[12/28, 10:45] +91 73825 46949: వస్త్రం - యుద్ధం.
చరిత్ర పుటలు
తిరగేయండి...
ఆదిమ అడవుల్లో
ఆకులను అలుముకున్న
మనిషికి...
శరీరాన్ని దాచుకోవడమే
తెలుసు కానీ..
ఇలా ఎదుటివారిని
శాసించే సంకుచితం
తెలియదు...
ఆనాడే గనుక
ఈ నిబంధనల తుప్పు పట్టిన సంకెళ్లు ఉంటే..
మనిషి ఈనాటికీ .....
ఆ రాతి యుగపు గుహల్లోనే బందీగా ఉండేవాడు!
నా శరీరం... నా స్వయంప్రతిపత్తి..
నేను ఏ వస్త్రాన్ని ధరించాలో,
నా చర్మాన్ని ఏ రంగు తాకాలో..
అది నా వ్యక్తిగత ఇష్టం మాత్రమే కాదు,
నా రాజ్యాంగబద్ధమైన స్వేచ్ఛ!
అవసరానికి మించి అలంకారాలు అద్దుకుంటున్నామని
మా నడకను,
మా ఉనికిని మీ కళ్ళతో కొలుస్తున్నారంటే
లోపం మా వస్త్రాల్లో లేదు...
మీ చూపుల్లో ఉంది..
వస్త్రం వెనుక ఉన్న మనిషిని కాదు,
ఆ వస్త్రం కింద ఉన్న దేహం మీద అధికారం కోసం మీరు పరితపిస్తున్నారు..
మీరు రాసిన ఆచారాల నిఘంటువులో
నా స్వేచ్ఛకు చోటు లేకపోవచ్చు...
కానీ,
నా స్వేచ్ఛా ప్రకటనకు ...
మీ ఆమోదం నాకక్కర్లేదు..
శాసించే పెత్తందారీతనం నీది కావచ్చు,
కానీ..
దిక్కరించే చైతన్యం నాది..
చీకటి గదుల్లో కూర్చుని మీరు గీసిన గీతలు
స్వేచ్ఛా వాయువును పీల్చే నా ఆత్మను బంధించలేవు.
నేనేమి ధరించాలో చెప్పడానికి మీరెవరు?
చరిత్రను మార్చేది
మీ శాసనాలు కావు...
మా అడుగులు!
Bureddy blooms.
[12/28, 11:05] +91 73825 46949: చింత పిక్కలు...
బాల్యపు జ్ఞాపకాల నాణేలు..
అమ్మమ్మ నానమ్మల ఒడిలో...
పాత కాలపు పెట్టె మూలల్లోనో, అటక మీద గిన్నెల్లోనో
నల్లని నిగనిగలాడే మెరుపుతో
కనువిందు చేసే జ్ఞాపకాల పోగులు.. ఈ చింత పిక్కలు!
ఏ రంగుల హంగులు లేని నలుపు అవి
కానీ.. మా చిన్ననాటి ప్రపంచానికి అవే అసలైన నాణేలు.
అష్టాచెమ్మా గళ్ళ మీద గుర్రాలుగా పరుగెత్తేవి,
వామన్‌గుంట (వామనగుంటలు) గుంటల్లో అమృతంలా నిండేవి!
జేబుల నిండా నింపుకుంటే..
అవే మాకు కుబేర సంపదలు.
ఒక్కో పిక్కను నేలకు రాస్తూ..
ఆ వేడిని బుగ్గ మీద తాకించుకుంటే కలిగే ఆ చిలిపి సంతోషం
ఏ ఏసీ గదులూ ఇవ్వలేవు!
పెంకు మీద వేయించి.. పై పొరను ఒలిచి..
లోపలి తెల్లని కండను నములుతుంటే..
ఆ పంటి కింద పడే కరకర శబ్దం
ఒక తియ్యని సంగీతం.
చింత పిక్కలంటే కేవలం విత్తనాలు కావు..
కులాసాగా గడిపిన వేసవి సెలవుల సాక్ష్యాలు.
సెల్ ఫోన్ గేమ్స్ లేని ఆ రోజుల్లో
నలుగురు పిల్లల్ని కలిపి ఉంచిన బంధం.. ఈ చింత పిక్కలు!
నాగరికత పెరిగి గూగుల్ ప్లే స్టోర్ లో ఆటలు వెతుకుతున్నాం కానీ,
నిజమైన ఆటపాటల మాధుర్యం
ఆ నల్లని చింత పిక్కల మధ్యే మిగిలిపోయింది!
Bureddy blooms.
No comments:
Post a Comment