Wednesday, December 31, 2025




నీరెళ్ళి పోతున్నా.. నది నాతోనే..!
రచన:యర్రగుంట్ల పాణీ రావు గారు
సమీక్ష:డా. ఎన్. సి. హెచ్. సుధా మైథిలి

మంచి సాహిత్యం వ్రాయాలంటే తెలుగు పండితులే కానవసరం లేదు.. గుండెల నిండా భావుకత్వం..
తలపులనిండా కవితావేశం ఉన్న ఎవరైనా చక్కని కవిత్వాన్ని పండించవచ్చని నిరూపించిన అతి తక్కువ మంది కవుల కోవలోకి వస్తారు ఈ ఇంగ్లీషు మాష్టారు యర్రగుంట్ల పాణీరావు గారు.

 "నీరెళ్ళి పోతున్నా.. నది నాతోనే "వీరి తొలి కవితా సంపుటి.. లోతైన భావాన్ని నింపుకున్న శీర్షిక..ఆహ్లాదాన్ని పంచే ముఖచిత్రంతో.. పుస్తకాన్ని చూడగానే చిన్ననాటి మిత్రుణ్ణి చూసిన అనుభూతిని పంచుతుంది. చక్కనైన పూలనన్నిటిని ఏర్చి కూర్చి అందమైన పూమాలనల్లినట్లుగా మధురమైన భావాలనన్నింటినీ ఒకదాని వెంట మరొకటి పొందుపరచి గొప్ప కవితలల్లి భాషామతల్లికి అలంకరించారు పాణీరావు గారు.

తల్లిదండ్రుల ఋణం తీర్చలేనిదంటారు.. కానీ ఇక్కడ తల్లిదండ్రులకు అంకితమిస్తూ వ్రాసిన తొలి కవితలోనే..

 *ఎక్కే ప్రతీ మెట్టూ నాన్నే..
తినే ప్రతీ మెతుకూ అమ్మే..*

అంటూ అంతులేని కృతఙ్ఞతా భావాన్ని ఎంతో ఉదాత్తంగా అక్షరీకరించారు..

స్త్రీలను సహన మూర్తులంటారు.. కానీ హద్దు మీరిన సహనం బానిసత్వానికి తక్కువేమీ కాదనీ, ఆ సంకెళ్ల నుండీ విడిపించుకోలేక పోతే పంజరo లోని చిలుకకు, ఆ మహిళకు వ్యత్యాసం ఉండదనీ.. తెగించి పంజరం నుండీ బయటపడమని హితవు చెప్తూ
 *చిలకమ్మా* అనే కవితలో పెళ్ళి అనే పంజరంలో చిక్కుకొని, భర్త విధించిన బానిసత్వపు సంకెళ్ళ నుండీ బయటపడలేని స్త్రీలనుద్దేశించి..

 ఇష్టంగానో..
 అయిష్టం గానో..
ముద్దు మాటల్ని విందుగా వడ్డిస్తున్నంత కాలం
చిలకమ్మా నీ జీవితం పంజరమే..

అనుభవిస్తున్న ఆధిపత్యం..
నీవు పంచే ఆనందం
రుచి మరిగిన పెత్తనం
వాడెందుకు వదులుకుంటాడు..

నువ్వే విదిలించుకోవాలి..
నువ్వే వదిలించుకోవాలి..
నువ్వే విసిరిపడేయాలి....
అంటూ ధైర్యాన్ని నూరిపోసే ఆప్తులౌతారు..

 పరుగెత్తకు అనే కవితలో..
 పరుగెత్తకు..
జీవితం పరుగు పందెం కాదు..
అప్పుడప్పుడూ నీ దారిలో చెట్టుక్రింద ఆగి సేదతీరు..
నీ జీవితం నీతో పరవశిస్తుంది..
నీ గతం ఎంత బలమైనదో..
ఎన్ని యుద్ధాలు గెలిచిందో మెదడుకు తెలుస్తుందoటూ.. 
గొప్ప తాత్వికుల వలే జీవిత పరమార్థాలను బోధిస్తారు..

భోగి మంటల్లో పనికిరాని, పాత వస్తువులు వేసేసి మంటలు ఎంత బాగా పైకిలేస్తే అంతగా మురిసిపోతాం..కానీ
మనలో పేరుకొని పోయిన ఈర్ష్యా ద్వేషాలను,భయాలను, అహంకారాన్ని మాత్రం తగలెయ్యడానికి ఇష్ట పడక పెంచి పోషించి, మనం నిలువెల్లా దహించుకొని పోతాం..ఈ భయాలను ఎండగడుతూ..

 *భోగి మంటల్లో* అనే కవితలో..
భోగి మంటలు వేద్దామా..
పాత కుర్చీలే కాదు..
కుర్చీ తొక్కుతున్న నియంతృత్వాన్ని, 
సగటు మనిషి భయాన్ని,
 బ్రతక లేని వారి దైన్యాన్ని 
వేద్దామా మంటల్లో..
అంటూ చక్కని అభ్యుదయ భావాలు పలికించారు.

