* నిద్ర లేచి ఏం చెయ్యాలి?
* ఏం చేస్తే దేవాదిదేవుడు అనుగ్రహిస్తాడు?
----------
'సరిగ్గా' తిరుప్‌పావై
పాసురమ్ 8
-------------------
మూలంలోని శైలితో, శిల్పంతో
తెలుగులో సరైన, మేలైన అనువాదంగా తిరుప్‌పావై!
భారతదేశ భక్తి సాహిత్యంలో తిరుప్‌పావైకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కవిత్వం, భక్తి, తాత్త్వికతల పరంగా మనకు అలవాటైన సాహిత్యంలో తిరుప్‌పావై ప్రముఖమైంది. తమిళ్ష్ వైష్ణవ సాహిత్యం నాలాయిర దివ్యప్రబన్దమ్‌లో (దివ్యప్రబంధం కాదు)
తిరుప్‌పావై ఒకటి ఆపై విశేషమైంది. తిరుప్‌పావై
ముప్పై పాసురాల సంప్రయోగం. తిరుప్‌పావై
పాసురాల్ని సంభావించింది, సంధానించింది, సమర్పించింది ఆణ్డాళ్ లేదా కోదై లేదా నాచ్చియార్. (ఆండాళ్ అని రాయడం సరికాదు)
తిరు అంటే మేలిమి అనీ, పావై అంటే నోము అనీ అర్థాలు. తిరుప్‌పావై అంటే మేలిమినోము లేదా మేలినోము అని అర్థం. తిరు, పావై రెండు పదాలు. తమిళ్ష్ భాష నిర్మాణం ప్రకారం ఈ రెండు పదాల మధ్యలో ప్ వచ్చి తిరుప్‌పావై అని అవుతుంది. తమిళ్ష్‌లో పావై అన్నది పదరూపం కాబట్టి తెలుగులో పా అక్షరానికి ప ఒత్తు పెట్టి తిరుప్పావై అని ప్రకటించడంవల్ల పావై అనే పదరూపం పాడవుతుంది. కనుక తెలుగులోనూ తిరుప్‌పావై
అనే ఉండడం మేలుగా ఉంటుంది.
ఆళ్ష్వార్ పాడిన విష్ణుభక్తి గీతాన్ని పాసురమ్ అని అంటారు. పాసురమ్ అంటే జ్ఞానగీతం అని కూడా అర్థం ఉంది. పాశురం కాదు. తమిళ్ష్ భాషలో శ కారం లేదు. కనుక శు కాదు సు అక్షరం ఉంటుంది. అందువల్ల తెలుగులోనూ సు అక్షరమే ఉండాలి. పాసురమ్ సంస్కృత పదం కాదు.
పాసు తరువాత ర కారం పక్కన అనుస్వరం కాదు (తమిళ్ష్ అక్షరాల పక్కన అనుస్వరం ఉండదు) మ కారపు పొల్లు (మ్) ఉండాలి. పాసురమ్ అనడమే సరైంది.
తిరుప్‌పావై వంటి మేలి కృతులకు అనువాదాలు చిత్తశుద్ధితోనూ, సరైన 'చదువు'తోనూ, 'తెలివిడి'తోనూ, మేలైన 'భక్తి'తోనూ, నిజాయితీతోనూ ఉండాలి.
1953 నుంచీ తెలుగులో తిరుప్‌పావై సరైన అనువాదంతోనూ, మూలంతోనూ, అవగాహనతోనూ రాలేదు. అందుకు భిన్నంగా 'తెలుగులో సరైన, మేలైన తిరుప్‌పావై'ను మీ ముందుకు తీసుకువచ్చాను. అందుకుని ఆశీర్వదించండి.
పాసురమ్ 8
----------------
ఆణ్డాళ్ ఎనిమిదో పాసురమ్‌లో స్నానానికి రాకుండా నిద్రపోతున్న గోపకన్యను నిద్రలేపుతూ లేచి ఏం చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో ఇలా తెలియజెబుతోంది...
