* పాముపై బీజం నిద్రపోతోందా?
* పెద్ద శబ్దం చొరబడ్ద తరువాత హృదయం చల్లగా ఉంటుందా?
* ఏది శ్రేష్ఠమైన స్థితి? ఏది వాంఛనీయమైన స్థితి??
----------
'సరిగ్గా' తిరుప్‌పావై
పాసురమ్ 6
-------------------
మూలంలోని శైలితో, శిల్పంతో
తెలుగులో సరైన, మేలైన అనువాదంగా తిరుప్‌పావై!
భారతదేశ భక్తి సాహిత్యంలో తిరుప్‌పావైకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కవిత్వం, భక్తి, తాత్త్వికతల పరంగా మనకు అలవాటైన సాహిత్యంలో తిరుప్‌పావై ప్రముఖమైంది. తమిళ్ష్ వైష్ణవ సాహిత్యం నాలాయిర దివ్యప్రబన్దమ్‌లో (దివ్యప్రబంధం కాదు)
తిరుప్‌పావై ఒకటి ఆపై విశేషమైంది. తిరుప్‌పావై
ముప్పై పాసురాల సంప్రయోగం. తిరుప్‌పావై
పాసురాల్ని సంభావించింది, సంధానించింది, సమర్పించింది ఆణ్డాళ్ లేదా కోదై లేదా నాచ్చియార్. (ఆండాళ్ అని రాయడం సరికాదు)
తిరు అంటే మేలిమి అనీ, పావై అంటే నోము అనీ అర్థాలు. తిరుప్‌పావై అంటే మేలిమినోము లేదా మేలినోము అని అర్థం. తిరు, పావై రెండు పదాలు. తమిళ్ష్ భాష నిర్మాణం ప్రకారం ఈ రెండు పదాల మధ్యలో ప్ వచ్చి తిరుప్‌పావై అని అవుతుంది. తమిళ్ష్‌లో పావై అన్నది పదరూపం కాబట్టి తెలుగులో పా అక్షరానికి ప ఒత్తు పెట్టి తిరుప్పావై అని ప్రకటించడంవల్ల పావై అనే పదరూపం పాడవుతుంది. కనుక తెలుగులోనూ తిరుప్‌పావై
అనే ఉండడం మేలుగా ఉంటుంది.
ఆళ్ష్వార్ పాడిన విష్ణుభక్తి గీతాన్ని పాసురమ్ అని అంటారు. పాసురమ్ అంటే జ్ఞానగీతం అని కూడా అర్థం ఉంది. పాశురం కాదు. తమిళ్ష్ భాషలో శ కారం లేదు. కనుక శు కాదు సు అక్షరం ఉంటుంది. అందువల్ల తెలుగులోనూ సు అక్షరమే ఉండాలి. పాసురమ్ సంస్కృత పదం కాదు.
పాసు తరువాత ర కారం పక్కన అనుస్వరం కాదు (తమిళ్ష్ అక్షరాల పక్కన అనుస్వరం ఉండదు) మ కారపు పొల్లు (మ్) ఉండాలి. పాసురమ్ అనడమే సరైంది.
తిరుప్‌పావై వంటి మేలి కృతులకు అనువాదాలు చిత్తశుద్ధితోనూ, సరైన 'చదువు'తోనూ, 'తెలివిడి'తోనూ, మేలైన 'భక్తి'తోనూ, నిజాయితీతోనూ ఉండాలి.
1953 నుంచీ తెలుగులో తిరుప్‌పావై సరైన అనువాదంతోనూ, మూలంతోనూ, అవగాహనతోనూ రాలేదు. అందుకు భిన్నంగా 'తెలుగులో సరైన, మేలైన తిరుప్‌పావై'ను మీ ముందుకు తీసుకువచ్చాను. అందుకుని ఆశీర్వదించండి.
పాసురమ్ 6
ఆణ్డాళ్ ఆఱో పాసురమ్‌లో "మేలుకో" అంటూ గోపకన్యను నిద్రలేపుతోంది. ఆ మేలుకోమనడం చక్కటి చిత్రణతోనూ, నిగూఢమైన తాత్త్విక చింతనతోనూ సమన్వితమైంది. అదేంటో తెలుసుకుందాం రండి...
మూలం
పుళ్ళుఞ్‌సిలమ్బిన కాణ్; పుళ్ళరైయన్ కోయిల్
వెళ్ళై విళిసఙ్గిన్ పేరరవమ్ కేట్టిలైయో?
