుకోవచ్చులే అనుకుని అమెరికా వదిలి వచ్చేశాం. మేం ఆ దేశాన్ని వదిలేసినా అక్కడున్న స్నేహితులూ, బంధువులతో మాట్లాడుతున్నప్పుడు మేం ఎదుర్కొన్న సమస్యే వాళ్లకూ ఉందని అర్థమయ్యింది. అమ్మానాన్నలకు ఎలా ఉందో అని ఆలోచిస్తూ చాలామంది బాధపడేవారు. ‘వెంట తీసుకెళ్లలేని పరిస్థితి. పోనీ స్మార్ట్‌ఫోన్‌, స్కైప్‌లో మాట్లాడుకుందామని అనుకున్నా వాటిని వాడటం రాదు’ అని పిల్లలు అంటుంటే... ‘ఆ స్మార్ట్‌ఫోన్‌ల వాడకం మాకెలా తెలుస్తుందమ్మా? అంతా ఆన్‌లైన్‌ అంటున్నారు. ఈ వయసులో అవన్నీ మేమేం నేర్చుకుంటాం చెప్పూ? పెళ్లిళ్లకీ, పేరంటాలకీ ఒంటరిగా వెళ్లాలంటే దిగులుగా ఉంది!’ అనేవారు పెద్దలు. రెండువైపులా ఉన్న సమస్యలు నన్ను ఆలోచింపచేశాయి. కానీ వాటిని మాత్రమే ప్రామాణికంగా తీసుకోలేదు. మావారు ప్రశాంత్‌తో కలిసి నేనో అధ్యయనం చేశాను. సుమారు ఐదొందలమంది ఎన్నారైలూ, వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడాను. అందులో చాలామంది అనారోగ్య సమస్యల గురించి చెబితే తక్కినవాళ్లు... మా అభిప్రాయాలని పంచుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుండు అంటూ ఒంటరితనం గురించి చెప్పుకుని బాధపడ్డవారే. మరికొందరు కిరాణా సరుకులూ, మందులూ, బిల్లుల చెల్లింపులూ, బ్యాంకు వ్యవహారాలు చూసిపెట్టేవారులేక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ఈ అధ్యయనం చేయడానికి ముందు అమెరికాలో ఉంటున్న మా కజిన్‌ వాళ్ల అమ్మగారికి బాగోలేకపోతే మేమే దగ్గరుండి ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఆ తర్వాత మాకు ఫోన్‌ చేయడానికి అతను ఇబ్బంది పడ్డాడు. ఎందుకని అడిగితే ఇలా ‘మిమ్మల్ని తరచూ విసిగించడం ఏం బాగుంటుందనీ...మీ పనులు మీకుంటాయిగా’ అన్నాడు. ఆ సంఘటన, మేం చేసిన అధ్యయనం తాలూకు వివరాలను బట్టీ.. ఇలాంటి వారికోసం ఏదయినా చేయాలని అనిపించింది.

ఒక్క క్లిక్‌ చాలు.. పెద్దవారికి అవసరం అయ్యే దాదాపు 32 రకాల సేవల్ని గుర్తించాం. వాటన్నింటినీ ఓ వెబ్‌సైట్‌లో పెట్టాం. ఈ సేవల్ని యాప్‌, ఒక ఫోన్‌ ద్వారా ఎలా పొందవచ్చో అందులో వివరంగా ఉంటుంది. ఒక్కసారి మా అన్వయ.కామ్‌లో రిజిస్టర్‌ చేసుకుంటే... ఒక కేర్‌మేనేజర్‌, నర్స్‌, సెక్యూరిటీ ఆఫీసర్‌ ముగ్గర్నీ ఇంటికి పంపుతాం. వీళ్లలో నర్స్‌ ప్రాథమిక ఆరోగ్య పరీక్షలన్నీ చేస్తుంది. ఎవరైనా హృదోగులుంటే ఆసుపత్రులు ఇచ్చిన రిపోర్ట్‌ ఆధారంగా ఎమర్జెన్సీ ప్లాన్‌ రూపొందిస్తుంది. దగ్గర్లోని ఆసుపత్రులూ, అంబులెన్సుల వివరాలని అందులో నమోదు చేస్తుంది. ఇక సెక్యురిటీ వాళ్లు... ఇంటికి అవసరం అయిన భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. అవసరం అనుకుంటే వినియోగదారుల కోరిక మేరకు లాక్స్‌, గ్రిల్స్‌ వంటివన్నీ ఏర్పాటుచేస్తారు. ఇంట్లో కెమెరాలు అమరుస్తారు. ఇక తర్వాత పనంతా... కేర్‌మేనేజర్ల చేతిలోనే ఉంటుంది. ఆరు కుటుంబాలకు ఓ కేర్‌ మేనేజర్‌ ఉంటారు. ఈ కేర్‌మేనేజర్‌ వారం రోజులకోసారి ప్రతి ఒక్కరినీ పలకరిస్తాడు. ఈలోపు వాళ్లే ఫోన్‌ చేసి ఏదైనా పని చెబితే వాటిని ఈ కేర్‌మేనేజరే పూర్తిచేస్తాడు. కాయగూరలూ, కిరాణా సరకులూ, మందులూ, బంధువులు వస్తే స్వీట్లు తేవడం మొదలు బ్యాంకు వ్యవహారాలూ, బిల్లుల చెల్లింపులూ.. ఇలా అన్నీ చేస్తారు.

