Monday, December 29, 2025

 * "పుట్టపాము పడగలాంటి జననాంగమున్న వనమయూరీ"... ఇందులోని తాంత్రికత ఏమిటి?

* కుండలినీ శక్తి ఊర్ధ్వ ముఖం కావాలా?

----------
'సరిగ్గా' తిరుప్‌పావై 
- 11 -
-------------------

మూలంలోని శైలితో, శిల్పంతో
తెలుగులో సరైన, మేలైన అనువాదంగా తిరుప్‌పావై!

పాసురమ్ 11 

ఆణ్డాళ్, ఎంతకీ నిద్రలేవని గోపకన్యను ఎందుకు నీకు ఈ నిద్ర? అని అడుగుతూ ఇదిగో ఇలా పదకొండో పాసురాన్ని అందుకుంది; ఆలకిద్దాం రండి.. 

మూలం 

కఱ్ట్రుక్ కఱవైక్ కణఙ్గళ్ పలకఱన్దు
సెఱ్ట్రార్ తిఱలళ్షియచ్ చెన్ఱు సెరుచ్‌చెయ్యుమ్
కుఱ్ట్రమొన్ఱిల్లాద కోవలర్ తమ్ పొఱ్కొడియే!
పుఱ్ట్రరవల్గుల్ పునమయిలే! పోదరాయ్;
సుఱ్ట్రత్తుత్ తోళ్షిమార్ ఎల్లారుమ్ వన్దునిన్
ముఱ్ట్రమ్ పుగున్దు ముగిల్ వణ్ణన్ పేర్పాడ
సిఱ్ట్రాదే, పేసాదే సెల్వప్ పెణ్డాట్టి నీ
ఎఱ్ట్రుక్కుఱఙ్గుమ్ పొరుళేలోరెమ్‌పావాయ్! 

తెలుగులో 

దూడలతో ఉన్న పలు పాడి ఆవుల పాలు పితికే,
శత్రువులు పతనం అయ్యేట్టుగా యుద్ధం చేసే
ఏ దోషమూ‌ లేని గోపాలుల బంగారు వల్లరీ!
పుట్టపాము పడగలాంటి జననాంగమున్న వనమయూరీ! లేచిరా;
చుట్టాలైన తోటివాళ్లందఱూ వచ్చి నీ
లోగిలిలోకి చేరి మేఘవర్ణుడి నామగానం చేస్తున్నా
కదలకుండా, పలకకుండా సౌభాగ్యవతీ! నువ్వు
ఎందుకు ఇలా ఉన్నావ్? నీ నిద్రకు అర్థం ఏముంటుంది?; ఓలాల నా చెలీ!


అవగాహన 

గోపాలులు పాలు పితికేవాళ్లు మాత్రమే కాదు శత్రువులు పతనం అయ్యేట్టుగా యుద్ధం చేసేవాళ్లు కూడా అని చెబుతూ అలాంటి‌ వాళ్ల‌ "బంగారు వల్లరీ" అంటూ గోపకన్యను ముద్దు చేస్తోంది ఆణ్డాళ్. 

ఈ పాసురమ్‌లో ఆణ్డాళ్ చెప్పిన "పుట్టపాము పడగలాంటి జననాంగమున్న వనమయూరీ" మాటల్ని తాంత్రికంగా పరిగణించాలి. పాము ఆధ్యాత్మికతకు, కుండలినీ శక్తికి ప్రతీక. కుండలినీ శక్తిని సర్పశక్తి అనీ అంటారు. వెన్నెముక కొన నుంచి తలలోని మెదడు వఱకూ ఉన్న భాగం పడగతో ఉన్న పాములా ఉంటుందని తంత్ర గ్రంథాలు చెబుతాయి. ఇక్కడ స్త్రీ జననాంగాన్ని పాము‌ పడగగా ఆణ్డాళ్ చెప్పింది. సర్పశక్తి అధో ముఖమై ఉందని చెప్పడం ఆణ్డాళ్ ఉద్దేశం అని అర్థం ఔతోంది.‌ "వనమయూరీ" అనడంలో విశేషముంది. నెమళ్లకు శారీరిక‌ కలయిక ఉండదు అనేది ఆనాటి ఎఱుక. వనమయూరీ అన్నప్పుడు దానికి అర్థం శారీరికంగా ఎవరితోనూ‌ కలవని కన్య అని తెలుసుకోవాలి. 

అధో ముఖంగా ఉన్న‌ కుండలినీ శక్తి ఊర్ధ్వ ముఖం కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ "మేఘవర్ణుడు" అని అనడం దైవం మేఘంలాగా పైనుండేది అన్న విషయాన్ని సూచిస్తోంది‌. ఆ పైనున్న దైవం వైపుకు వెళ్లాలంటే ఊర్ధ్వముఖం అవాలి. కనుక,  ఆ దైవ నామగానం జరుగుతున్నా నువ్వెందుకు కదలవు, పలకవు, ఎందుకు ఇలా ఉన్నావు? అని నిలదీస్తూ నిద్రలో ఏమీ లేదని చెప్పే రీతిగా "నిద్రకు అర్థం ఏముంటుంది?" అని గోపకన్యను ప్రశ్నిస్తోంది ఆణ్డాళ్. 
ఆణ్డాళ్ ప్రశ్నను మనమూ తీసుకుందాం.‌ సమాధానంగా మనం మొద్దు నిద్రను విడిచి ఆ దైవం వైపుకు ఉర్ధ్వముఖులం ఔదాం.


రోచిష్మాన్
9444012279

ఎ.ఐ. మూలంగా మిత్రుడు దేవనాద(థ)న్ (శ్రీపూర్ణం) సంగీతబద్ధం చేసిన  తమిళ్ష్ పాసురమ్ 11

No comments:

Post a Comment