*తెలుగులో తొలిసారి ఆణ్డాళ్ ప్రస్తావన చేసింది అన్నమయ్యేనా?
"తలుపు తియ్యి" అని ఆణ్డాళ్ ఎందుకు అంటోంది?
----------
'సరిగ్గా' తిరుప్‌పావై
పాసురమ్ 7
-------------------
మూలంలోని శైలితో, శిల్పంతో
తెలుగులో సరైన, మేలైన అనువాదంగా తిరుప్‌పావై!
భారతదేశ భక్తి సాహిత్యంలో తిరుప్‌పావైకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కవిత్వం, భక్తి, తాత్త్వికతల పరంగా మనకు అలవాటైన సాహిత్యంలో తిరుప్‌పావై ప్రముఖమైంది. తమిళ్ష్ వైష్ణవ సాహిత్యం నాలాయిర దివ్యప్రబన్దమ్‌లో (దివ్యప్రబంధం కాదు)
తిరుప్‌పావై ఒకటి ఆపై విశేషమైంది. తిరుప్‌పావై
ముప్పై పాసురాల సంప్రయోగం. తిరుప్‌పావై
పాసురాల్ని సంభావించింది, సంధానించింది, సమర్పించింది ఆణ్డాళ్ లేదా కోదై లేదా నాచ్చియార్. (ఆండాళ్ అని రాయడం సరికాదు)
తిరు అంటే మేలిమి అనీ, పావై అంటే నోము అనీ అర్థాలు. తిరుప్‌పావై అంటే మేలిమినోము లేదా మేలినోము అని అర్థం. తిరు, పావై రెండు పదాలు. తమిళ్ష్ భాష నిర్మాణం ప్రకారం ఈ రెండు పదాల మధ్యలో ప్ వచ్చి తిరుప్‌పావై అని అవుతుంది. తమిళ్ష్‌లో పావై అన్నది పదరూపం కాబట్టి తెలుగులో పా అక్షరానికి ప ఒత్తు పెట్టి తిరుప్పావై అని ప్రకటించడంవల్ల పావై అనే పదరూపం పాడవుతుంది. కనుక తెలుగులోనూ తిరుప్‌పావై
అనే ఉండడం మేలుగా ఉంటుంది.
ఆళ్ష్వార్ పాడిన విష్ణుభక్తి గీతాన్ని పాసురమ్ అని అంటారు. పాసురమ్ అంటే జ్ఞానగీతం అని కూడా అర్థం ఉంది. పాశురం కాదు. తమిళ్ష్ భాషలో శ కారం లేదు. కనుక శు కాదు సు అక్షరం ఉంటుంది. అందువల్ల తెలుగులోనూ సు అక్షరమే ఉండాలి. పాసురమ్ సంస్కృత పదం కాదు.
పాసు తరువాత ర కారం పక్కన అనుస్వరం కాదు (తమిళ్ష్ అక్షరాల పక్కన అనుస్వరం ఉండదు) మ కారపు పొల్లు (మ్) ఉండాలి. పాసురమ్ అనడమే సరైంది.
తిరుప్‌పావై వంటి మేలి కృతులకు అనువాదాలు చిత్తశుద్ధితోనూ, సరైన 'చదువు'తోనూ, 'తెలివిడి'తోనూ, మేలైన 'భక్తి'తోనూ, నిజాయితీతోనూ ఉండాలి.
1953 నుంచీ తెలుగులో తిరుప్‌పావై సరైన అనువాదంతోనూ, మూలంతోనూ, అవగాహనతోనూ రాలేదు. అందుకు భిన్నంగా 'తెలుగులో సరైన, మేలైన తిరుప్‌పావై'ను మీ ముందుకు తీసుకువచ్చాను. అందుకుని ఆశీర్వదించండి.
