----------
తిరుప్‌పావై
-----------------------
మూలంలోని శైలితో, శిల్పంతో
తెలుగులో సరైన, మేలైన అనువాదం-
ధనుర్మాసం ఆరంభం. శ్రీవిల్లిపుత్తూర్ ఆలయం ప్రకారం ఇవాళ ధనుర్మాసం ఆరంభం.
ధనుర్మాసం తిరుప్‌పావై మాసం.
భారతదేశ భక్తి సాహిత్యంలో తిరుప్‌పావైకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కవిత్వం, భక్తి, తాత్త్వికతల పరంగా మనకు అలవాటైన సాహిత్యంలో తిరుప్‌పావై (తిరుప్పావై కాదు) ప్రముఖమైంది. తమిళ్ష్ వైష్ణవ సాహిత్యం నాలాయిర దివ్యప్రబన్దమ్‌లో (ప్రబంధం కాదు)
తిరుప్‌పావై ఒకటి ఆపై విశేషమైంది. తిరుప్‌పావై
ముప్పై పాసురాల సంప్రయోగం. తిరుప్‌పావై
పాసురాల్ని సంభావించింది, సంధానించింది, సమర్పించింది ఆణ్డాళ్ లేదా కోదై లేదా నాచ్చియార్.
తిరుప్‌పావైకు తొలి తెలుగు అనువాదం 1953లో వచ్చింది అని నా ఎఱుక. పరవస్తు వేంకటరంగాచార్యులు చేసిన అనువాదం అది. ఆ తరువాత మఱికొందఱు తిరుప్‌పావైకు తెలుగు అనువాదాలు చేశారు; చేస్తున్నారు. రమారమి తెలుగులో 200 తిరుప్‌పావై ఆనువాదాలు వచ్చుంటాయి.
తిరుప్‌పావై వంటి వాటికి అనువాదాలు చిత్తశుద్ధితోనూ, సరైన తెలివిడితోనూ, భక్తితోనూ ఉండాలి. కానీ తెలుగులో ఆ పని జరగలేదు. తిరుప్‌పావై తెలుగువాళ్లకు సరిగ్గా అందలేదు.
ఆణ్డాళ్ విరచిత తిరుప్‌పావైకు తెలుగు లిపిలో మూలాన్నీ, మూలంలోని శైలితో, శిల్పంతో
తెలుగు అనువాదాన్ని , అవగాహన్ను అందిస్తున్నాను...ఆస్వాదించండి.
-----------
తిరుప్‌పావై - పాసురమ్ 1
---------------
ఆణ్డాళ్, తొలి పాసురమ్‌లో (పాశురం కాదు) నారాయణుడు అనుగ్రహిస్తాడు నోము నోచుకుందాం, స్నానానికి వెళదాం రండి అంటూ గోపకన్యల్ని పిలుస్తోంది...
మూలం
మార్గళ్షిత్ తిఙ్గళ్ మదినిఱైన్ద నన్నాళాల్
నీరాడప్ పోదువీర్ పోదుమినో నేరిళ్షైయీర్!
సీర్‌మల్గుమ్ ఆయ్పాడిచ్ చెల్వచ్ చిరుమీర్గాళ్!
కూర్వేల్ కొడున్తొళ్షిలన్ నన్దగోబన్ కుమరన్
ఏరార్‌న్ద కణ్ణి యసోదైయిళఞ్‌సిఙ్గమ్
కార్మేనిచ్ చెఙ్గణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱై తరువాన్
పారోర్ పుగళ్ష్‌ప్ పడిన్దేలోరెమ్‌పావాయ్!
తెలుగులో
మార్గశిర మాసం జాబిల్లి నిండుగా నెలకొన్న శుభ దినం;
స్నానం చెయ్యాలనుకున్న వాళ్లలారా! రండి; నగలు పెట్టుకున్న వాళ్లలారా!
అందమైన గోకులంలోని సౌభాగ్యవతులైన కన్యల్లారా!
పదునైన శూలంతో ఉగ్రుడైన నందగోపుడి తనయుడు,
సుందర నయనాల యశోదకు సింహకిశోరుడు,
నల్లని తనువు, ఎఱ్ఱని కళ్లతో సూర్యచంద్రుల వంటి మోమువాడు
నారాయణుడే మనకు తప్పెటను ఇస్తాడు;
భూజనులందఱూ మెచ్చుకునేట్టుగా నోము నోచుకుందాం; ఓలాల నా చెలీ!
అవగాహన
"మార్గళ్షిత్ తిఙ్గళ్" అంటూ పాసురాన్ని మొదలుపెట్టింది ఆణ్డాళ్. మార్గళ్షి అంటే మార్గశిరం అనీ, తిఙ్గళ్ అంటే మాసం అనీ అర్థాలు. తిఙ్గళ్ అంటే జాబిల్లి అనే అర్థమూ ఉంది. జాబిల్లి స్త్రీత్వానికి ప్రతీక. ఆణ్డాళ్ తను ఒక స్త్రీ, నోము నోచుకునేందుకు తను స్త్రీలను పిలుస్తోంది. స్త్రీలు నోచుకునే మేలినోము(తిరుప్‌పావై) కాబట్టీ, విషయం స్త్రీ సంబంధితం కాబట్టీ ఇక్కడ తిఙ్గళ్ శబ్దాన్ని ప్రయోగించింది ఆణ్డాళ్.
ఈ పాసురమ్‌లో "నగలు పెట్టుకున్న వాళ్లలారా" అన్న సంబోధనను గమనించాలి. భక్తి భావనలకు ప్రతీకలుగా నగలను ఇక్కడ ఆణ్డాళ్ ప్రస్తావించింది. స్నానాన్ని దైవచింతనకు ప్రతీకగా చెప్పినట్టు తోస్తోంది. ఆణ్డాళ్ కాలంలో మార్గశిరంలో స్త్రీల నదీ స్నానాలు ఒక ఉత్సవంలా జరిగేవని తెలుస్తోంది.
నోము నోచుకునే కన్యలు నోములో భాగంగా తప్పెటను వాయిస్తారు. తప్పెటను అనుగ్రహానికి ప్రతీకగానూ చెబుతారు. ఆ తప్పెట లేదా అనుగ్రహాన్ని నారాయణుడే ఇస్తాడు అని సూచిస్తూ "నారాయణుడే మనకు తప్పెటను ఇస్తాడు" అని తెలియజెప్పింది ఆణ్డాళ్.
రోచిష్మాన్
9444012279
ఎ.ఐ. మూలంగా మిత్రుడు దేవనాద(థ)న్ (శ్రీపూర్ణం) సంగీతబద్ధం చేసిన పాసురమ్ 1:
https://youtu.be/Nwsa63qXnU0?si=LlvkR4zhXb1ogsq_
No comments:
Post a Comment