 *శరీరమాద్యం ఖలు ధర్మసాధనం* అన్నట్లు మానవ శరీరానికి పరమార్థం ఇతరులకు సేవ చేయటమేనని అన్ని ధర్మాలు ఘోషిస్తున్నాయి లేకుంటే ఈ జీవితానికి అర్థం ఉండదు.. ఈ విషయాన్ని ఎంతో సున్నితంగా, సూటిగా సరళంగా వీరు వ్యక్తీకరించిన తీరు ఎంతో హృద్యం..

ఎన్ని వందల చెట్లున్నా 
కాసింత పరిమళం చల్లేపూలు..
కూసింత ఆకలి తీర్చే పండ్లు లేకుంటే 
ఆ తోట తోటే కాదు..
సమాజం కోసం కాస్త సమయం ఇవ్వకపోతే నీ పేరెంత పొడుగున్నా..
పేరుకెన్ని తోకలున్నా.. నువు మనిషివే కాదు.. అంటూ చురకలంటించిన విధానం  ఆలోచింపచేస్తుంది.

మనిషి మనుగడ కు కావల్సింది తిండి, నిద్ర, సంపాదన.. ఇవి మాత్రమే కాదు.. కష్టాల్లో నేనున్నాననే భరోసా.. మనసుకు దారి,తెన్ను కనపడక అవమానాల కాష్టంలో రగులుతున్నప్పుడు.. సమస్యలవలయం లో చిక్కుకున్నప్పుడు నాలుగు మంచి మాటలు చెప్పి కొండంత  చిటికెలో తొలగించే సుప్రభాత రవి కిరణం వంటి చేయూత కావాలి. అలాంటి ఆత్మ విశ్వాసం *మంచి గింజలు* లో దొరుకుతుంది..
జీవితమనే మూటలో మనకు దుఃఖాన్ని, బాధను, అవమానాలు కలిగించే ఘటనలను ఏరి పడేస్తే మిగిలేవన్నీ మంచి గింజలేనంటూ గొప్ప వేదాంతాన్ని పలికించారు  కవి..

ఆలుమగల నడుమ కలిగే అవ్యాజమైన అనురాగాన్ని.. పదాలకు పరిమళమద్దినట్లు "సహచరి" లో భావ పారిజాతాలను గుప్పిస్తూ.. 

 ఒట్టికుండను పాయసం తో నింపావు..
ఈ కట్టెకు ఇంత ప్రాణం పోశావు..

అని ఆర్తిగా పలికిన తీరు హృదయాలను చేరి.. ఉతుకుడు పడినా వీడని అత్తరు పరిమళమై పరవశాన  నింపుతుంది..
ఇంకా *అక్షరాలమూటనిండా* వెలకట్టలేని భావ రత్నాలే.. గుర్తించగలిగే హృదయం ఉండాలే కానీ ప్రతి పదమూ ఓ అనర్ఘ రత్నమే..

"అక్షరం మూట విప్పుతుంది.. కలం హలమై కదులుతుంది..
కాగితంపై కవిత్వం..
పంట కాలువై నర్తిస్తుంది..
మది  మట్టి వాసన నింపుకుంటుంది.. "

అంటూ వారి భావ కవితల పైరుల నడుమ విహరింపచేస్తారు..

అలతి పదాలలో అనంతమైన అర్థాలు,సరళ, సంక్షిప్త వర్ణనలతో లోతైన భావాలను పలికించడం ఈ కవిగారి ప్రత్యేకత.అవి
మొగలి పూల నెత్తావిలా మనసును పరవశింపచేస్తాయి.

చూడడానికి సాధారణంగానే కనిపిస్తూ ఉన్న, లోతైన భావాలను నింపుకున్న పాణీరావు గారి లాగానే వారి కవిత్వం కూడా అసాధారణమైన భావ కవితా రత్నాలను నింపుకొని పాఠకులచే వహ్వా అనిపిస్తుంది..

వెరసి ఈ నీరెళ్ళి పోతున్నా.. నది నాతోనే లో కొన్ని మురిపించేవి, కొన్ని చరిచేవి, కొన్ని గిలిగింతలు పెట్టేవి, కొన్ని భావ సంద్రం లో ఓలలాడించేవి., కొన్ని బాధ్యతలు గుర్తుచేసేవి,ఇలా అన్ని రకాలుగా మెప్పించి అదరహో అనిపించేవే..
 ప్రతీ కవితలోనూ నింపుకున్న పరిణితి అబ్బురపరుస్తుంది.

మొత్తానికి..
వెన్నెల కాంతుల్లో.. 
నది ఒడ్డున
పొన్నాయి పూల చెట్టు క్రింద,
చల్లని సమీరము తోడురాగా..
మంచి స్నేహితుడు తోడు నిలిచినట్లుగా అనిపిస్తుంది.. నీరెళ్ళి పోతున్నా.. నది నాతోనే..!

Book cost ₹190/- with postage

No comments:

Post a Comment