Tuesday, December 30, 2025

 నిలువుటద్దం వెనుక...
ముందు నీ కంటి పొరల మీద పేరుకున్న
ఆ పాత రాతియుగపు ఆలోచనని వదిలించుకో!
అలవాటుగా ఆమె మేని వంపుల మీద
నీ చూపుల గాలం విసిరినప్పుడల్లా...
చిక్కుకుంటున్నది ఆమె శ్వాస కాదు,
నీలోని వికృతమైన అహంకారం!
పైట జారడం నేరం కాదు,
నీ బుద్ధి జారడమే అసలైన విపత్తు.
సమస్త ప్రకృతిని తనలోకి ఇంకించుకున్న
ఆడపిల్ల శరీరం... నీకు కేవలం ఒక మాంసపు ముద్దేనా?
ఆమె అస్తిత్వాన్ని వస్త్రాల కొలతలతో కొలుస్తున్నావు,
మరి నీ సంస్కారాన్ని ఏ తక్కెడలో తూచాలి?
ముద్దులొలికే కోడిపిల్లలకు పాఠాలు వద్దు,
ఆకాశంలో గద్దల్లా పొంచి ఉన్న మీకే
నీతి సూత్రాలు నేర్పాలి.
అమ్మ పాలు తాగిన గొంతులే
అమ్మతనాన్ని వెక్కిరిస్తుంటే...
మానవత్వం అంటే అర్థం మారిపోదా?
నీవు గీసుకున్న లక్ష్మణ రేఖల అవతల
ఒక స్వేచ్ఛా ప్రపంచం ఉంది.
అక్కడ ఆమె 'అమ్మ' గానో, 'చెల్లి' గానో కాదు...
ముందు తనని తానై నిలబడే 'మనిషి' గా చూడటం నేర్చుకో.
చూపు మారిన రోజున...
సృష్టంతా ఒక అద్భుత కావ్యంలా కనిపిస్తుంది!


Bureddy blooms.

No comments:

Post a Comment