Wednesday, December 31, 2025

 💛💜 మనసు కథలు 💜💛

💜💛 అమ్మ - సహనం 💛💜

సహన పేరుకి తగ్గట్టు సహనంగా ఉండేది..తోడబుట్టినవాళ్ళు, బంధువులు, స్నేహితులు ఎవరితో అయినా సర్దుకుపోయేది. అందరి ఆనందంలో తన ఆనందాన్ని చూసుకునేది. చిన్నవయసులోనే పని చేసినా చదివినా అన్నీ చురుకుగా చేసేసేది. 

పెళ్ళి అయ్యింది. భర్త మంచివాడే కానీ భార్యమనసుని తెలుసుకునే తత్వం కాదు. అంతా యాంత్రికం. లోకం ఎలా నడిస్తే మనమూ అలానే నడిస్తే సరిపోతుంది అనుకుని బతికేసే రకం. 

అత్తగారు నోటితో మంచిగా మాట్లాడుతూ వెనుక హేళన చేసేది కోడలిగురించి మావగారితో మాట్లాడేటప్పుడు. నమ్మతగిన మనిషి కాదని అర్ధమయ్యింది సహనకి . 

సహనకి పండంటి పాప పుట్టింది . ప్రేమ అని పేరు పెట్టారు. 

సహనకి అందరంటేనే అంత ప్రేమ, ఇహ తన కూతురు ప్రేమ అంటే చాలా అపురూపం. 

ఒకరోజు తప్పనిసరి పరిస్థితులలో పాపను అత్తగారికి అప్పగించి బయటకు వెళ్ళివచ్చింది. పాప సబ్బుతో ఆడుతూ, సబ్బును నోట్లో పెట్టుకుంటూ, మూల స్టాండ్ దగ్గర కనిపించింది. అయ్యో అనుకుని పాప చేతులు శుభ్రంగా కడిగింది. అత్తగారి మీద కోపం వచ్చింది. ఆలస్యం అవుతున్నా వంటప్రయత్నాలన్నవే మొదలుపెట్టలేదు అత్తగారు, ఇటు పాపను చూడట్లేదు, అటు షుగర్ పేషంట్ అయిన మావగారికి సమయానికి భోజనం పెట్టాలని ఆలోచించలేదు. ఎందుకింత నిర్లక్ష్యం అత్తగారికి అనుకుని బాధపడుతోంది సహన, చకచక వంటపని చేస్తూ..

మంచం అంచున కూర్చుని ఆడుతూ ఉన్న పాప మంచం పక్కకి జారిపడిపోయింది, దబ్బుమని శబ్దం వచ్చింది, పాప కెవ్వుమని ఏడుపు మొదలుపెట్టి, తరువాత శబ్దం లేకుండా, గుక్కతిప్పుకోలేనట్టు ఏడుస్తోంది..అయ్యో పాపా అని సహన పరిగెత్తుకొచ్చి ఏడుస్తున్న పాపను ఎత్తుకుంది..

అత్తగారు నింపాదిగా టీవీ ముందు నుంచీ లేవకుండా, అంత పాపను కూడా చూసుకోకుండా ఏమి చేస్తున్నావ్ అంది సాగదీస్తూ..

అప్పుడే పాప ఏడుపు నుంచి తేరుకుని తల్లి భుజం మీద తల ఆనించుకుంది..ఏమిటో ఈ కాలం ఆడపిల్లలు ఒక్కపనీ సరిగా చేయరు అంది సాధింపుగా అత్తగారు..

సహన హాల్లోకెళ్ళి టీవీ ఆఫ్ చేసేసింది..ఏయ్ టీవీ ఎందుకే తీసేసావ్ అంది. ముందు మీరు లేచి వంటింట్లోకి వెళ్ళండి, మావగారికి సమయానికి భోజనం తయారు చేసి ఇవ్వండి అంది సూటిగా అత్తగారిని చూస్తూ..

ఏమే పొగరు పట్టిందా అనబోయింది అత్తగారు. పాపను చూసుకోకుండా ఏం చేస్తున్నావ్ అన్నారుగా ఇందాక, అప్పుడు  నేను చేస్తోంది వంట, అదిప్పుడు మీరు చేస్తే, నేను నా పాపను భద్రంగా చూసుకుంటా అని లోపలికి వెళ్ళిపోయింది. 

వంటిట్లోంచి గిన్నెల చప్పుడు చాలా గట్టిగా వినిపిస్తోంది. అప్పుడు సహన అనుకుంది, మా అమ్మ నుండి నాకు అందినది ఇదే..హద్దు మీరనంత వరకూ మనం భరించాలి, హద్దు మీరితే, తప్పుని భరించకుండా, సరిదిద్దాలి, కుదిరితే స్నేహంగా, కుదరకపోతే కళ్ళెర్ర జేసయినా సరే.. అని తన అమ్మని తలుచుకుంది వణుకుతున్న గుండెకు ఊరటగా, అమ్మా..అనుకుంది అమ్మని తలుచుకుంటూ ధైర్యం కొనితెచ్చుకోవటానికి సహన...

తులసీభాను.

No comments:

Post a Comment