Monday, December 29, 2025

 * 'మాయన్' అంటే మాయదారి అనో, మాయావి అనో కాదు! మాయన్ అంటే...?

* తప్పులు ఏమవాలి?

-----------
'సరిగ్గా' తిరుప్‌పావై 
పాసురమ్ 5
----------------------

మూలంలోని శైలితో, శిల్పంతో
తెలుగులో సరైన, మేలైన అనువాదంగా తిరుప్‌పావై!

భారతదేశ భక్తి సాహిత్యంలో తిరుప్‌పావైకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కవిత్వం, భక్తి, తాత్త్వికతల పరంగా మనకు అలవాటైన సాహిత్యంలో తిరుప్‌పావై ప్రముఖమైంది. తమిళ్ష్ వైష్ణవ సాహిత్యం నాలాయిర దివ్యప్రబన్దమ్‌లో (దివ్యప్రబంధం కాదు)
తిరుప్‌పావై ఒకటి‌ ఆపై విశేషమైంది. తిరుప్‌పావై  
ముప్పై పాసురాల సంప్రయోగం. తిరుప్‌పావై
పాసురాల్ని సంభావించింది, సంధానించింది, సమర్పించింది ఆణ్డాళ్ లేదా కోదై లేదా నాచ్చియార్. ('ఆండాళ్' అని రాయడం సరికాదు)

తిరు అంటే మేలిమి అనీ, పావై అంటే నోము అనీ అర్థాలు. తిరుప్‌పావై అంటే మేలిమినోము లేదా మేలినోము అని‌ అర్థం. తిరు, పావై రెండు పదాలు. తమిళ్ష్ భాష నిర్మాణం ప్రకారం ఈ రెండు పదాల మధ్యలో ప్ వచ్చి తిరుప్‌పావై అని అవుతుంది. తమిళ్ష్‌లో పావై అన్నది పదరూపం కాబట్టి తెలుగులో పా అక్షరానికి ప ఒత్తు పెట్టి తిరుప్పావై అని ప్రకటించడంవల్ల పావై అనే పదరూపం పాడవుతుంది. కనుక తెలుగులోనూ తిరుప్‌పావై
అనే ఉండడం మేలుగా ఉంటుంది.  

ఆళ్ష్వార్‌ పాడిన విష్ణుభక్తి గీతాన్ని పాసురమ్ అని అంటారు. పాసురమ్ అంటే జ్ఞానగీతం అని కూడా అర్థం ఉంది.‌‌ పాశురం కాదు. తమిళ్ష్ భాషలో శ కారం లేదు. కనుక శు కాదు సు అక్షరం ఉంటుంది. అందువల్ల తెలుగులోనూ సు అక్షరమే ఉండాలి. పాసురమ్ సంస్కృత పదం కాదు.
పాసు తరువాత ర కారం పక్కన అనుస్వరం కాదు (తమిళ్ష్ అక్షరాల పక్కన అనుస్వరం ఉండదు) మ కారపు పొల్లు (మ్) ఉండాలి.‌ పాసురమ్ అనడమే సరైంది.

తిరుప్‌పావై వంటి మేలి కృతులకు అనువాదాలు చిత్తశుద్ధితోనూ, సరైన 'చదువు'తోనూ, 'తెలివిడి'తోనూ, మేలైన 'భక్తి'తోనూ, నిజాయితీతోనూ ఉండాలి. 

1953 నుంచీ తెలుగులో తిరుప్‌పావై సరైన అనువాదంతోనూ, మూలంతోనూ, అవగాహనతోనూ రాలేదు. అందుకు భిన్నంగా 'తెలుగులో సరైన, మేలైన తిరుప్‌పావై'ను మీ ముందుకు తీసుకువచ్చాను. అందుకుని ఆశీర్వదించండి.

పాసురమ్ 5 

ఆణ్డాళ్, ఐదో పాసురమ్‌లో కృష్ణుణ్ణి మనసారా ధ్యానిస్తే ఏమౌతుందో తెలియజెబుతోంది... 

మూలం 

మాయనై, మన్ను వడమదురై మైన్దనై,
తూయపెరునీర్ యమునైత్ తుఱైవనై,
ఆయర్ కులత్తినిఱ్ తోన్ఱుమ్ అణివిళక్కై,
తాయైక్ కుడల్ విళక్కఞ్‌సెయ్ద దామోదరనై
తూయోమాయ్ వన్దు, నామ్ తూమలర్ తూవిత్తోళ్షుదు,
వాయినాఱ్ పాడి, మనత్తినాఱ్ సిన్దిక్కప్
పోయ పిళ్షైయుమ్ పుగుదరువాన్ నిన్ఱనవుమ్
తీయినిఱ్ దూసాగుమ్ సెప్పేలోరెమ్‌పావాయ్! 

