-------
ఆణ్డాళ్ - సినిమా
-------------
ఈ ధనుర్మాసంలో తమిళ్ష్ భాషకు చెందిన
తిరుప్‌పావై, ఆణ్డాళ్ పేర్లు మన తెలుగులోనూ ధ్వనిస్తూనే ఉంటాయి.
ఆణ్డాళ్ పన్నెండుమంది ఆళ్ష్వార్లలో ఏకైక స్త్రీ. ఆణ్డాళ్ కాలం ఎనిమిదో శతాబ్ది. కొందఱు సామాన్య శకం 716 నుండి 731 వఱకూ ఆణ్డాళ్ కాలమనీ, కొందఱు 776 ఆణ్డాళ్ జన్మ సంవత్సరమనీ చెబుతారు. ఆణ్డాళ్ జన్మ నక్షత్రం పుబ్బ అనీ, రాశి సింహ అనీ చెబుతారు. భక్తిలో లోతుగా మునిగి ఉన్న పురుషుణ్ణి ఆళ్ష్వార్ అంటారు. స్త్రీ కాబట్టి ఆళ్ష్వాళ్ అనీ ఆ ఆళ్ష్వాళ్ ఆణ్డాళ్ అయింది అనీ చెబుతారు.
1937లోనే తమిళ్ష్‌లో ఆణ్డాళ్ గురించి ఒక సినిమా వచ్చింది! ఆ సినిమా పేరు 'ఆణ్డాళ్ తిరుక్‌కల్యాణమ్'. ఈ సినిమాను 'సారదా ఫిలిమ్స్ మద్రాస్' సంస్థ నిర్మించింది. ఆణ్డాళ్ పాత్రను నటి సారదా (శారద) పోషించారు. సుందరమూర్తి ఓదువార్ అనే నటుడు మరో ప్రధాన పాత్రధారి. ఈ 'ఆణ్డాళ్ తిరుక్‌కల్యాణమ్' సినిమాకు దర్శకుడు ఆర్. ప్రకాష్. ఈ ఆర్. ప్రకాష్ మన రఘుపతి వెంకయ్య కొడుకు.
ఆశ్చర్యం ఏమిటంటే.. ఈ 'ఆణ్డాళ్ తిరుక్‌కల్యాణమ్' సినిమాను 1941లో మరో సంస్థ కొనుక్కుని యథాతథంగా సినిమాను
'కోదైయిన్ కాదల్' అనే మరో పేరుతో విడుదల చేసింది!
1937లోని ఆణ్డాళ్ తిరుక్‌కల్యాణమ్', 1941లో వచ్చిన 'కోదైయిన్ కాదల్' వేరువేరు సినిమాలు అనుకున్నారు పరిశీలకులు. కానీ ఇటీవల ఈ రెండు సినిమాలు ఒకటే అని సంతానకృష్ణన్ గారు తేల్చారు. నాకు ఈ సినిమాకు సంబంధించిన వివరాలు, పాటల పుస్తకం ఆధారం ఇచ్చిన వారు సంతానకృష్ణన్ గారే.
(తిరునిన్ఱవూర్ టీ. సంతానకృష్ణన్ మన వీ.ఎ.కె. రంగారావు కన్నా ఎక్కువ రికడ్స్ లేదా రికార్డులు (ఫోనో గ్రామ్, గ్రామ్ ఫోన్, ఎల్.పీ., ఈ.పీ., ఎస్. పీ. రికడ్స్) కలిగి ఉన్నవారు. సినిమాలకు సంబంధించి 2000 పుస్తకాలు ఆయన దగ్గర ఉన్నాయి. 30,000 సినిమాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఇంకా సీ.డీ.లు, డీ.వీ.డీ.లు, ఫోటోలు
వేలాదిగా ఆయన దగ్గర ఉన్నాయి. సినిమా సమాచారానికి సంబంధించి మన వీ.ఎ.కె. రంగారావు కన్నా మేలైన వారు, ప్రామాణికమైన వారు, సరైన వారు, ఎక్కవ విషయం, ఆకరాలు, డాక్యుమెంటేషన్ కలిగి ఉన్నవారు సంతానకృష్ణన్)
'ఆణ్డాళ్ తిరుక్‌కల్యాణమ్' సినిమా గురించి నాకు తెలియజేసిన సంతానకృష్ణన్ గారికి ధన్యవాదం.
రోచిష్మాన్
9444012279
No comments:
Post a Comment