* తులసీమాలల ప్రత్యేత ఏమిటి?
* మన మనసుల తలుపులు తీస్తే ... ?
----------
'సరిగ్గా' తిరుప్‌పావై
పాసురమ్ 10
-------------------
మూలంలోని శైలితో, శిల్పంతో
తెలుగులో సరైన, మేలైన అనువాదంగా తిరుప్‌పావై!
పాసురమ్ 10
ఆణ్డాళ్, తలుపేసుకుని పడుకున్న తన తోటి గోపకన్యను మెలకువలోకి వచ్చి తలుపు తియ్యమంటూ పదో పాసురాన్ని ఇదిగో ఇలా ప్రవచిస్తోంది; ఆలకిద్దాం రండి...
మూలం
నోఱ్ట్రుచ్ చువర్గమ్ పుగుగిన్ఱ అమ్మనాయ్!
మాఱ్ట్రముమ్ తారారో వాసల్ తిఱవాదార్?
నాఱ్ట్రత్‌తుళ్షాయ్‌ముడి నారాయణన్ నమ్మాల్
పోఱ్ట్రప్ పఱై తరుమ్ పుణ్ణియనాల్ పణ్డొరునాళ్
కూఱ్ట్రత్తిన్ వాయ్‌వీళ్ష్‌న్ద కుమ్బకరుణనుమ్
తోఱ్ట్రుమ్ ఉనక్కే పెరున్తుయిల్‌తాన్ తన్దానో?
ఆఱ్ట్ర అనన్దల్ ఉడైయాయ్! అరుఙ్గలమే!
తేఱ్ట్రమాయ్ వన్దు తిఱవేలోరెమ్‌పావాయ్!
తెలుగులో
నోము నోచుకుని స్వర్గంలోకెళ్లాల్సిన మారాణీ!
తలుపు తియ్యని వాళ్లు బదులు కూడా ఇవ్వరా?
తులసీమాలలవల్ల పరిమళిస్తున్న తలతో నారాయణుడు, మనం
స్తుతిస్తే తప్పెటను ఇచ్చే పుణ్యాత్ముడు; పూర్వం ఒకనాడు
మృత్యువు నోట్లో పడి కుంభకర్ణుడు
ఓడిపోయాక నీకు నిద్రను ఇచ్చేశాడా?
మితిమీఱిన మత్తులో ఉన్నదానా! అరుదైన ఆభరణమా!
మెలకువలోకి వచ్చి తలుపు తియ్యి; ఓలాల నా చెలీ!
అవగాహన
ఈ పాసురమ్‌లో నోము నోచుకుంటే స్వర్గం లేదా దైవసన్నిధికి చేరుకోవచ్చు, దైవసన్నిధికి చేరాలంటే నోము నోచుకోవాలి అలాంటిది ఇలా తలుపేసుకుని పడుకుండిపోవడం ఏమిటి? పిలుస్తున్నా తలుపు తియ్యకపోవడమే కాకుండా బదులు కూడా పలకవా? అని ప్రశ్నిస్తోంది ఆణ్డాళ్.
తులసీమాలలకు ఒక ప్రత్యేకమైన పరిమళం ఉంటుంది. కనుక ఆ తులసీమాలలు వేసుకున్న వాళ్ల తలలు పరిమళిస్తాయి. ఇక్కడ పరిమళం పవిత్రతకు ప్రతీకగా తోస్తోంది. పవిత్రత తలపుల్లో ఉంటుంది. తలపులు తల నుంచి వస్తాయి. అందుకే ఆణ్డాళ్ తులసీమాలల వల్ల పరిమళిస్తున్న వక్షంతో అనకుండా తలతో అని అంది.
మనం స్తుతిస్తే పుణ్యాత్ముడు నారాయణుడు తప్పెటను ఇస్తాడు అని ఆణ్డాళ్ చెబుతోంది. నోములో స్త్రీలు తప్పెటను వాయించడం ఒక అంశం. తప్పెట అన్నది అనుగ్రహానికి ప్రతీక. మనం స్తుతిస్తే నారాయణుడు అనుగ్రహిస్తాడని కూడా చెప్పడమే ఇది. ఒకరు దేన్ని ఆకాంక్షిస్తారో లేదా అడుగుతారో వారు దాని చేత తీసుకోబడతారు. వారికి ఆ ఆత్మ తన నిజనైజాన్ని తెఱుస్తుంది. "యమే వైష వృణుతే తేన లభ్యస్థైష ఆత్మ వివృణుతే తనూం స్వాం" అని కఠ ఉపనిషత్ (అధ్యాయం 2 శ్లోకం 23లో) చెబుతోంది. దైవాన్ని ఆకాంక్షిస్తే లేదా దైవాన్నే కోరుకుంటే మనం దైవం చేత పొందబడిన వాళ్లమౌతాం ఆపై దైవం నిజనైజం మనకు తెఱుచుకుంటుంది.
మత్తు అసురలక్షణం. అందుకే ఆణ్డాళ్ కుంభకర్ణుణ్ణి ఉటంకించింది. ఆ గోపకన్యే కాదు మనమూ మితి మీఱిన మత్తులోనే ఉన్నాం. అసుర లక్షణమైన మత్తును మనం వీడాలి. మెలకువలోకి వచ్చి తలుపు తియ్యమని గోపకన్యకు చెప్పినట్టే ఆణ్డాళ్ మనకూ చెబుతోంది. మనం మన మనసుల తలుపులు తీస్తే మన లోపలికి సురత్వం వస్తుంది. తథాస్తు..
రోచిష్మాన్
9444012279
ఎ.ఐ. మూలంగా మిత్రుడు దేవనాద(థ)న్ (శ్రీపూర్ణం) సంగీతబద్ధం చేసిన తమిళ్ష్ పాసురమ్ 10
https://youtu.be/ftH1uXikKEA?si=R6zcDch4V1A8Lgsk
No comments:
Post a Comment