వైకుంఠుడి ఏకాదశి
'వికుంఠం' అనే పదానికి 'విష్ణులోకం' అనే అర్థాన్ని చెబుతాయి నిఘంటువులు. ఆ విష్ణులోకంలో ఉండేవాడు కాబట్టి- శ్రీమన్నారాయణుడికి 'వైకుంఠుడు' అనే పేరు స్థిర పడింది. నిజానికి వికుంఠం అనేది అత్యున్నత ఆధ్యాత్మిక సాధనకు ఫలితంగా లభించే లోకోత్తర అనుభూతి. వికుంఠుడైన మనిషిలోని దైవత్వానికి స్థావరమే- వైకుంఠం. కుంఠుడు అనే మాటకు మూర్ఖుడని అర్థం. చెడు పట్ల విశేషంగా ఆకర్షితులై, లోకంలో దురాచారాలకు పాల్పడేవారంతా కుంఠులే! రాక్షస అంశ మితిమీరినప్పుడు మాన వుడు దానవుడు అవుతాడు. మురాసురుడికి అనుచరుడవుతాడు. ఆ మురాసురుణ్ని తుదముట్టించడానికి మనిషిలో ఆవిర్భవించే దైవశక్తికి సంకేతమే- ఏకాదశి!
మహావిష్ణువు దివ్యసంకల్పంలోంచి రాక్షస సంహారం నిమిత్తం ఆవిర్భవించిన స్త్రీ శక్తి స్వరూపాన్ని ఏకాదశిగా సంభావించాయి పురాణాలు. ధ్యాన, ఉపవాస, ఉపాసనాది ఆధ్యాత్మిక సాధనల ద్వారా లోపలి కుంఠుణ్ని సమూలంగా నిర్మూలించిన నాడు-హృదయ కమలంలో దైవాంశ విచ్చుకుంటుంది. ఆ పరమాద్భుత స్థితికి వికుంఠం అని పేరు. కుంఠుణ్ని సంహరించిన ప్రతి సాధకుడూ వికుంఠుడే. సిద్ధి పొందడం ద్వారా వికుంఠుడికి దక్కేది వైకుంఠం! అందుకే 'వికుంఠ' అనే పుణ్యస్త్రీకి జన్మించడం వల్ల శ్రీహరి వైకుంఠుడయ్యాడంది అమరకోశం.
సాధకుడికి సిద్ధిని అందించే గొప్ప తిథి ఏకాదశి. అది పదకొండో తిథి. అంటే మని షిని లోబర్చుకుని ఒక ఆట ఆడించే పది ఇంద్రియాల ప్రభావ తీవ్రతను నియంత్రిస్తుం దని అర్థం. అలా ఏకాదశి నియమాలను ఏకా గ్రతతో, శ్రద్ధగా పాటించి, సిద్ధి పొందిన వైఖా నసుడి కథను పురాణాలు వివరించాయి. తద్వారా ఆయన తన తండ్రికి స్వర్గాన్ని ప్రసా దించాడని చెప్పాయి. అలా స్వర్గసుఖాలకు కారణమయ్యే ధనుర్మాసంలోని ఏకాదశికి-సౌఖ్య'ద' ఏకాదశి అని, మోక్షప్రాప్తికి దోహద పనుల్ ఎర్య ఆర్థంలో- 'మోక్ష ఏకాదశి' అనీ ప్రసిద్ధి ఏర్పడింది.
దక్షిణాదిలో వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా వ్యవహరిస్తారు. దేవతల సంఖ్య మూడు కోట్లని, ముప్పది మూడు కోట్లని లెక్కలున్నాయి. నిజానికి కోటి అనేది సంఖ్యాశాస్త్ర సంకేతం కాదు. ఏకాదశ రుద్రులు(11), ద్వాదశ ఆదిత్యులు (12), అష్టవసువులు (8), ఇద్దరు అశ్వినీ దేవతలను కలిపి ఆ సంఖ్య ముప్పది మూడు అంది వేదం. సృష్టి నిర్వహణకు వారందరూ బాధ్యులే. వారినే ముక్కోటి దేవతలుగా పురాణాలు అభివర్ణించాయి. వారంతా ఒక్కటై మహావిష్ణువును సేవించడానికి తరలివచ్చే తిథిని ముక్కోటి ఏకాదశి అన్నాయి. వారి కోసం ప్రత్యేకంగా తెరచుకునే ఉత్తర ద్వారం... స్వర్గ ద్వారం. అందుకే అది స్వర్గ ద్వార ఏకాదశి అయింది. మనిషికి జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే మూడు అవస్థలుంటాయి. వాటి అంచుకు 'కోటి' అని పేరు. ఆ అంచులు దాటించి జీవుడికి జీవన్ముక్తిని అనుగ్ర హిస్తుందనే విశ్వాసంతో మనవారు దాన్ని ముక్కోటి ఏకాదశి అన్నారు. ఆనాడు ముక్కోటి దేవతలతోపాటు తామూ ఉత్తర ద్వారదర్శనం చేయాలని భక్తులు ఉవ్విళ్లూరుతారు.
దర్శనమనేది మనం చేసేది కాదు- దేవుడిచ్చేది!
ఎర్రాప్రగడ రామకృష్ణ
No comments:
Post a Comment