మూలం
కీళ్ష్‌వానమ్ వెళ్ళెన్‌న్ఱెరుమై సిఱువీడు
మేయ్‌వాన్ పరన్దన కాణ్; మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్
పోవాన్ పోగిన్ఱారై పోగామల్ కాత్తున్నైక్
కూవువాన్ వన్దునిన్ఱోమ్; కోదుగలముడైయ
పావాయ్! ఎళ్షున్దిరాయ్; పాడిప్ పఱైకొణ్డు
మావాయ్ పిళన్దానై, మల్లరై మాట్టియ
దేవాదిదేవనైచ్ చెన్ఱు నామ్ సేవిత్తాల్
ఆవావెన్ఱారాయ్‌న్దరుళేలోరెమ్‌పావాయ్!
తెలుగులో
తూర్పు ఆకాశం తెల్లబడి ఎద్దులు కాసేపు
మేసేందుకు వెళ్లాయి చూడు; తతిమ్మా అమ్మాయిలు
వెళ్లబోతున్నా వాళ్లను వెళ్లకుండా ఆపి నిన్ను
పిలుచుకెళ్లేందుకు వచ్చి నుంచున్నాం; కుతూహలమున్న
కోమలీ! మేలుకో; పాడి, తప్పెటను పొంది
గుఱ్ఱం నోరును చీల్చేసిన వాణ్ణి, మల్లుల్ని చంపిన
దేవాదిదేవుణ్ణి దగ్గఱకెళ్లి మనం నమస్కరిస్తే
ఆహా అని సమీక్షించి అనుగ్రహిస్తాడు; ఓలాల నా చెలీ!
అవగాహన
ఈ పాసురమ్‌లో ఎద్దులు తెల్లవారుజామున లేచి మేతకు వెళ్లిన విషయాన్ని ప్రస్తావిస్తూ తెల్లవారుజాములో నిద్ర లేవని వాళ్లకు చురక వేసింది
ఆణ్డాళ్.
కేశి అనే రాక్షసుడు గుఱ్ఱం రూపంలో తనను చంపడానికి వచ్చినప్పుడు కృష్ణుడు ఆ గుఱ్ఱం నోరును చీల్చేసి మట్టుపెడతాడు. ఆ విషయాన్ని "గుఱ్ఱం నోరును చీల్చిన" అనీ, తనను చంపడానికి వచ్చిన చాణూర మల్లుణ్ణీ ఆ తరువాత కంసుణ్ణీ కృష్ణుడు చంపేస్తాడు. ఆ విషయాన్ని "మల్లుల్ని చంపిన" అనీ ఆణ్డాళ్ చెబుతోంది. "కంస, చాణూర మర్దనం..." అని కృష్ణాష్టకంలో ఉన్నదాన్ని గుర్తు చేసుకుందాం. కృష్ణుడికి మహామల్లః అనే నామం ఉంది.
"అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం"
అని భగవద్గీత (అధ్యాయం 9 శ్లోకం 22) లో కృష్ణుడు చెబుతాడు. అంటే మఱో చింతన లేకుండా నన్నే బాగా ఉపాసించే వాళ్లు ఎవరో ఆసక్తి కల ఆ జనుల యోగాన్నీ, క్షేమాన్నీ నేను వహిస్తాను అని అర్థం. ఆ భావాన్నే "దేవాదిదేవుణ్ణి దగ్గఱికెళ్లి మనం నమస్కరిస్తే ఆహా అని సమీక్షించి అనుగ్రహిస్తాడు" అని చెబుతోంది ఆణ్డాళ్.
రోచిష్మాన్
9444012279
ఎ.ఐ. మూలంగా మిత్రుడు దేవనాద(థ)న్ (శ్రీపూర్ణం) సంగీతబద్ధం చేసిన తమిళ్ష్ పాసురమ్ 8:
https://youtu.be/lvJuzkT32DQ?si=Ej5RcuC8BdqZvORb
No comments:
Post a Comment