యాభై కుటుంబాలకు సాయం.. మా దగ్గర ఉండే సిబ్బంది నమ్మకంగానే పనిచేస్తారా అంటే.. చేస్తారు. వీళ్లంతా రోడామిస్త్రీ సోషల్‌ సైన్స్‌ కాలేజీ వంటివాటిల్లో సోషల్‌సైన్స్‌ డిగ్రీ చదివిన వాళ్లు. డబ్బుకోసం కంటే సేవాదృక్పథం ఉన్నవారినే ఎక్కువగా ఎంపిక చేసుకుంటాం. అలా ఇప్పటివరకూ పదిహేను మంది మాతో కలిసి పనిచేస్తున్నారు. అన్నట్టుగా ఎవరికైనా ఏ అర్ధరాత్రో గుండెపోటో, మరేదయినా అనారోగ్యం వస్తే... మా యాప్‌లో ఒక బటన్‌ నొక్కితే చాలు. ఆంబులెన్స్‌, దగ్గర్లోని ఆస్పత్రీ, మా కేర్‌మేనేజర్‌ అందరూ ఒకేసారి స్పందిస్తారు. క్షణాల్లో వాళ్లకు అవసరం అయిన సేవ చేస్తారు. మా వినియోగదారులకు మేమే యాప్‌ డౌన్‌లోడ్‌ చేసి పెడతాం. దాన్ని ఎలా వాడాలో కూడా ముందే వివరిస్తాం. అది సాధ్యం కానివాళ్లకు మా ఫోన్‌నెంబరు ఇస్తాం. ఆ పెద్దవాళ్లు ఎక్కడికయినా వెళ్లాలనుకుంటే క్యాబ్‌నూ ఏర్పాటుచేస్తాం.

అమెరికాలో ఉన్న వాళ్ల పిల్లలు కోరితే గనుక ఆ పెద్దవాళ్లకోసం సర్‌ఫ్రైజ్‌ పార్టీలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం యాభై కుటుంబాలకు సేవలు అందిస్తున్నాం. మా సేవల్ని బట్టీ ఎన్నారైల నుంచి 400 డాలర్ల నుంచి 1000 డాలర్ల వరకూ వసూలు చేస్తున్నాం. ఒక్కమాటలో చెప్పాలంటే వాళ్లకు ఏ అవసరం వచ్చినా మేం క్షణాల్లో అందుబాటులో ఉంటాం. ఇంతకూ నా గురించి చెప్పనేలేదు కదూ! బిహార్‌లో కెమికల్‌ ఇంజినీరింగ్‌ చేసి తర్వాత ఇక్ఫాయ్‌లో ఎంబీఏ చేశాను. ఫైనాన్స్‌ లో పీజీ డిప్లొమా పూర్తిచేసి.. మూడేళ్ల క్రితమే అన్వయకి శ్రీకారం చుట్టాను. ఏడాది నుంచి పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నా!

( సేకరణ )

No comments:

Post a Comment