Wednesday, December 31, 2025

 *రూపాయి చెప్పిన భేతాళ కథలు -1*


రూపాయి చెప్పిన బేతాళ కథలకు ముందు కథ...

అనగనగనగా ఓ ఊరు. ఆ ఊరి పేరు అలకాపురి. ఆ ఊరికి ఉత్తరాన వున్న ఓ పెద్ద రాజభవనం. ఆ భవనంలో దివ్యమణిఖచితమైన గోడలతో, సర్వాలంకారాలతో భవ్యమైన మందిరం. ఆ మందిరంలో బంగారు రత్నసింహాసనం. ఆ సింహాసనంపైన ఆసీనుడై వున్నాడు ఆ రాజ్యపు రాజు. ఆయన పేరు కుబేరుడు.

కుబేరుడు కూర్చున్న సింహాసనం పక్కనే ఓ హంసతులికా తల్పం వుంది. ఆ తల్పం పైన వయ్యారంగా కూర్చోని భర్తని పరిశీలిస్తోంది చంద్రరేఖ.

కుబేరుడు తన చేతిలో వున్న రత్నపాత్రలోని రత్నాలను గుప్పిటతో తీసి మళ్ళీ ధారగా అందులోకే జారవిడుస్తున్నాడు. మధ్యమధ్య అసహనంగా కదులుతున్నాడు. పెదవి విరుస్తున్నాడు. పెద్దగా నిట్టూరుస్తున్నాడు.

“స్వామీ.. ఎందుకు అంత చిరచిర లాడుతున్నారు. అప్పుడెప్పుడో రావణుడు మీ నగరాన్ని ఆక్రమించినప్పుడు కూడా ఇంత కలవరపడలేదే. ఇప్పుడేమైందని ఇంతగా మధనపడుతున్నారు?” అడిగింది చంద్రరేఖ అనూనయంగా.


కుబేరుడు తల ఎత్తి ఆమె వైపు చూశాడు. రాసిపోసిన బంగారు వరహాలలా మెరిసిపోయే సౌందర్యరాశి చంద్రరేఖ. అంత సౌందర్యాన్ని చూసినా అతనిలో కలవరపాటు తగ్గలేదు. 

చంద్రరేఖ అనూనయంగా దగ్గరకు వచ్చి-
“ఏమిటి స్వామీ... ఈ వారం ఏడుకొండలస్వామి వడ్డీ ఇవ్వలేదా?” అంటూ ప్రశ్నించింది.

“శ్రీనివాసుడు వడ్డి కట్టకపోవటం కలియుగంలో జరగదు దేవీ.. నేను ఆలోచిస్తున్నది ఆయన గుండెల్లో వున్న లక్ష్మీదేవి గురించి” అన్నాడు సాలోచనగా.

“లక్ష్మీదేవి గురించా? ఆమె గురించి ఆలోచించడానికి ఏముంది?” ఆశ్చర్యపోయింది ఆవిడ.

“ఏమిటా? ఆమెకూ నాకూ వున్న చుట్టరికం గమనించావా? ఇద్దరం డబ్బుకు సంబంధించిన వాళ్ళమే... కానీ ఆమెను కొలిచినంతగా నన్ను ఎప్పుడైనా ఏ మానవుడైనా కొలవటం చూశావా?”

“ఓహో... అయితే అసహనానికి కారణం అసూయా?”

“శివశివ... నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు రేఖా... నేను అసూయపడటంలేదు. మానవుని అమాయకత్వం చూసి జాలి పడుతున్నాను.”

“ఇందులో అమాయకత్వం ఏముందట?” అమాయకంగా అడిగింది చంద్రరేఖ.

“ఏమిటా? ధనలక్ష్మీ కటాక్షం కోసం ప్రతి మానవడు ప్రార్థిస్తాడు. పరితపిస్తాడు. ఇంకా ఇంకా డబ్బు కావాలని శ్రమిస్తాడు. ఒక వేళ ఆ అమ్మవారి కటాక్షం కలిగి సంపాదన పెరిగిందే అనుకో! డబ్బులు కనకధారగా కురిశాయే అనుకో! ఆ తరువాత ఏమౌతుంది?”

“ఏముంది కోటీశ్వరుడౌతాడు... అతని తరువాత తరతరాలు ఘనంగా బతుకుతారు”

“అలా జరగటంలేదే... ఒక్కసారి భూలోకం వైపు చూడు. లక్షల రూపాయలు లాటరీ బహుమతి పొందినవాళ్ళు కూడా ఒక తరం తిరిగేసరికి మళ్ళీ పేదవారిగా మిగిలిపోతున్నారు, ఏదో రకంగా రేట్లు పెరిగి పొలాలనీ, స్థలాలని అమ్ముకున్నవాళ్ళు ఆ డబ్బునంతా వృధాగా ఖర్చు పెట్టి మళ్ళీ మొదటికే వస్తున్నారు” ఆవేశంగా చెప్పాడు కుబేరుడు. 

(మిగిలినభాగం రేపు)

🙏🍭🍩🍬💐🙏

No comments:

Post a Comment