పిళ్ళాయ్! ఎళ్షున్దిరాయ్; పేయ్ ములై నఞ్‌జున్డు,
కళ్ళచ్ చగడం కలక్కళ్షియక్ కాలోచ్చి
వెళ్ళత్ తరవిఱ్ తుయిలమర్‌న్ద విత్తినై
ఉళ్ళత్తుక్ క్కొణ్డు మునివర్గళుమ్, యోగిగళుమ్
మెళ్ళ వెళ్షున్దు అరియెన్ఱ పేరరవమ్
ఉళ్ళమ్ పుగున్దు కుళిర్‌న్దేలోరెమ్‌పావాయ్!
తెలుగులో
పక్షులు కిచకిచలాడుతున్నాయి చూడు; పక్షిరాజుకు రాజైన వాడి కోవెల నుంచి
తెల్లని పిలుపుల శంఖపు పెనురావం వినిపించడం లేదా?
చిన్నదానా! మేలుకో; పిశాచి చన్నుల విషం తాగి,
కపటశకటాన్ని ధ్వంసం అయ్యేట్టు కాళ్లతో తన్ని
పాలకడలిలో పాముపై నిద్రపోతున్న బీజాన్ని
హృదయంలో నిలుపుకుని మునులూ, యోగులూ
మెల్లగా లేచి హరి అని అంటున్న పెద్ద శబ్దం
హృదయంలోకి చొరబడగా, చల్లగా; ఓలాల నా చెలీ!
అవగాహన
ఈ పాసురమ్‌లో పక్షిరాజుకు రాజైన వాడు అంటే మహావిష్ణువు. పక్షిరాజు గరుత్మంతుడు, ఆ గరుత్మంతుడి రాజు మహావిష్ణువు.
ఆణ్డాళ్ కాలంలో గుళ్లల్లో తెల్లవారు జామున కైంకర్యాలు మెదలయ్యే ముందు శంఖారావం చేసి ఊరివాళ్లను పిలిచే ఒక వాడుక లేదా ఆచారం ఉండేదని 'పిలుపుల శంఖపు పెద్ద శబ్దం' అని అనడం ద్వారా తెలియవస్తోంది.
పిశాచి అనడం రక్కసి పూతననూ, కపటశకటం అనడం శకటాసురుణ్ణీ సూచిస్తోంది. "పిశాచి చన్నుల విషం తాగి" అన్నప్పుడు పైశాచికత్వపు విషం దైవత్వాన్ని చంపలేదనీ, "కపటశకటాన్ని ధ్వంసం అయ్యేట్టు కాళ్లతో తన్ని" అన్నప్పుడు కపటం శకటమై మీదపడితే దైవత్వం దాన్ని ధ్వంసం చేస్తుందనీ ఆణ్డాళ్ చెప్పకుండానే చెబుతోంది.
'పాముపై నిద్రపోతున్న బీజం' అని ఆణ్డాళ్ మాత్రమే అనగలదేమో? పరమాత్మే మొత్తం సృష్టికి బీజం. "జన్మాద్యస్య యతః" అంటూ ఒక బ్రహ్మసూత్రం (1-1-2) ఈ మొత్తం సృష్టికి ఏది ఆదిగా ఉందో అది బ్రహ్మం అని తెలియజెప్పింది. భగవద్గీత (అధ్యాయం 7 శ్లోకం 10)లో కృష్ణుడు "బీజం మాం సర్వభూతానాం..." అని చెబుతాడు. అంటే నేను సర్వభూతాలకు బీజాన్ని అని అర్థం. ఆణ్డాళ్ ఆ భావాన్నే ఇక్కడ గొప్పగా అందించింది. పాము ఆధ్యాత్మికతకు చిహ్నం.
హరి అన్నది పెద్ద శబ్దమై హృదయంలోకి చొరబడాలి లేదా చొచ్చుకునిపోవాలి ఆపై చల్లగా మేలుకోవాలి. ఎంతో గొప్పగా చెప్పింది ఆణ్డాళ్! పెద్ద శబ్దం చొరబడ్ద తరువాత హృదయం చల్లగా ఉంటుందా? అప్పుడు మేలుకోవాలా? అదేం పరిస్థితి? అది శ్రేష్ఠమైన స్థితి! అదే వాంఛనీయమైన స్థితి! అర్థం చేసుకుందాం.
రోచిష్మాన్
9444012279
ఎ.ఐ. మూలంగా మిత్రుడు దేవనాద(థ)న్ (శ్రీపూర్ణం) సంగీతబద్ధం చేసిన తమిళ్ష్ పాసురమ్ 6:
https://youtu.be/zXxHHQh4CjM?si=pccxEM9M4RLHTyQ9
No comments:
Post a Comment