పాసురమ్ 7
ఆణ్డాళ్ ఏడో పాసురమ్‌లో మొద్దు నిద్రపోతున్న గోపకన్యను మేలుకోమంటోంది; పక్షులు బారులుగా చేరడం, గాజుల గలగలలు, పెరుగు చిలుకుతున్న చప్పుళ్లతో, చక్కటి చిత్రణతో ఒకప్పటి పల్లె దృశ్యాన్ని ఈ పాసురమ్ మనకు రుచి చూపిస్తోంది; ఇదిగో ఇలా ...
మూలం
కీసుకీసెన్ఱెఙ్గుమ్ ఆనైచ్చాత్తన్ కలన్దు
పేసిన పేచ్చరవమ్ కేట్టిలైయో? పేయ్‌ప్‌పెణ్ణే!
కాసుమ్ పిఱప్పుమ్ కలకలప్పక్ కైపేర్తు
వాస నఱుఙ్‌కుళ్షల్ ఆయ్‌చ్చియర్ మత్తినాల్
ఓసై పడుత్త తయిర్ అరవఙ్‌కేట్టిలైయో?
నాయగప్ పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్తి,
కేసవనైప్ పాడవుమ్ నీ కేట్టే కిడత్తియో?
తేసమ్ ఉడైయాయ్! తిఱవేలోరెమ్‌పావాయ్!
తెలుగులో
కిచకిచమంటూ అంతటా భరద్వాజ పక్షులు బారులుగా చేరి
పలికిన పలుకుల చప్పుళ్లు వినిపించడం లేదా? మతిమాలినదానా!
కాసులపేరులు, గాజులు గలగలమనేట్టుగా చేతుల్ని ఆడిస్తూ
కేశాలు పరిమళించే గోపస్త్రీలు కవ్వంతో
సవ్వడి వచ్చేట్టుగా చిలుకుతూంటే పెరుగు చప్పుడు వినిపించడం లేదా?
రాణమ్మా ! ఆడపిల్లా! నారాయణమూర్తీ,
కేశవా అని పాడుతున్నా విని పడుకున్నావా?
తేజస్వినీ! తలుపు తియ్యి; ఓలాల నా చెలీ!
అవగాహన
ఈ పాసురమ్‌లో
"సవ్వడి వచ్చేట్టుగా చిలుకుతూంటే పెరుగు చప్పుడు వినిపించడం లేదా?" అని ఆణ్డాళ్ అన్నది విన్నాక
"ఘుమ్మనియెడి శ్రుతి గూఁడఁగను
కమ్మని నేతులు కాఁగఁగఁ జెలఁగె"
అని అన్న అన్నమయ్య మాటలు కూడా తలపుకు వస్తున్నాయి. నెయ్యి కాగే శబ్దానికి ఘుమ్మనడం అనేది శ్రుతి అయిందని గొప్పగా చెప్పారు అన్నమయ్య. నెయ్యి కాగే శబ్దాన్ని అన్నమయ్య ముచ్చటిస్తే ఆణ్డాళ్ పెరుగు చిలికే సవ్వడిని ముచ్చటిస్తోంది.
"వాడే వేంకటేశుడనే వాడే వీడు" అన్న సంకీర్తన రెండో చరణంలో అన్నమయ్య
"పెరియాళువారి బిడ్డ పిసికి
విరుల దండల మెడవేసిన వాడు"
అంటూ ఆణ్డాళ్ ప్రస్తావన చేశారు. అంతేకాకుండా
"చూడరమ్మ సతులాల సోబాన బాడరమ్మ కూడుకున్నది పతిఁ జూడి కుడుత నాచారి" అని మొదలయ్యే సంకీర్తనలోనూ...
"ఎంత చనువిచ్చితివో యీపై నీపై వెదజల్లీ
కొంతపు జూపుల చూడి కొడుత నాచారి" అని మొదలయ్యే సంకీర్తనలోనూ...
పూర్తిగా ఆణ్డాళ్ గుఱించే నినదించారు అన్నమయ్య. తమిళ్ష్ భాషలో 'సూడిక్కొడుత్త నాచ్చియార్' అంటారు. దాన్ని "చూడి కుడుత నాచారి" అని అన్నారు అన్నమయ్య. అన్నమయ్య కాలానికే ఆణ్డాళ్ ఊసు తెలుగులో తిరుగాడుతూ ఉండేదా? లేకపోతే తెలుగులో తొలిసారి అణ్డాళ్ ప్రస్తావనను చేసినది అన్నమయ్యేనా?
