Monday, December 29, 2025

 * తెల్లవాఱుతోంది, చీకటి‌ తొలగిపోయింది అని గొప్పగా ఎలా చెప్పింది ఆణ్డాళ్?

* కాషాయం ఎవరి రంగు?

* 'మాటలమంచి' అంటే ఏమిటి?

----------
'సరిగ్గా' తిరుప్‌పావై 
   14
-------------------

మూలంలోని శైలితో, శిల్పంతో
తెలుగులో సరైన, మేలైన అనువాదంగా తిరుప్‌పావై!

పాసురమ్ 14


ఆణ్డాళ్ పద్నాల్గో పాసురమ్‌లో నిద్రలో ఉన్న గోపకన్యను మేలుకోమనీ, మేలుకుని‌ దైవాన్ని గానం చెయ్యమనీ అంటోంది; విందాం రండి... 

మూలం 

ఉఙ్గళ్ పుళ్షైక్కడైత్ తోట్టత్తు వావియుళ్
సెఙ్‌కళ్షునీర్ వాయ్‌నెగిళ్ష్‌న్దామ్బల్‌వాయ్ కూమ్బిన కాణ్
సెఙ్గఱ్‌పొడిక్కూఱై వెణ్పల్ తవత్తవర్
తఙ్గళ్ తిరుక్కోయిఱ్ సఙ్గిడువాన్ పోదన్దార్
ఎఙ్గళై మున్నమ్ ఎళ్షుప్పువాన్ వాయ్‌పేసుమ్
నఙ్గాయ్! ఎళ్షున్దిరాయ్; నాణాదాయ్! నావుడైయాయ్!
సఙ్గొడు సక్కరమ్ ఏన్దుమ్ తడక్కైయన్
పఙ్గయక్ కణ్ణానైప్ పాడేలోరెమ్‌పావాయ్!


తెలుగులో 

మీ ఇంటి వెనుక ఉన్న తోటలోని కొలనులో
ఎఱ్ఱతామరల రేకులు విరిసి, కలువల రేకులు మూసుకున్నాయి చూడు;
కాషాయ వస్త్రాలతో, తెల్లటి పలువరుస ఉన్న తపస్వులు
గుళ్లల్లో శంఖం ఊదడానికి వెళుతున్నారు
మమ్మల్ని పెందరాడే లేపుతాను అని అన్న
భామా ! మేలుకో; సిగ్గులేనిదానా!, మాటలమంచీ!
శంఖు, చక్రం ఉన్న పెద్ద చేతులవాణ్ణి,
కలువ కళ్లవాణ్ణి గానం చెయ్యి; ఓలాల నా చెలీ!


అవగాహన 

ఈ పాసురమ్ మొదటి నాలుగు పంక్తుల్లో  చిత్రణను, సంఘటనను మన కళ్లముందు, మన మనసుల ముందు పెడుతోంది ఆణ్డాళ్. "ఎఱ్ఱతామరల రేకులు విరిసి, కలువల రేకులు మూసుకున్నాయి చూడు" అంటూ తెల్లవాఱుతోంది, చీకటి‌ తొలగిపోయింది అని గొప్పగా చెప్పింది ఆణ్డాళ్. 

"కాషాయవస్త్రాలతో, తెల్లటి పలువరుస ఉన్న తపస్వులు" అని ఆణ్డాళ్ చెప్పింది విన్నాక కాషాయం తపస్వుల రంగు అన్న నిజం మళ్లీ మనకు తెలియవస్తోంది. "తెల్లటి పలువరుస" అంటూ ఆ తపస్వులు తెల్ల రంగులా స్వచ్ఛమైన వాళ్లు అని చెప్పకుండానే చెబుతోంది ఆణ్డాళ్. ఆనాళ్లలో తెల్లవారుజామున గుళ్లల్లో శంఖం ఊది ఊళ్లో వాళ్లను దైవ కైంకర్యాలకు రమ్మని పిలిచే వాడుక ఉండేదని "గుళ్లల్లో శంఖం ఊదడానికి వెళుతున్నారు" అన్న మాట ద్వారా తెలియవస్తోంది. పాసురమ్ 6 లోనూ ఈ విషయం ప్రస్తావితమైందని గుర్తు చేసుకుందాం. 

"మాటలమంచి" అంటే మాటల్లో మాత్రమే మంచిగా ఉండి పనుల్లో ఉండనిది. తాను పెందరాడే లేచి అందఱ్నీ నిద్రలేపుతాను అని గొప్పగా చెప్పిన ఆ గోపకన్య ఇంకా నిద్ర లేవకపోవడంతో ఇకనైనా "మేలుకో సిగ్గులేనిదానా!, మాటలమంచీ!" అని అంటోంది ఆణ్డాళ్. మేలుకుని "శంఖు, చక్రం ఉన్న పెద్ద చేతులవాణ్ణి, కలువ కళ్లవాణ్ణి గానం చెయ్యి" అని కర్తవ్యాన్ని బోధిస్తోంది ఆణ్డాళ్. ఈ మాటల్ని విన్నాక కలువల్ని కళ్లుగానూ, శంఖు, చక్రాన్ని కలిగి ఉన్న అని చెబుతూ "సరసిజనయనే సశంఖ చక్రే..." అంటూ ముకుందమాల (శ్లోకం 10) లో కులశేఖర ఆళ్ష్వార్ పాడింది కూడా గుర్తుకు వస్తోంది. 

ఆణ్డాళ్ ఉద్బోధను ఆలకించి మనమూ మేలుకుని శంఖు, చక్రం ఉన్న పెద్ద చేతులవాణ్ణి,
కలువ కళ్లవాణ్ణి గానం చేద్దాం. 


రోచిష్మాన్
9444012279

ఎ.ఐ. మూలంగా మిత్రుడు దేవనాద(థ)న్ (శ్రీపూర్ణం) సంగీతబద్ధం చేసిన  తమిళ్ష్ పాసురమ్ 14

https://youtu.be/jYzjRK0HrW8?si=bzNGUlaZ6gVeZxKx

No comments:

Post a Comment