🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷
*జిజ్ఞాసువుల ప్రశ్నలకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి సమాధానాలు:*
ప్ర : *కలికాలంలో యజ్ఞయాగాదులు ధర్మాలు, జ్ఞాన వైరాగ్యాలు, సదా చారాలు, శాస్త్రజ్ఞనం కష్టం కదా! పైగా - అంతా అయోమయం ఎక్కువగా ఉంటోంది. మరి సులభంగా తరించే ఉపాయం ఏమిటి?*
జ : *మీరన్నది నిజమే. ధర్మాలు స్పష్టంగా చెప్పలేని అయోమయావస్థ ఈ యుగంలో సహజమే. కానీ సంప్రదాయబద్ధంగా వచ్చే సదాచారాలను సాధ్యమైనంత మేరకు పాటిస్తూ భగవద్భక్తి కలిగిఉంటే కలిలో తరించవచ్చు.*
*విష్ణుం శివం వా భజతాం గురోః పిత్రోశ్చ సేవినాం*।
*గో వైష్ణవ మహాశైవ తులసీ సేవినామపి*॥
*నస్యాత్కలికృతో దోషః కాశ్యాం నివసతామపి*।
*కలౌ గురూణాం భజనమీశ భక్త్యధికం స్మృతమ్* ||
అని ధర్మశాస్త్ర వచనం. *"విష్ణువునుగానీ, శివునిగానీ భజించుట, గురువులను, తల్లిదండ్రులను సేవించుట, గోవులను, విష్ణుభక్తులను, శివభక్తులను, తులసిని సేవించుట - చేయు వారికి కలిదోషమంటదు. కాశీవాసము కూడా అట్టిదే. కలియుగంలో గురుభజన, ఈశ్వరభక్తి అధిక ప్రభావవంతమైనవి.” కలియుగ మందు సత్కర్మలను స్మరించినప్పటికీ ఫలితమిస్తాయి. అదేవిధంగా వేదాంత విజ్ఞాన శ్రవణం కూడా తరింపజేస్తుంది. ఆ జ్ఞానయోగం అసాధ్యమైనవారికి భక్తియోగం సులభ తరుణోపాయం.*
*"ప్రవిష్టః కర్ణరంధ్రీణ స్వానాం భావ సరోరుహమ్"* -
*భగవత్కథాశ్రవణం వల్ల శ్రవణరంధ్రాల ద్వారా పరమాత్మ మన హృదయ కమలంలో ప్రవేశిస్తాడని శ్రీమద్భాగవతం చెప్తోంది. అలా హృదయంలో ప్రవేశించిన పరమాత్మ మనలో రాగద్వేషాలను దూరం చేసి భగవదనుభూతిని కలిగిస్తాడు. మరి ఇప్పటివరకూ ఎన్నోసార్లు భగవత్కథని విన్నామంటే.... విన్నామంతే.. వినవలసినట్లుగా విన్నామో లేదో ఎవరికి వారికే తెలుస్తుంది. శాస్త్రం చెప్పినట్లు శ్రద్ధగా ఒక్కసారి భగవత్కథాశ్రవణం చేసినా చాలు మన బ్రతుకుని తరింపజేయడానికని చెప్పారు.*
*దీనికి పెద్ద ఉదాహరణ పరీక్షిన్మహారాజు* .
*తపన ఉంటే తరించే మార్గాన్ని భగవంతుడే చూపిస్తాడు.*
*ఋషిపీఠం*
🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷
No comments:
Post a Comment