----------
తిరుప్‌పావై - పాసురమ్ 3
-----------------------
మూలంలోని శైలితో, శిల్పంతో
తెలుగులో సరైన, మేలైన అనువాదంగా తిరుప్‌పావై!
భారతదేశ భక్తి సాహిత్యంలో తిరుప్‌పావైకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కవిత్వం, భక్తి, తాత్త్వికతల పరంగా మనకు అలవాటైన సాహిత్యంలో తిరుప్‌పావై ప్రముఖమైంది. తమిళ్ష్ వైష్ణవ సాహిత్యం నాలాయిర దివ్యప్రబన్దమ్‌లో (దివ్యప్రబంధం కాదు)
తిరుప్‌పావై ఒకటి ఆపై విశేషమైంది. తిరుప్‌పావై
ముప్పై పాసురాల సంప్రయోగం. తిరుప్‌పావై
పాసురాల్ని సంభావించింది, సంధానించింది, సమర్పించింది ఆణ్డాళ్ లేదా కోదై లేదా నాచ్చియార్. ('ఆండాళ్' అని రాయడం సరికాదు)
తిరు అంటే మేలిమి అనీ, పావై అంటే నోము అనీ అర్థాలు. తిరుప్‌పావై అంటే మేలిమినోము లేదా మేలినోము అని అర్థం. తిరు, పావై రెండు పదాలు. తమిళ్ష్ భాష నిర్మాణం ప్రకారం ఈ రెండు పదాల మధ్యలో ప్ వచ్చి తిరుప్‌పావై అని అవుతుంది. తమిళ్ష్‌లో పావై అన్నది పదరూపం కాబట్టి తెలుగులో పా అక్షరానికి ప ఒత్తు పెట్టి తిరుప్పావై అని ప్రకటించడంవల్ల పావై అనే పదరూపం పాడవుతుంది. కనుక తెలుగులోనూ తిరుప్‌పావై
అనే ఉండడం మేలుగా ఉంటుంది.
ఆళ్ష్వార్ పాడిన విష్ణుభక్తి గీతాన్ని పాసురమ్ అని అంటారు. పాసురమ్ అంటే జ్ఞానగీతం అని కూడా అర్థం ఉంది. పాశురం కాదు. తమిళ్ష్ భాషలో శ కారం లేదు. కనుక శు కాదు సు అక్షరం ఉంటుంది. అందువల్ల తెలుగులోనూ సు అక్షరమే ఉండాలి. పాసురమ్ సంస్కృత పదం కాదు.
పాసు తరువాత ర కారం పక్కన అనుస్వరం కాదు (తమిళ్ష్ అక్షరాల పక్కన అనుస్వరం ఉండదు) మ కారపు పొల్లు (మ్) ఉండాలి. పాసురమ్ అనడమే సరైంది.
తిరుప్‌పావై వంటి మేలి కృతులకు అనువాదాలు చిత్తశుద్ధితోనూ, సరైన 'చదువు'తోనూ, 'తెలివిడి'తోనూ, మేలైన 'భక్తి'తోనూ, నిజాయితీతోనూ ఉండాలి.
1953 నుంచీ తెలుగులో తిరుప్‌పావై సరైన అనువాదంతోనూ, మూలంతోనూ, అవగాహనతోనూ రాలేదు. అందుకు భిన్నంగా 'తెలుగులో సరైన, మేలైన తిరుప్‌పావై'ను మీ ముందుకు తీసుకువచ్చాను. అందుకుని ఆశీర్వదించండి.
పాసురమ్ 3
మూడో పాసురమ్‌లో నోము కోసమని స్నానం చేస్తే ఏం జరుగుతుందో ఆణ్డాళ్ చెబుతోంది...
మూలం
ఓఙ్గి ఉలగళన్ద ఉత్తమన్ పేర్పాడి
నాఙ్గళ్ నమ్‌పావైక్కు సాఱ్ట్రి నీరాడినాల్
తీఙ్గిన్ఱి నాడెల్లామ్ తిఙ్గళ్ ముమ్మారిపెయ్దు
ఓఙ్గు పెరుఞ్‌సెన్నెలూడు కయలుగళ,
పూఙ్గువళైప్ పోదిల్ పొఱివణ్డు కణ్పడుప్పత్
తేఙ్గాదే పుక్కిరున్దు సీర్త ములైపఱ్ట్రి
వాఙ్గక్ కుడమ్ నిఱైక్కుమ్ వళ్ళఱ్ పెరుమ్ పసుక్కళ్;
నీఙ్గాద సెల్వమ్ నిఱైన్దేలోరెమ్‌పావాయ్!
తెలుగులో
విజృంభించి లోకాన్ని కొలిచిన ఉత్తముడి నామ గానం చేసి,
మనం నోము చేసుకోవాలనుకుని స్నానం చేస్తే
క్రమం తప్పకుండా దేశమంతా నెలకు మూడు వానలు కురుస్తాయి,
ఏపుగా ఎదిగిన ఎఱ్ఱని వరిచేను నీళ్లల్లో చేపలు తుళ్లుతూ ఉంటాయి,
విచ్చుకున్న కలువ పూలపై తుమ్మెదలు కళ్లు వాల్చుకుని ఉంటాయి,
ధైర్యంగా కాళ్ల దగ్గర కూర్చుని బరువైన పొదుగుల్ని పట్టుకుని
పితికితే కడవల్ని నింపుతాయి పెద్ద పెద్ద పాడి ఆవులు;
తొలగిపోని ఐశ్వర్యం నిండుగా ఉంటుంది; ఓలాల నా చెలీ!
అవగాహన
ఈ పాసురమ్‌లో "విజృంభించి లోకాన్ని కొలిచిన ఉత్తముడు" అనడం విష్ణువు వామనావతారంలో వచ్చి విజృంభించి తన పాదంతో లోకాన్ని ఆక్రమించడాన్ని సూచిస్తోంది.
"ఏపుగా ఎదిగిన ఎఱ్ఱని వరిచేను నీళ్లల్లో చేపలు తుళ్లుతూ ఉంటాయి" అనీ, "విచ్చుకున్న కలువ పూలపై తుమ్మెదలు కళ్లు వాల్చుకుని ఉంటాయి" అనీ చెబుతూ చక్కని గ్రామీణ దృశ్యానికి చిక్కని పద చిత్రీకరణ చేసింది ఆణ్డాళ్.
ఐశ్వర్యం దేవతల కటాక్షానికి, పాడి ఆవులు కటాక్షాన్నిచ్చే దేవతలకు, బరువైన పొదుగు ఆరాధనకు, ధైర్యంగా కాళ్ల దగ్గఱ కూర్చోవడం ధైర్యం చేసి దేవత శరణుపొందడం వంటి విషయాలకు ప్రతీకలుగా అర్థమౌతున్నాయి. భక్తికి ముఖ్యంగా ఉండాల్సింది ధైర్యం. అందుకే ఆణ్డాళ్ ధైర్యంగా అన్న శబ్దాన్ని ప్రయోగించింది.
రోచిష్మాన్
9444012279
ఎ.ఐ. మూలంగా మిత్రుడు దేవనాద(థ)న్ (శ్రీపూర్ణం) సంగీతబద్ధం చేసిన తమిళ్ష్ పాసురమ్ 3:
https://youtu.be/4Y_4HU6qC_I?si=aY-758yyuGTzzX80
No comments:
Post a Comment