ఆలయంలోని కృష్ణుడి కోసం కట్టిన పూమాలల్ని తండ్రి విష్ణుచిత్తుడికి తెలియకుండా అనుదినమూ తను వేసుకుని కృష్ణుడికి తగ్గట్టుగా ఉన్నానా అని అద్దంలో చూసుకుంటూ ఉండేది కోదై. తను వేసుకుని చూసుకున్న మాలల్ని ఆలయ దేవుడి కోసం పంపేది. ఇలా కోదై వేసుకున్న మాలలే ఆలయ దేవుడికి అలంకరించబడేవి. ఒకనాడు ఈ సంగతి తెలుసుకున్న విష్ణుచిత్తుడు కోదైను కోప్పడి కోదై వేసుకున్న పూమాలను పక్కన పెట్టేసి ఇంకో మాలను కట్టి దేవుడికి వేశాడు. ఆనాటి రాత్రి విష్ణుచిత్తుడి కలలోకి కృష్ణుడు వచ్చి కోదై ధరించిన మాలలే తనకు తగినవనీ, వాటినే తనకు వెయ్యమనీ చెప్పాడు. ఆ తరువాత నుంచీ కోదై వేసుకున్న పూమాలలే ఆలయ దేవుడు రంగపతి లేదా రంగమన్నార్‌కు చేరేవి. అందువల్ల కోదైకు 'సూడిక్కొడుత్త నాచ్చియార్' అన్న పేరు వచ్చింది. సూడి కొడుత్త నాచ్చియార్ అంటే వేసుకున్న ఇచ్చిన నాచ్చియార్ అని అర్థం. ఆణ్డాళ్‌కు 'సూడిక్కొడుత్త సుడర్ కొడి' అన్న పేరు కూడా ఉంది. సూడిక్కొడుత్త సుడర్ కొడి అంటే 'వేసుకుని ఇచ్చిన జ్వాలా వల్లరి' అని అర్థం. ఇలా వేసుకుని తీసిన మాలలను ఇచ్చినది కనుక కోదై 'ఆముక్త మాల్యద'గానూ స్థిర పడింది.
భరద్వాజ పక్షుల కిచకిచలు, కాసుల పేర్ల, గాజుల గలగలలు, కవ్వంతో పెరుగు చిలికితే వచ్చే సవ్వడులు మనకు ఎప్పటికీ కావాల్సినవే. అవే మనలోంచి మనల్ని లేపగలవేమో? మనం మన యాంత్రికత నుండి మేలుకోవడానికి అవే అత్యవసరమైనవేమో?
"నారాయణమూర్తీ, కేశవా అని పాడుతున్నా వినిపడుకున్నావా?" అని ఆణ్డాళ్ అన్నది మనలో ప్రతి ఒక్కరినీ ఉద్దేశించి కూడా. భగవన్నామాలు ఎంతగా వినిపిస్తున్నా మనం మొద్దు నిద్రలోంచి లేవడం లేదు. మనకు దైవచైతన్యం రావడం లేదు. అందుకే ఆణ్డాళ్ "తలుపు తియ్యి" అంటోంది. తలుపు తియ్యమని అనడమంటే మూసుకుని ఉన్న మన మనసుల తలుపులను తెఱవమని చెప్పడమే. ఆణ్డాళ్ మాటల్ని విందాం. మనమూ మన మనసుల తలుపులు తెఱుద్దాం.
రోచిష్మాన్
9444012279
ఎ.ఐ. మూలంగా మిత్రుడు దేవనాద(థ)న్ (శ్రీపూర్ణం) సంగీతబద్ధం చేసిన తమిళ్ష్ పాసురమ్ 7:
https://youtu.be/iRGzGnuntBI?si=8rYR1Cm3o4tysi4P
No comments:
Post a Comment