తెలుగులో 

నల్లనివాణ్ణి, కొలువై ఉన్న మథురానాథుణ్ణి,
పవిత్రజలాల యమునాతటివాణ్ణి,
గోకులంలో వెలిసిన దివ్యదీపాన్ని,
కన్నతల్లి కడుపుకు కీర్తిని తెచ్చిన దామోదరుణ్ణి
శుచిగా వచ్చి, స్వచ్ఛమైన పూలు చల్లి ప్రార్థించి,
నోరారా గానం చేసి, మనసారా ధ్యానిస్తే
జరిగిపోయిన‌ తప్పులూ, జరగబోయే తప్పులూ
మంటల్లో దూదిపింజలై పోతాయి అని అందాం; ఓలాల నా చెలీ! 

అవగాహన 

"నల్లనివాణ్ణి" అని అంటూ ఆణ్డాళ్ కృష్ణుణ్ణి తెలియజేస్తోంది. తమిళ్ష్ పదం 'మాయన్'. మాయన్ అంటే మాయదారి అని కాదు. మాయన్ అనడం మాయను సూచించడం కాదు. మాయన్ అంటే నల్లనివాడు అని. పెరియ ఆళ్ష్వార్ ఒక సందర్భంలో కృష్ణుణ్ణి "ఇవన్ ఆయన్ అల్ల మాయన్" అని అన్నారు. అంటే వీడు గొల్లవాడు కాదు నల్లవాడు అని. అలా అంటూ కృష్ణుణ్ణి 'వీడు విష్ణువు' అని సూచించారు. తిరుమాల్ అన్న తమిళ్ష్ పదానికి విష్ణువు అని అర్థం. ఈ తిరుమాలన్ పదం తిరుమాయన్ అయిందని అదే మాయన్ అయిందని చెబుతారు. 

"నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు మహాశుగంబులున్
విల్లును దాల్చువాఁడు గడు విప్పగు వక్షమువాఁడు మేలు పైఁ
జల్లెడువాఁడు నిక్కిన భుజంబులవాఁడు యశంబు దిక్కులం
జల్లెడువాఁడు నైన రఘుసత్తముఁ డిచ్చుత మా కభీష్టముల్"  అని మన పోతన అన్నారు కదా. 

నల్లని రూపం కలవాడు అనే అర్థాన్ని ఇస్తూ కృష్ణుడికి శ్యామరూపః, కృష్ణవర్ణః వంటి నామాలు ఉన్నాయి. 

"కన్నతల్లి కడుపుకు కీర్తిని తెచ్చిన..." అని అనడం అద్వితీయమైన అభివ్యక్తి; ఆణ్డాళ్ మాత్రమే చెయ్యగల అభివ్యక్తి. 

ఈ పాసురమ్‌లో "జరిగిపోయిన తప్పులూ, జరగబోయే తప్పులూ మంటల్లో దూదిపింజలై పోతాయి..." అని ఆణ్డాళ్ చెప్పడం విశిష్టంగా ఉంది. ఇక్కడ ఆణ్డాళ్ ఇలా తప్పులు కాలి బూడిదవాలని కాకుండా మఱింకదేన్నైనా చెప్పి ఉండచ్చు. తప్పులు ఉండకూడదు అనే భావనతో ఈ మాటల్ని చెప్పింది ఆణ్డాళ్. ఇది అత్యుదాత్తమైన భావన. ఈ భావన మహోన్నతమైన మానసిక పరిణతికి రుజువు. జరిగిపోయిన తప్పులు మనందఱికీ పెనుహాని చేస్తూనే ఉన్నాయి‌; జరగబోయే తప్పులు తప్పకుండా మనకు పెనుహాని చేస్తాయి. కాబట్టి ఆ తప్పులు కాలి బూడిదై లేకుండాపోయి మనం మేలుగానూ,  క్షేమంగానూ బతకాలి; తథాస్తు. 



రోచిష్మాన్
9444012279

ఎ.ఐ. మూలంగా మిత్రుడు దేవనాద(థ)న్ (శ్రీపూర్ణం) సంగీతబద్ధం చేసిన  తమిళ్ష్ పాసురమ్ 5:

https://youtu.be/-rsyEgLR2zA?si=Z8L-rk1I5d5oVZtK

No comments:

Post a Comment